- యాదగిరిగుట్ట మండలంలో ఓ దూడ, కుక్కను చంపిన పులి
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా యాదగిరిగుట్ట మండలంలో ఓ దూడను చంపిన పులి.. తర్వాత మరో కుక్కను చంపి లాక్కెళ్లింది. 20 రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామానికి చెందిన దండబోయిన చంద్రయ్య బావి వద్ద పశువుల పాకలో ఉన్న దూడను ఆదివారం తెల్లవారుజామున పులి చంపేసింది.
ఆ టైంలో అక్కడే తిరుగుతున్న ఓ కుక్క పులిని చూసి మొరగడంతో.. పులి దూడను వదిలేసి కుక్కను చంపి లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని పులి పాదముద్రలను పరిశీలించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి సూచించారు. పులి దూడను చంపిన విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
