మునుగోడు బైపోల్ లో బీసీలకే టికెట్ ఇవ్వాలని అధికార పార్టీల బలంగా వినిపిస్తోంది. ఉపఎన్నిక టికెట్ బీసీ వ్యక్తికే ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. మునుగోడులో 2లక్షల 26వేల ఓట్లు ఉంటే అందులో.. 2లక్షల 5వేల ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలవేనన్నారు. మునుగోడులో కేవలం బీసీ ఓట్లే లక్షా 40వేల ఓట్లు ఉంటాయన్నారు. టికెట్ బీసీలకు ఇవ్వాలని అడగటంలో తప్పు లేదన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి 12సార్లు ఎన్నికలు జరిగితే 8సార్లు రెడ్లు, 4సార్లు వెలమలు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అందుకే ఈసారి బీసీ వ్యక్తికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు...నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించే బహిరంగ సభకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో.. భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు జన సమీకరణలో బిజీగా ఉన్నారు.
సభలోనే మునుగోడు బై పోల్ అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పడంతో... ఆశావహులు చౌటుప్పల్ నుంచి నారాయణపురం వరకు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. ఎవరికి వారు సీఎం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బీసీలకే అవకాశం కల్పించాలని బూర నర్సయ్య గౌడ్ చెప్పడంపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అది ఆయన వ్యక్తిగతం అంటూ చెప్పారు. మరోవైపు మునుగోడులో ఎవరికి టికెట్ వస్తుందో.. సీఎం ఎవరి పేరు అనౌన్స్ చేస్తారో అనే టెన్షన్ టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
