కాంగ్రెస్​లో టికెట్ల పంచాయితీ.. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు, నలురురు ఆశావహులు

కాంగ్రెస్​లో టికెట్ల పంచాయితీ.. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు, నలురురు ఆశావహులు

పోటీపై ధీమాతో సీనియర్​ నాయకులు
టికెట్​ హామీతోనే పార్టీలోకి వచ్చామంటున్న కొత్త లీడర్లు

వెలుగు, నిజామాబాద్​: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిజామాబాద్​ జిల్లా నుంచి కొత్త, పాత లీడర్లు పోటీ పడ్తున్నారు. టికెట్​ తమకే వస్తుందని సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తుండగా, టికెట్​ హామీతోనే పార్టీలో చేరామని జూనియర్లు అంటున్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు టికెట్​ రేసులో ఉండడంతో ఈ పంచాయితీ ఎక్కడికి దారి తీస్తుందోనని క్యాడర్​ ఆందోళన చెందుతోంది.

బాల్కొండలో..

బాల్కొండలో కాంగ్రెస్​ టికెట్ ​కోసం నలుగురు పోటీ పడుతున్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి ఇప్పటికే టికెట్ఆశిస్తుండగా, కిసాన్​ఖేత్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి సైతం పోటీపై నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఆరేంజ్​ ట్రావెల్స్​యజమాని ముత్యాల సునీల్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి టికెట్ హామీతోనే పార్టీలో జాయిన్​అయినట్లు సునీల్​రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. బీఎస్పీ వీడి బీజేపీలో వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కాంగ్రెస్​లో వచ్చారు. బీసీ కోటాలో టికెట్​వస్తోందని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్​ధీమాగా ఉన్నారు.

రూరల్​లోనూ అంతే..

నిజామాబాద్​ రూరల్​ నుంచి ముగ్గురు కాంగ్రెస్​టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి టికెట్​పై ధీమాగా ఉండగా, తనకు సైతం పోటీకి అవకాశం కల్పించాలని మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​ నగేశ్​రెడ్డి కోరుతున్నారు. కొత్తగా టికెట్​పై ఆశతో అరికెల నర్సారెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరారు.​ మరో మాజీ మంత్రి కూడా హస్తం గూటికి రానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక్కడ ఆశావహుల సంఖ్య మరింత పెరగనుంది.

అర్బన్​లో పోటాపోటీ.. 

నిజామాబాద్​అర్బన్​లో నియోజకవర్గంలోనూ కాంగ్రెస్​ టికెట్​ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. పార్టీ స్టేట్​వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, నిజామాబాద్​నగర ప్రెసిడెంట్ ​కేశవేణు, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్​ టికెట్​తమకే దక్కుతుందని ఆశగా ఉన్నారు. జిల్లాలో సామాజిక సమీకరణలు తమకు అనుకూలిస్తాయని మహేశ్​గౌడ్, కేశవేణు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే 1960 దశకంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కుటుంబానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ తాజాగా అర్బన్​నియోజకర్గంపై నజర్​ పెట్టారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ పెద్దలతో సదరు వ్యక్తికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆర్మూర్​లో.. 

ఆర్మూర్​నుంచి బరిలో దిగాలని ఏబీ శ్రీనివాస్​అలియాస్​ చిన్నా ఆసక్తిగా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి ఇటీవల నియోజకవర్గంలో పాదయాత్ర చేయగా అన్నీ తానై వ్యవహరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్​ మార మోహన్​రెడ్డి టికెట్​రేసులో ఉన్నారు. మున్సిపల్​ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్​ పోటీ ఆశతో కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. వీరికి తోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య లీడర్​ వినయ్​రెడ్డి కాంగ్రెస్​వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.