షాంఘైలో నెలరోజులుగా కఠిన లాక్ డౌన్

షాంఘైలో నెలరోజులుగా కఠిన లాక్ డౌన్
  • షాంఘైలో జనంపై ఉక్కుపాదం
  • ఇండ్లల్లనే రెండున్నర కోట్ల మంది బందీ
  • ‘జీరో కొవిడ్’ వ్యూహంతో అల్లాడుతున్న సిటీ
  • నిత్యావసరాలు అందక  జనం అవస్థలు
  • రంగంలోకి సైన్యం.. ఎక్కడికక్కడ కట్టడి 
  • ఇంత కఠిన ఆంక్షలపై అనుమానాలు

కరోనా పేరుతో చైనా ప్రభుత్వం షాంఘైలో అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు అక్కడి ప్రజలను ఊపిరాడనివ్వడం లేదు. ప్రపంచమంతా ఒమిక్రాన్ వేరియంట్​ను లైట్ తీసుకున్నా.. చైనా మాత్రం యుద్ధమే చేస్తోంది. వైరస్​ను నిర్మూలించడానికి ‘జీరో కొవిడ్’ వ్యూహంతో ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. షాంఘైలోని 2.5 కోట్ల మంది ఆంక్షలతో అల్లాడిపోతున్నారు. చాలా రోజుల పాటు నాలుగు గోడలకే పరిమితమైన జనాలు బాల్కనీల్లో నిలబడి అరుస్తున్నారు. కొంత మంది ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తుంటే సైన్యం వారిని విచక్షణారహితంగా కొడుతోంది. ఇక క్వారంటైన్ సెంటర్లలో ఉన్నోళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన తిండి, నిద్ర, స్నానం లేక అవస్థలు పడుతున్నారు. కరోనా కంటే ప్రభుత్వం విధించిన 
ఆంక్షలతోనే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు సడలిస్తున్న సమయంలో చైనా ఇంత కఠినంగా వ్యవహరిస్తుండడంపై ఎక్స్​పర్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

షాంఘై: చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. కానీ కోరల్లేని పామును చంపేందుకు 2.5 కోట్ల జీవితాలను రిస్క్‌‌లో పెట్టింది చైనా!! కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద డేంజర్ కాదని తెలిసినా, 85 శాతం మందికి సింప్టమ్స్‌‌ ఏవీ లేకున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా.. షాంఘై నగరాన్ని అష్టదిగ్బంధం చేసింది. దాదాపు నెలరోజులుగా లాక్‌‌డౌన్, ఎమర్జెన్సీకి మించిన ‘జీరో కొవిడ్’ వ్యూహంలో చిక్కుకుని షాంఘై అల్లాడుతున్నది. కరోనా కంటే ఇతర సమస్యలతోనే జనం చనిపోతున్నా.. ఆంక్షలను డ్రాగన్ సర్కారు సడలించడం లేదు. చంటి బిడ్డలకూ కరోనా రిపోర్టులు అడుగుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనాలో అసలేం జరుగుతోందంటూ ప్రపంచం కాస్త ఆసక్తిగా, మరింత అనుమానంగా చూస్తున్నది.
ప్రత్యక్ష నరకం
షాంఘైలో మార్చి నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువైంది. కేసులు బయటపడ్డ చోట బిల్డింగ్స్‌‌ను క్వారంటైన్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత సగం సిటీని లాక్‌‌డౌన్ చేశారు. కేసులు భారీగా రావడంతో మరో వారం రోజుల్లోనే ఏప్రిల్ 3న పూర్తిగా లాక్‌‌డౌన్ విధించారు.  ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేశారు. కఠినమైన ఆంక్షలు పెట్టారు. చిన్న పిల్లల్ని కూడా బలవంతంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. సోషల్ మీడియాపై సెన్సార్‌‌‌‌షిప్ విధించారు. మొత్తంగా షాంఘై ప్రజలకు చైనా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నది. కొత్త కేసుల్లో దాదాపు 85 శాతానికి పైగా అసలు ఏ లక్షాణాలూ ఉండట్లేదు. మరణాల సంఖ్య చాలా తక్కువ. కానీ కఠిన లాక్‌‌డౌన్ మాత్రం కొనసాగిస్తున్నారు. దేశాధ్యక్షుడు జిన్‌‌పింగ్ చెప్పిన ‘జీరో కొవిడ్ పాలసీ’నే ఇందుకు కారణమని ఎక్స్‌‌పర్టులు అంటున్నారు. ఇంత చేస్తున్నా రోజూ 20 వేల నుంచి 25 వేల దాకా కేసులు వస్తున్నాయి. శుక్రవారం 20 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మార్చి నుంచి ఇప్పటిదాకా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో అసింప్టమాటిక్ కేసులే ఎక్కువ. డైలీ మరణాల సంఖ్య 10 నుంచి 20 లోపే ఉంటున్నది. ఈ కేసులన్నీ వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వల్లే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ట్రీట్‌‌మెంట్ అందక, మానసిక ఆందోళనకు గురై
షాంఘైలో కరోనా కంటే ఇతర కారణాలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు.. ఆహారం, మందులు లేక చనిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 14న షాంఘై ఆరోగ్య శాఖ కమిషనర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైద్య సిబ్బంది మొత్తాన్ని కరోనా సేవలకు కేటాయించడం, కరోనా రిపోర్టు లేకుండా ఆసుపత్రిలోకి రానివ్వకపోవడంతో మరికొందరు మరణించారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వైరస్ సోకిన వాళ్ల పెంపుడు జంతువులను హెల్త్ వర్కర్స్ కొట్టి చంపేయడం వంటివీ జరిగాయి. ఇవేవీ ప్రధాన మీడియాలో రావట్లేదు. స్థానిక సోషల్ మీడియాలో వస్తున్నాయి. సెన్సార్‌‌షిప్ వల్ల అవి వెంటనే డిలిట్ అయిపోతున్నాయి. రోజుల కొద్దీ ఇండ్లలో ఉన్న జనం.. అపార్ట్‌‌మెంట్ల బాల్కానీలోకి వచ్చి అరుస్తున్నారు. నిరసనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సోల్జర్లు.. చాలా మంది పౌరులను, తమ ఆదేశాలను పాటించని వాళ్లను విచక్షణారహితంగా కొడుతున్నారు.
తిండి సహించక.. నిద్రలేక
క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవాళ్లకి ఆహారం నచ్చక, 24 గంటలు లైట్లు ఆన్ చేసి ఉండటం వల్ల సరిగా నిద్ర లేక, అందరినీ ఒకేచోట ఉంచడం వల్ల, నెగటివ్ వచ్చినా రిలీజ్ చెయ్యకపోవడం వల్ల ఇక్కట్లు పడుతున్నారు. వైరస్ తగ్గినా వారిని రిహాబిటేషన్ సెంటర్‌‌‌‌కి మారుస్తున్నారు. అక్కడ ఇంకో 14 రోజులు పెడ్తున్నారు. మళ్లీ పాజిటివ్ వచ్చిందంటే ప్రాసెస్ మొత్తం రిపీట్. అంతా బాగుండి.. ఇంటికి పంపిస్తే అక్కడ ఇంకో 14 రోజులు క్వారంటైన్‌‌లో ఉండాలి. నెలల వయసున్న చంటి బిడ్డలకు కూడా కరోనా రిపోర్టులు అడుగుతున్నారు.
ఇంత కఠినంగా ఎందుకు?
ఒమిక్రాన్ వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. తమకు తెలియగానే ప్రపంచాన్ని అలర్ట్ చేసింది ఆ దేశం. తొలుత వేగంగా వ్యాప్తి చెందిన ఒమిక్రాన్.. అంతే వేగంగా నెమ్మదించింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికా, ఇండియా సహా చాలా దేశాల్లో మాస్క్‌‌ల వాడకం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చైనాలో మాత్రమే కేసులు పెరగడం, వుహాన్‌‌ తర్వాత ఆ స్థాయిలో కఠినంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పెద్దగా ప్రభావం చూపని ఒమిక్రాన్ విషయంలో ఇంత కఠినంగా లాక్‌‌డౌన్ అమలు చేయడం ఎందుకనేది ఆఫీసర్లు చెప్పడం లేదు. హెనన్ ప్రావిన్స్‌‌లోని యుజౌ సిటీలో 3 కేసులొస్తేనే లాక్‌‌డౌన్‌‌ పెట్టిన ఆఫీసర్లు.. షాంఘైలో వేలల్లో కేసులు వస్తున్నా తొలుత పట్టించుకోలేదు. తర్వాత ఉన్నట్టుండి కఠిన లాక్‌డౌన్ పెట్టారు. నెల రోజులుగా సిటీని షట్‌‌డౌన్ చేసినా.. కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. దీంతో జీరో కొవిడ్ పాలసీపైనే ప్రశ్నలు వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఏదైనా పుట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆలస్యంగా కట్టడి చర్యలు చైనా మొదలు పెట్టిందనే సందేహాలు వస్తున్నాయి.