13 ఏండ్ల తర్వాత సిక్కింలో దలైలామా టూర్​

13 ఏండ్ల తర్వాత సిక్కింలో దలైలామా టూర్​

గ్యాంగ్​టక్​:  టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో 13 ఏండ్ల తర్వాత సిక్కింకు వచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం ఉదయం సిక్కిం చేరుకున్నారు. తూర్పు సిక్కింలోని లిబింగ్ ఆర్మీ హెలిప్యాడ్ వద్ద ఉదయం 10.30 గంటలకు దలైలామా హెలికాప్టర్‌‌ నుంచి దిగగా.. ఆ స్టేట్​సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ మఠాల సన్యాసులు కూడా బౌద్ధ సంప్రదాయ నృత్యం షెర్బాంగ్, ప్రార్థనలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దలైలామా గ్యాంగ్‌‌టక్‌‌లోని ఒక హోటల్‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా దలైలామాను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

కాగా, 87 ఏండ్ల దలైలామా, బోధిసత్వాల ముప్పై-ఏడు పద్ధతులపై బోధనలు చేయనున్నారు. భారత్‌‌, చైనా సరిహద్దు ప్రాంతమైన నాథులాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాంగ్‌‌టక్‌‌లోని పాల్జోర్ స్టేడియంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు బౌద్ధ ప్రార్థనలు, బోధనలు నిర్వహిస్తారు. సుమారు 40 వేల మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని పోలీసులు తెలిపారు.  అలాగే, గ్యాంగ్‌‌టక్ జిల్లా సిమ్మిక్ ఖమ్‌‌డాంగ్ నియోజకవర్గంలో రుమ్‌‌టెక్, గ్యాల్వా లాట్‌‌సున్ చెన్‌‌పో విగ్రహం వద్ద కర్మప పార్క్ ప్రాజెక్టుకు దలైలామా వర్చువల్‌‌గా శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్‌‌ సిలిగురిలోని సాలుగరాకు వెళ్తారని చెప్పారు. దలైలామా చివరిసారి సిక్కింను 2010లో సందర్శించారు. ఈ ఏడాది అక్టోబర్‌‌ నెలలో సిక్కింకు ఆయన రావాల్సి ఉండగా.. వరదల కారణంగా దలైలామా పర్యటన వాయిదా పడింది.