పార్టీల్లో టికెట్​ పంచాది.. నాకే టికెట్​ అంటే నాకే అని ప్రచారం

పార్టీల్లో టికెట్​ పంచాది.. నాకే  టికెట్​ అంటే నాకే అని ప్రచారం
  •     వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు  

  •     అయోమయంలో క్యాడర్​ 

ఆసిఫాబాద్, వెలుగు: వచ్చే ఆరు నెలల్లో  అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్​ నియోజకవర్గాల్లో టికెట్ల పంచాది ఇప్పుడే మొదలైంది.  ఆయా పార్టీల్లోని నేతలు ఎవరికి వారే పాదయాత్రలు, అభివృద్ధి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.  టికెట్లు ఆశిస్తున్న వారు ప్రజల్లోకి వెళుతున్నారు.  జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఒక్కో పార్టీ నుంచే ఇద్దరూ అంతకంటే ఎక్కువ మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు.  వీరంతా ఎవరికి వారే తనకే టికెట్ వస్తుందంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు.  దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు అమోమయానికి గురవుతున్నారు. 

ఆసిఫాబాద్​ ఎస్టీ నియోజకవర్గంలో..

ఏజెన్సీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ధీమాగా ఉన్నారు.  అయితే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ మాత్రం టికెట్ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఉందని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ  బీజేపీ, కాంగ్రెస్ లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. బీజేపీ తరపున రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అజ్మీరా ఆత్మరామ్ నాయక్ తానే క్యాండిడేట్ అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరో వైపు  ఆదివాసీ నియోజకవర్గం కావడంతో తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ పోటీ మరి ఎక్కువైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్న దివంగత మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు కూతురు మర్సుకోల సరస్వతి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు సపోర్ట్ తో డాక్టర్ గణేష్ రాథోడ్ సైతం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అనార్ పల్లి సర్పంచ్ రాథోడ్ శేషారావు కాంగ్రెస్ టిక్కెట్ కోసం తన  ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రేసులో నేనంటే నేను అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.

సిర్పూర్ లో..

జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్ లో  సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కు బీఆర్ఎస్​ లో కాంపిటీషన్ లేనట్లే కనిపిస్తోంది. కోనేరు కోనప్పకే తిరిగి టికెట్ వస్తుందనే ప్రచారం ఉంది.  బీజేపీలో మాత్రం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ , సీనియర్ లీడర్ పాల్వాయి హరీశ్ బాబు టికెట్ రేసులో ఉన్నారు.  బీఆర్ఎస్  వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో  సీనియర్ లీడర్ రావి శ్రీనివాస్,  మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు  చెందిన కృష్ణారెడ్డి ఎవరికి వారు టికెట్ తమకే వస్తుందని ఆశగా ఉన్నారు.  ఎవరికి టికెట్ వస్తుంది, ఎటు వైపు తిరగాలి అన్న సంశయంలో అన్ని పార్టీల కార్యకర్తల్లో కనిపిస్తుంది.  ఇలా ఎవరికి వారు టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ ఆయా పార్టీల అధిష్టానం మాత్రం సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే  టిక్కెట్లు కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.