కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో గత 5 రోజులుగా సంచరిస్తున్న పులి ఎక్కడా చిక్కలేదు. బుధవారం పులి కదలికలు కనిపించలేదు. జిల్లాలోనే పులి ఇంకా సంచరిస్తుందని అనుమానిస్తున్నారు. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో గత 5 రోజులుగా పులి సంచార ఆనవాళ్లు నిర్ధారణ అయ్యాయి. రాత్రి వేళల్లో ఆయాగ్రామాల్లో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది. ఫారెస్టు, వ్యవసాయ క్షేత్రాల్లో పులి సంచారం నిర్ధారణ అయినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆయా మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ శాఖ ప్రచారం నిర్వహిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే పులికి హాని కలిగించే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. రాత్రి వేళల్లో పశువులను వ్యవసాయ క్షేత్రాల్లో వదలవద్దని, పగటి పూట కూడా పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దన్నారు. పులి, దాని పాద ముద్రలు, పశువులపై దాడి జరిగినట్లు గమనిస్తే వెంటనే ఫారెస్టు, పోలీసు అధికారులకు తెలియజేయాలని కరపత్రాల్లో సూచించారు. పులికి హాని కలిగేలా విద్యుత్ కంచెలు, ఉచ్చులు, విష ప్రయోగం వంటివి చేస్తే అటవీ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.
