బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో  గ్రూపు రాజకీయాల పంచాయితీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో  గ్రూపు రాజకీయాల పంచాయితీ
  • ఇతర జిల్లాకు షిఫ్ట్ అయ్యే యోచనలో బాల్క సుమన్ ?
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో  గ్రూపు రాజకీయాల పంచాయితీ
  • సమస్యల పరిష్కారం కాక     అధికార పార్టీపై వ్యతిరేకత
  • ‘ముందస్తు’కు రె ‘ఢీ’ అంటున్న కమలనాథులు
  • ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఎవరో ?!

మంచిర్యాల, వెలుగు: ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో మంచిర్యాల జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెడుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యలను ఎండగడుతున్నాయి.  అన్ని పార్టీలను గ్రూపులు కలవరపెడుతున్నాయి. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది. ఇందులో ఇద్దరికి రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందా, రాదా అన్న టెన్షన్ పట్టుకుంది. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర జిల్లాకు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు తన కొడుకును రంగంలోకి దించనున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కోవర్టు పాలిటిక్స్ చర్చకు దారితీశాయి. కొత్త ముఖాలు రాజకీయ తెరపైకి వస్తున్నాయి. దీంతో ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో అన్న అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. 

పరిష్కారం కాని ప్రధాన సమస్యలు

మంచిర్యాల జిల్లా తలాపునే గోదావరి ఉన్నా ప్రజలకు సాగు, తాగునీరు కరువైంది. 15 ఏండ్లు గడిచినా ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు నష్టం జరుగుతోంది. గూడెం ఎత్తిపోతల పథకంతో నీళ్లు రాక 20వేల ఎకరాల్లో యాసంగి పంటలు ఎండుతున్నాయి. రైతులు సాగునీటి కోసం రోడ్లెక్కాల్సిన దుస్థితి నెలకొంది. మంచిర్యాల– అంతర్గాం గోదావరి బ్రిడ్జితో పాటు ఆర్ఓబీలు, రోడ్ల నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. 50వేల ఎకరాల్లో పోడు, ఫారెస్ట్ – రెవెన్యూ భూముల పంచాయతీలు పరిష్కారం కాలేదు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ, పాత మంచిర్యాలలోని శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ తో పాటు పలు సిరామిక్స్, ఇండస్ర్టీస్ మూతబడి వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సింగరేణి ఏరియాల్లో ఇండ్ల పట్టాలు, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికు లు, కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం కానున్నాయి.  

సిట్టింగులకు టికెట్ టెన్షన్

రానున్న ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో ఆదరణపై పార్టీ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ ఘోరంగా పడిపోయినట్టు సర్వేల్లో తేలడంతో ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు ఇప్పటికి నాలుగుసార్లు గెలిచారు. అయినా ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఈసారి దివాకర్​రావుకు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొడుకు విజిత్​రావుకైనా టికెట్​ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదీ వీలుకాకపోతే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. పోటీలో గడ్డం అరవిందరెడ్డి, మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్లు గాజుల ముఖేశ్​గౌడ్, తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్​ పేర్లు వినిపిస్తున్నాయి. 

నల్లాల ఓదెలుకు టికెట్​ఇస్తరా? 

చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్​కు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డిలతో విభేదాలున్నాయి. పైగా పార్టీ సర్వేల్లో సుమన్​కు నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు సమాచారం. దీంతో రానున్న ఎన్నికల్లో చొప్పదండి లేదా హైదరాబాద్ పరిధిలోని నియోజకర్గానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. సుమన్ వేరే జిల్లాకు మారితే చెన్నూరు టికె ట్ తనదేనని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చెప్తున్నారు. అయితే బాల్క సుమన్​ ఇక్కడినుంచే పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కాంగ్రెస్​లో గ్రూపులు, కోవర్టులు...

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణులను గ్రూపులు, కోవర్టు రాజకీయాలు కలవరపెడుతున్నాయి. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు వ్యవహార శైలిని శైలిని వ్యతిరేకిస్తూ పలువురు లీడర్లు దూరంగా ఉంటున్నారు. ప్రేమ్​సాగర్​రావు..టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి వ్యతిరేక వర్గంలో కలిసి పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయన పట్ల రేవంత్ సీరియస్​గా ఉన్నట్టు సమాచారం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ​తరపున చాన్స్ వస్తే పోటీ చేసేందుకు సీనియర్ లీడర్ కేవీ.ప్రతాప్ రెడీగా ఉన్నారు. అయితే  ఎన్నికల నాటికి ప్రేమ్​సాగర్​ రావు కాంగ్రెస్​లో లేకుంటే ప్రతాప్​ కు సీటు ఖామమంటున్నారు. ఇక చెన్నూర్ కాంగ్రెస్​లో బలమైన లీడర్ రాకుండా ప్రేమ్​సాగర్​రావు తన అనుచరుడైన రమేశ్​ను ముందుపెట్టి నడిపిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎస్సీల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో బీఎస్పీ సైతం ఇక్కడినుంచి పోటీకి సై అంటోంది. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్​లో సైతం లుకలుకలున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. 2018లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఎన్నికలకు వారం రోజుల ముందు బీఎస్పీ గుర్తుపై పోటీ చేశారు. ఎవరూ ఊహించని సంఖ్యలో ఓట్లు సాధించినప్పటికీ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్యనే వరించింది. అయితే ప్రేమ్​సాగర్​రావు బెల్లంపల్లిలోనూ వినోద్​కు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  తన అనుచరుడైన చిలుముల శంకర్​కు టికెట్ ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. 

ఉత్సాహంగా కమలదళం...

మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ విస్తరిస్తోంది. జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రోజురోజుకు బలపడుతోంది. కేంద్ర, రాష్ర్ట నాయకత్వాల మార్గదర్శకత్వంలో రానున్న ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధమవుతోంది. 2018లో వెరబెల్లి రఘునాథ్​రావు మంచిర్యాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యలపై దూడుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్​లో జోష్ నింపుతున్నారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నారు. చెన్నూర్ నుంచి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ మరోసారి పోటీకి సై అంటున్నారు. కాళేశ్వరం ముంపు రైతులు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ నిత్యం జనం మధ్య ఉంటున్నారు. బెల్లంపల్లి నుంచి కొయ్యల ఏమాజీ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

బెల్లంపల్లి సీటు సీపీఐకా..బీఆర్ఎస్​కా? 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని జనాలు ఫీల్ అవుతున్నారు. నియోజకవర్గంలో భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా తెలంగాణ ఉద్యమకారుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్..ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సపరేట్ గ్రూప్ మెయింటెయిన్​చేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అందడందలున్నాయి. ప్రవీణ్ 2014, 2018 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. రెండుసార్లు నేతకాని వర్గానికి టికెట్ఇచ్చారని, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈసారి తనకే వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి అసెంబ్లీ బరిలో నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కుదిరితే బెల్లంపల్లి సీటు తమదేనని సీపీఐ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటుగా కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. 

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు 
అనుకూల అంశాలు 

  •     వివాదరహిత వ్యవహార శైలి, సౌమ్యుడిగా పేరు
  •     నిత్యం గ్రామాల్లో తిరగడం, ప్రజల మధ్యలో గడపడం

 ప్రతికూల అంశాలు

  •     నాలుగుసార్లు గెలిచినా అభివృద్ధి జరగలే..
  •     అన్ని వ్యవహారాలను కొడుకు విజిత్​కు అప్పగించడం  
  •     ఎల్లంపల్లి భూనిర్వాసితుల సమస్యలు
  •     గోదావరి ఉన్నా సాగు, తాగునీటి కొరత
  •     వరద బాధితులకు సాయం అందించడంలో వైఫల్యం
  •     అనుచరులు, లీడర్ల భూదందాలు, అవినీతి వ్యవహారాలు

చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
అనుకూల అంశాలు...

    ఉద్యమకారుడు, కేసీఆర్, కేటీఆర్​లకు సన్నిహితుడు
    వ్యూహ రచన, ఆకట్టుకునే వాక్​చాతుర్యం 
    అభివృద్ధి పనులు

ప్రతికూల అంశాలు

  •    పార్టీలో గ్రూపు రాజకీయాలు 
  •   ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం కావడం 
  •     ప్రజలు, కార్యకర్తలు, కిందిస్థాయి లీడర్లతో సంబంధాలు లేకపోవడం
  •     మందమర్రి మున్సిపల్​ ఎన్నికలు, చెన్నూర్ రెవెన్యూ డివిజన్, 2 కొత్త మండలాలు, బస్ డిపో లాంటి హామీలు అమలుచేయకపోడం
  •     కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో వైఫల్యం
  •     కొత్త లిఫ్ట్ పనులు ప్రారంభించకపోవడం 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 
అనుకూల అంశాలు..

  •     స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం
  •     గ్రామాల్లో తిరగడం, కలుపుగోలుగా ఉండడం  
  •     ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు  
  •     అధిక సంఖ్యలో ఉన్న తన సామాజికవర్గం ఓట్లు

ప్రతికూల అంశాలు..

  •     దుందుడుకు వ్యవహార శైలి
  •     తరచుగా వివాదాల్లో నిలవడం 
  •     అనుచరుల భూకబ్జాలు, సెటిల్​మెంట్ల దందాలు
  •     బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ, బస్ డిపో, మండలానికో జూనియర్ కాలేజీ హామీలు నెరవేర్చకపోవడం
  •     మ్యాంగో మార్కెట్, సింగరేణి స్థలాల్లో ఇండ్ల పట్టాలు పెండింగ్