స్పేస్​లో టిక్​టాక్ చేసి పాపులర్ అయ్యింది

స్పేస్​లో టిక్​టాక్ చేసి పాపులర్ అయ్యింది

టిక్​టాక్​లో పాపులర్ అయ్యేందుకు డాన్సులు, ఫన్నీ వీడియోలు చేస్తుంటారు చాలామంది. కానీ, అవేమీ చేయకుండానే ఈమె టిక్​టాక్ వీడియో వైరల్​ అవుతోంది. కారణం... ఈమె టిక్​టాక్ చేసింది అంతరిక్షంలో. ఇంటర్నేషనల్ స్పేస్​ సెంటర్​లో మొదటి టిక్​ టాక్ వీడియో చేసిన ఈమె పేరు సమాంతా క్రిస్టోఫొరెట్టి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి. ప్రస్తుతం ఎలాన్​మస్క్​కు చెందిన స్పేస్​ ఎక్స్​ కంపెనీ అంతరిక్షం లోకి పంపిన క్రూ–4 మిషన్​లో ఒక మెంబర్. 

క్రిస్టోఫొరెట్టి స్పేస్​లోకి వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా అంతరిక్ష కేంద్రం గురించి టిక్​టాక్​లో వీడియోలు పెట్టేది. ఈసారి స్పేస్ సెంటర్​ నుంచి  టిక్​టాక్​ వీడియో చేసి, అంతరిక్షంలో మొదటి టిక్​టాక్ వీడియో చేసిన వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది.  ‘మళ్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్​లో’.. అనే క్యాప్షన్​ రాసి 88 సెకండ్ల  వీడియోని  పోస్ట్ చేసింది. అందులో స్పేస్ ఎక్స్​ మిషన్​​ జీరో– జి ఇండికేటర్ గురించి,  తన స్పేస్ జర్నీతో పాటు సిమ్మిఎట్టా( అంటే ఇటాలియన్​ భాషలో ‘చిన్న కోతి’ అని అర్థం) అనే కోతి బొమ్మ గురించి కూడా చెప్పింది క్రిస్టోఫొరెట్టి. 
 

స్పేస్ స్టేషన్​ గురించి చెప్తూ.. 
‘‘స్పేస్​ ఎక్స్ క్రూ–4 మిషన్ మొదటి 4 రోజులు చాలా బిజీగా గడిచాయి. స్పేస్​ స్టేషన్​లో జీవితం గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?  ఉంటే కామెంట్ బాక్స్​లో నన్ను అడగండి. గుర్తు పెట్టుకోండి.... ఏ టిక్​టాకర్​ను ఫాలో కానంతగా నన్ను ఫాలో అవ్వండి” అని ఆ వీడియోలో చెప్పింది క్రిస్టోఫొరెట్టి. ఆమె స్పేస్​ స్టేషన్​లో తేలియాడుతూ చేసిన ఈటిక్​టాక్ వీడియోని ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా చూశారు. ఏప్రిల్ 27న స్పేస్ ఎక్స్​ వాళ్ల క్రూ–4 మిషన్​లో అంతరిక్ష యాత్రకు వెళ్లింది క్రిస్టోఫొరెట్టి. ఆమె అక్కడే ఆరు నెలలు ఉంటుంది.