పత్తి ఏరుతున్న యువతిపై పులి దాడి.. అడవిలోకి గుంజుకుపోయింది

పత్తి ఏరుతున్న యువతిపై పులి దాడి.. అడవిలోకి గుంజుకుపోయింది

కూలీల అరుపులతో పరారైన పులి

అప్పటికే చనిపోయిన అమ్మాయి..

డెడ్‌‌బాడీని తెస్తుండగా మళ్లీ ఉరికొచ్చిన పులి  

మళ్లీ అరవడంతో బెదిరి అడవిలోకి పరుగు

ఆసిఫాబాద్‌‌ జిల్లా కొండపల్లిలో విషాదం

ఆసిఫాబాద్/కాగజ్‌‌నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. పత్తి ఏరుతున్న ఓ యువతిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగజ్‌‌నగర్‌‌ ఫారెస్టు డివిజన్‌‌ పెంచికల్‌‌పేట్‌‌ రేంజ్‌‌లోని కొండపల్లి బీట్‌‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కొండపల్లి గ్రామానికి దగ్గర్లోని చేనులో పత్తి ఏరడానికి ఆ ఊరికి చెందిన 10 మంది కూలీలు వెళ్లారు. పత్తి ఏరుతుండగా మధ్యాహ్నం టైమ్‌‌లో పులి ఒక్కసారిగా నిర్మల (18) అనే అమ్మాయిపై దాడి చేసింది. దగ్గర్లోని అడవిలోకి గుంజుకుపోయింది. తోటి కూలీలు అరుపులు, కేకలతో అమ్మాయిని అక్కడే వదిలేసింది. ఆ విషయం కూలీలు గ్రామస్తులకు చెప్పడంతో వాళ్లు వెళ్లి గాలించగా నిర్మల మృతదేహం కనిపించింది. డెడ్‌‌బాడీని తీసుకొస్తుండగా పులి మళ్లీ వెంబడించిందని, తాము మళ్లీ గట్టిగా అరవడంతో అడవిలోకి పారిపోయిందని గ్రామస్తులు చెప్పారు. నిర్మలపై పులి దాడి చేసినట్టు ఫారెస్టు అధికారులు నిర్ధారించారు. కొండపల్లి గ్రామానికి చెందిన పసుల పోషం, లక్ష్మక్కల కూతురు నిర్మల. వీళ్లది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు నిర్మల కూలీ పనులకు వెళ్తోంది.

ఆ కుటుంబాన్ని ఆదుకుంటం: జడ్పీ వైస్ చైర్మన్

పెద్దపులి దాడిలో గిరిజన యువతి మృతి చెందడం బాధాకరమని జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. ఘటన గురించి తెలియగానే ఆయన ఘటన స్థలాన్ని సందర్శించి నిర్మల కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సర్కారుదే బాధ్యత: గిరిజన సంఘం

నిర్మల మృతికి రాష్ట్ర సర్కారు, ఫారెస్టు డిపార్ట్‌‌మెంట్ పూర్తి బాధ్యత వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ‘20 రోజుల క్రితం దహేగాం మండలం దిగిడ గ్రామంలో పులి దాడిలో విఘ్నేష్ అనే యువకుడు మరణించిన విషయం మరువక ముందే ఈ ఘటన జరగడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పులి తిరుగుతున్నా ఫారెస్టు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు. నిర్మల కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌‌గ్రేషియా, ఐదెకరాల భూమి, ఇంట్లో ఒకరికి సర్కారు ఉద్యోగం, డబుల్‌‌ బెడ్రూమ్‌‌ ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు.

మా ప్రాణాలు ఎట్ల కాపాడ్తరో చెప్పాలె: గ్రామస్తులు

తమ ప్రాణాలు ఎలా కాపాడతారో చెప్పాలని నిర్మల మృతదేహంతో గ్రామస్తులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ‘రోజుకోదగ్గర పులి కనిపిస్తూ మనుషులు, పశువుల మీద దాడి చేస్తోంది. మా ప్రాణాలు పోతున్నా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. నిర్మల కుటుంబానికి న్యాయం చేయాలి’ అని డిమాండ్‌‌ చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీఎఫ్‌‌వో శాంతారాం, జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, లోకల్ ఎఫ్‌‌డీవో విజయ్ కుమార్ గ్రామస్తులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు సీఎం దృష్టికి తీసుకెళ్లి మరో రూ. 5 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామని కృష్ణారావు హామీ ఇచ్చారు. నిర్మల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, పులిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌‌లు, బోన్లు ఏర్పాటు చేస్తామని డీఎఫ్‌‌వో చెప్పారు.