గుమ్మడికాయతో టిఫిన్ ఐటమ్స్​

గుమ్మడికాయతో టిఫిన్ ఐటమ్స్​

గుమ్మడి పండుతో స్వీట్ చేయడం తెలిసిందే. మరి గుమ్మడికాయతో టిఫిన్ ఐటమ్స్​ కూడా చేయొచ్చని తెలుసా? ఆశ్చర్యపోకండి. గుమ్మడికాయతో వేడి వేడిగా దోశలు వేసుకోవచ్చు. గుండ్రని పూరీలు పొంగించొచ్చు.అంతేకాదు.. తియ్యని అప్పాలు కూడా చేసుకోవచ్చు. మరింకేం.. వాటినెలా తయారుచేయాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.

దోశ

కావాల్సినవి :

బియ్యం – ఒక కప్పు, ఉప్పు, నీళ్లు – సరిపడా, ఉల్లిగడ్డ – చిన్నది
జీలకర్ర – పావు టీస్పూన్, పచ్చి కొబ్బరి తురుము – ఒక టీస్పూన్
గుమ్మడి తురుము – ఒక కప్పు, జీలకర్ర పొడి – అర టీస్పూన్​
బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్

తయారీ :

బియ్యం కడిగి, ఒక గంటసేపు నానబెట్టాలి. మిక్సీజార్​లో ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, గుమ్మడి తురుము వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేసి మిక్సీపట్టాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, బొంబాయి రవ్వ వేసి కలపాలి. దోశ వేయకోవడానికి వీలుగా సరిపడా నీళ్లు కలపాలి. ఆ తర్వాత వేడి పెనం మీద దోశ వేసుకుని, దానిపై నెయ్యి రాసి రెండు వైపులా కాల్చితే గుమ్మడి దోశ రెడీ.

పూరీలు

కావాల్సినవి :

గుమ్మడి తురుము – రెండు కప్పులు, గోధుమపిండి – రెండు కప్పులు
ఉప్పు – సరిపడా, కారం, పసుపు, ధనియాల పొడి, వాము – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ – పావు కప్పు
నూనె – రెండు టీస్పూన్లు

తయారీ :

ఒక గిన్నెలో గోధుమపిండి, గుమ్మడి తురుము, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వాము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, బొంబాయి రవ్వ, నూనె వేసి బాగా కలపాలి. మధ్యలో కొంచెం నీళ్లు పోస్తూ ముద్ద చేయాలి. గిన్నెపై మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఉండలు చేసి, పూరీలలా ఒత్తాలి. వాటిని మరిగే నూనెలో వేసి వేగిస్తే వేడి వేడి గుమ్మడి పూరీలు తినడానికి సిద్ధం.

స్వీట్ ఫ్రిట్టర్స్

కావాల్సినవి :

గుమ్మడి తురుము – రెండు కప్పులు, నూనె – వేగించడానికి సరిపడా
ఉప్పు – చిటికెడు, బియ్యప్పిండి, బెల్లం – ఒక్కోటి అరకప్పు చొప్పున
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్

తయారీ :

ఒక గిన్నెలో గుమ్మడి తురుము, బెల్లం, ఉప్పు, బియ్యప్పిండి, నెయ్యి వేసి కలిపి ముద్ద చేయాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలు చేయాలి. అరచేతికి నెయ్యి రాసి, ఉండల్ని చేత్తో అప్పాల్లా ఒత్తాలి. ఒక బాండీలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె కాగబెట్టాలి. ఆ నూనెలో అప్పాలను వేసి వేగించాలి. రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేగిస్తే.. స్వీట్​ ఫ్రిట్టర్స్ నోరూరిస్తాయి.