GSLV-F-16 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్.. జూలై 30న నింగిలోకి నిసార్ శాటిలైట్

GSLV-F-16 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్.. జూలై 30న నింగిలోకి నిసార్ శాటిలైట్

తిరుపతి: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. 2025, జూలై 30వ తేదీన జీఎస్ఎల్వీ F-16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ కేంద్రం నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16  రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూపరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. జీఎస్ఎల్వీ F-16  రాకెట్ ప్రయోగం నేపథ్యంలో సోమవారం (జూలై 28) షార్‎లో కీలకమైన ఎంఆర్ఆర్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్‎తో పాటు నాసా సైంటిస్టులు హాజరుకానున్నారు. 

నిసార్ శాటిలైట్ ప్రత్యేకతలు:

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR..  ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌‎ను భూమికి పంపించనుంది. తిరిగి వాటి రాకను విశ్లేషించి మన గ్రహం పర్యావరణం గురించి అపూర్వమైన సమాచారాన్ని అందించనుంది. 

ఆప్టికల్ ఉపగ్రహాల మాదిరిగా కాకుండా నిసార్ చెట్ల పందిరి, ఉప నిర్మాణాలు, మేఘాలు, పొగ ,వృక్షసంపద ద్వారా కూడా చూడగలదు. ఇది పగలు ,రాత్రి అన్ని వాతావరణంలో ఫొటోలను సేకరించే సామర్థ్యం కలిగి ఉంది. ఉపగ్రహ స్కాన్లు భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, నేల తేమ, హిమానీనదం కరగడం ,వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో సాయపడనుంది. 

నిసార్ భారత తీరప్రాంతాల నుండి డేటాను సేకరించి డెల్టాయిక్ ప్రాంతాల వెంట బాతిమెట్రీలో వార్షిక మార్పులను పరిశీలించనుంది. తీరప్రాంతం, కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. నిసార్ మిషన్ భారతదేశ అంటార్కిటిక్ ధ్రువ కేంద్రాల చుట్టూ ఉన్న సముద్రాలపై సముద్రపు మంచు లక్షణాలను మరింత లోతుగా పరిశీలించనుంది. రెండు రాడార్లను మోసుకెళ్లే మొదటి ఉపగ్రహం కావడంతో నిసార్ మిషన్ రెండు అంతరిక్ష సంస్థల మధ్య భూమిని పరిశీలించే మిషన్ పై మొదటి హార్డ్ వేర్ సహకారాన్ని కూడా అందిస్తుంది. 

నిసార్ ప్రత్యేకత ఏంటంటే.. అధిక రెజల్యూషన్ ఫొటోలు, డేటా అందిస్తుంది. ఈ సేవలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు,ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు నిసార్ కొన్ని మిల్లీమీటర్ల భూ కదలికను కొలవగల సామర్థ్యం, టెక్టోనిక్ కదలికలు, తీరప్రాంత కోతను ట్రాక్ చేయడానికి చాలా కీలకం. నిసార్ సేకరించిన డేటా భూగర్భజల వైవిధ్యం, అటవీ బయోమాస్ ఆనకట్టల సమగ్రత పరిశీలనకు సాయపడుతుందని, వాతావరణ శాస్త్రంతో పాటు విపత్తు నిర్వహణకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.