
ప్రజాప్రతినిధుల రీకాల్ చట్టం కోసం పోరాటం
బెల్లంపల్లి రోడ్ షోలో తీన్మార్ మల్లన్న
మందమర్రిలో అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ, పోలీసులు
బెల్లంపల్లి, వెలుగు : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ రూ.5.50 లక్షల కోట్ల అప్పులకుప్ప చేశాడని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చిన ఆయన రోడ్ షోలో మాట్లాడారు. రాష్ట్రాన్ని 7200 మంది దొంగలు దోచుకుతింటున్నారని వారిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు..అవినీతి, అక్రమాలు చేస్తున్నారని.. వీరిని రీకాల్ చట్టం ద్వారా తొలగించే హక్కును తీసుకువచ్చేందుకు పోరాడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన కేంద్రాల్లో 25 లక్షల 88 వేల 884 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎక్కడ ఖాళీ భూములు కనబడినా వదలడంలేదన్నారు. 7200 మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి భూమయ్య, మల్లన్న టీమ్మెంబర్స్పటేల్ సుధాకర్, సుదర్శన్ పాల్గొన్నారు.
సెక్యూరిటీ ఎస్‌ఓఎస్‌తో వాగ్వాదం
మందమర్రి : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి కార్మికులు, ఓబీ కాంట్రాక్ట్ కార్మికులను కలిసేందుకు బొగ్గు గనులు, ఓసీపీ ఓబీ క్యాంప్‌ప్రాంతానికి చేరుకున్న మల్లన్న టీంను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఫస్ట్ షిఫ్ట్ టైంలో మల్లన్న, అతని టీం సభ్యులు మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిపైకి చేరుకోగా ప్రధాన గేటు వేసి అడ్డుగా నిలిచారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ లో ఓవర్‌బర్డెన్ పనులు చేస్తున్న ఇతర రాష్ట్రాల కాంట్రాక్ట్ కార్మికులపై ఇటీవల లాఠీచార్జి జరగ్గా, ఆ వివరాలు తెలుసుకునేందుకు ఓసీపీ ఓబీ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్తుండగా మరోసారి అడ్డుకున్నారు. దీంతో ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి తీరుపై మల్లన్న మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులను కొట్టినప్పుడు ఎటు వెళ్లావని, ఉదయం ఎందుకు అడ్డుకున్నావంటూ నిలదీశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరకు టీం సభ్యులు వెనుదిరిగి వెళ్లారు. అంతకు ముందు మందమర్రి బస్టాండ్చౌరస్తాలో మల్లన్న మాట్లాడారు. దుబ్బాగూడెం నిర్వాసితుల సమస్యలను అడిగితెలుసుకున్నారు.
తెలంగాణలో బిహార్బ్యాచ్
కాగజ్‌నగర్ : రాష్ట్రంలో అందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బిహార్ వాళ్లే ఉన్నారని మల్లన్న అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్‌మిల్లులో కూడా బిహార్ డామినేషనే ఉందన్నారు. కాగజ్‌నగర్ వచ్చిన ఆయన ఎన్టీఆర్ చౌరస్తాలో మాట్లాడారు. ఈ నెల 28న రైతుబంధు డబ్బులు అకౌంట్లో వేస్తానని సీఎం చెప్పాడని, లిక్కర్ఆమ్దానీ కోసమే డిసెంబర్31కు ముందు ఈ కుట్ర చేశాడన్నారు. పేపర్‌మిల్లులో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై మంగళవారం రోడ్‌షో వాయిదా వేసి మరీ మాట్లాడుతానన్నారు.