
హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నరా?
కరోనా పాజిటివ్ వస్తే చాలా మందిలో సీరియస్ లక్షణాలేమీ ఉండట్లేదు. అలాంటివాళ్లు హోమ్ ఐసోలేషన్ పాటిస్తే చాలంటున్నారు డాక్టర్స్. సీరియస్ లక్షణాలున్న వాళ్లను మాత్రమే హాస్పిటల్స్‌కు రావాలని, మిగతావాళ్లు హోమ్ ఐసోలేషన్ పాటిస్తే చాలని ప్రభుత్వం కూడా చెప్తోంది. పాజిటివ్ వచ్చిన వాళ్లు మాత్రమే కాదు.. కరోనా లక్షణాలున్న వాళ్లు కూడా ఐసోలేషన్ పాటించడమే మంచిది. అయితే ఐసోలేషన్ ఎలా పాటించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గర ఉంచుకోవాల్సిన మెడికల్ కిట్, మెడిసిన్ ఏంటి? ఈ విషయంలో డాక్టర్స్, ప్రభుత్వం అందిస్తున్న సూచనలివి.
జ్వరం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న వాళ్లలో కొందరిలో కరోనా ఉన్నా, టెస్ట్‌లో పాజిటివ్ కనిపించకపోవచ్చు. కరోనా ఉండికూడా టెస్ట్‌లో పాజిటివ్ రాకపోతే దీన్ని ‘ఫాల్స్ నెగెటివ్’ అంటారు. అందుకే ‘ఒకసారి టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది కదా, ఇక కరోనా లేదు’ అనుకోవడం కరెక్ట్ కాదు. మళ్లీ మూడు రోజుల తర్వాత ఇంకోసారి టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా, కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్ పాటించాలి.
ఎవరికి ఐసోలేషన్?
తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు, హార్ట్, కిడ్నీ, ఇతర జబ్బులు లేనివాళ్లు మాత్రమే ఐసోలేషన్‌లో ఉండాలి. మిగతావాళ్లు హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రత్యేక గదిలోనే ఐసోలేషన్ పాటించాలి. సెపరేట్ బాత్‌రూమ్ ఉండాలి. నిబంధనల ప్రకారం ఇంట్లో వృద్ధులు, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న చోట ఐసోలేషన్ ఉండకూడదు. వాళ్లను వేరే చోటుకు పంపించడమో, లక్షణాలున్న వాళ్లే వేరే చోట ఉండటమో చేయాలి. ఎందుకంటే కరోనా రోగుల నుంచి వీళ్లకు త్వరగా వైరస్ వ్యాప్తి చెందొచ్చు.
కొన్ని రూల్స్
ఫ్యామిలీలో ఒకరికి కరోనా వస్తే మిగతావాళ్లు క్వారంటైన్ పాటించాలి.
పేషెంట్‌తోపాటు, కేర్ టేకర్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆరోగ్యసేతు యాప్ కచ్చితంగా వాడాలి.
కరోనా పేషెంట్స్ శుభ్రత పాటించాలి. దగ్గు, తుమ్ములు వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. న్యాప్‌కిన్స్ వాడొచ్చు. వాటిని మూత ఉన్న డస్ట్‌బిన్‌లోనే వేయాలి.
కర్చీఫ్‌లు వాడితే తిరిగి సోప్ వాటర్‌లో వాష్ చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. డ్రెస్‌లు, బెడ్‌షీట్స్, టవల్స్, ప్లేట్స్, గ్లాస్‌లు వంటివి వేరేవాళ్లు వాడకుండా చూసుకోవాలి. వాటిని కూడా రెగ్యులర్‌గా సోప్ లేదా హాట్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి.
వీలైతే పేషెంట్స్ తమ గదిని సొంతంగా క్లీన్ చేసుకోవడం బెటర్. వేరేవాళ్లు రూమ్ క్లీన్ చేస్తే కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. తప్పనిసరై, చేతకాని పరిస్థితిలో మాత్రమే కేర్‌టేకర్‌తో క్లీన్ చేయించుకోండి. ఇలా చేసేటప్పుడు పీపీఈ కిట్ లేదా ఎన్ 95 మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ కచ్చితంగా వాడాలి.
వీలైనంత వరకు పేషెంట్స్ తమ గదిలోనే ఉండటం బెటర్. తప్పనిసరై గది నుంచి బయటికి వస్తే, గ్లోవ్స్, మాస్క్, ఫేస్ షీల్డ్ వాడాలి. ఇతరులెవరూ దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి.
స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉంటే మానెయ్యాలి. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల లంగ్స్ మరింతగా దెబ్బతింటాయి.
ఎనిమిది నుంచి పదిగంటలు నిద్రపోవాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. గోరువెచ్చటి నీటిని మాత్రమే తాగుతుండాలి.
వీలైనంత వరకు బోర్లా పడుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తులకు గాలి బాగా అందుతుంది.
దగ్గర్లోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ డాక్టర్స్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా కన్సల్ట్ చేసి, వారి ప్రిస్క్రిప్షన్, సూచనల్ని పాటించాలి. రోజూ కనీసం రెండుసార్లు డాక్టర్స్‌ను సంప్రదిస్తూ, మీ హెల్త్ స్టేటస్‌ను వివరించాలి.
కేర్‌టేకర్స్ జాగ్రత్తలు
ఏ అనారోగ్య లక్షణాలు లేనివాళ్లు మాత్రమే కరోనా పేషెంట్స్‌కు కేర్ టేకర్స్‌గా ఉండాలి.
పేషెంట్స్ వాడే వస్తువులు ఇంట్లో ఎవరూ తాకకూడదు.
పేషెంట్ గదిలోకి లేదా దగ్గరగా వెళ్లినప్పుడు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. అలాగే మూడు లేయర్స్ కలిగిన మాస్క్ లేదా పీపీఈ కిట్ తొడుక్కోవాలి.
పేషెంట్ దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత కిట్ తీసేసి, సోప్ వాటర్‌లో కనీసం అరగంటపాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని వీలైతే కాల్చేయాలి. లేదంటే ఎవరూ ముట్టుకోకుండా కవర్స్‌లో చుట్టి పడేయాలి. రెగ్యులర్ డస్ట్‌బిన్‌లో వేయకూడదు.
శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే ఇంట్లో మిగతా వస్తువులను తాకాలి.
ఇంటిని రెగ్యులర్‌గా శానిటైజ్ చేస్తుండాలి.
ఏమేం ఉండాలి?
పాజిటివ్ వస్తే కొన్ని మెడిసిన్స్ తప్పనిసరిగా వాడితేనే క్యూర్ అవుతుంది. విటమిన్–సి, మల్టీ విటమిన్స్, పారాసెటమాల్, అజిత్రోమైసిన్ వంటి మెడిసిన్స్ డాక్టర్స్ సూచనల ప్రకారం వాడాలి. టెంపరేచర్ చెక్ చేసుకునేందుకు డిజిటల్ థర్మామీటర్, ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్ తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. ముఖ్యంగా పల్స్ ఆక్సిమీటర్ ద్వారా రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలుస్తుంది. రోజూ మూడు నుంచి నాలుగు సార్లు దీన్ని చెక్ చేసుకోవాలి. నిర్ణీత లెవెల్‌కంటే ఆక్సిజన్ తక్కువుంటే వెంటనే హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల సీరియస్ కాకముందే జాగ్రత్తపడొచ్చు. పల్స్ ఆక్సిమీటర్స్ వల్ల కరోనా మరణాల రేటు తగ్గించవచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. పేషెంట్ గదిలో ఎన్ 95 మాస్క్‌లు, గ్లోవ్స్, శానిటైజర్, ఫేస్ షీల్డ్స్ కచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఈమధ్య ఐసోలేషన్ కిట్స్‌ను అందిస్తోంది. వీటిలో విటమిన్ ట్యాబ్లెట్స్, ఇతర మెడిసిన్స్, గ్లోవ్స్, శానిటైజర్స్, మాస్క్‌లు ఉన్నాయి. అధికారులను సంప్రదించి వీటిని పొందొచ్చు. దగ్గర్లోని హాస్పిటల్స్‌కు చెందిన అంబులెన్స్ ఫోన్ నెంబర్స్, కోవిడ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
ఎప్పటివరకు?
హోమ్ ఐసోలేషన్‌లో కనీసం పదిహేడు రోజులు ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొదటి ఏడు రోజుల తర్వాత జ్వరం వచ్చి ఉండకూడదు. ఐసోలేషన్ టైమ్ పూర్తై, లక్షణాలు తగ్గితే మళ్లీ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు నెగెటివ్ వస్తే, డాక్టర్స్ సూచనల ప్రకారం ఐసోలేషన్ పూర్తి చేసుకోవచ్చు.
బీ పాజిటివ్
కరోనా పేషెంట్స్‌కు అన్నింటికంటే ముఖ్యమైంది పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ అని రాగానే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కోలుకుంటామన్న నమ్మకం ఉంటేనే, దీన్ని దాటగలడం సాధ్యం. సీరియస్ లక్షణాలుంటే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి. లేదంటే ఐసోలేషన్ పాటించాలి. ఏమైనా డౌట్స్ ఉండే దగ్గర్లోని వైద్య సిబ్బందికి సమాచారం అందించి సాయం పొందొచ్చు. గవర్నమెంట్, ఇతర సంస్థలు అందిస్తున్న హెల్ప్‌లైన్ నెంబర్స్‌కు కాల్ చేయొచ్చు. వీడియో కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మీ వాళ్లతో టచ్‌లో ఉంటూ పాజిటివ్‌గా ఉండాలి. మీకున్న స్పేస్‌లో వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. పుస్తకాలు చదవడం, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూడటం, మ్యూజిక్ వినడం, పెయింటింగ్, రైటింగ్ వంటివి చేయొచ్చు. మంచి ఆహారం తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్, మజ్జిగ తీసుకుంటే మంచిది. నెగెటివ్ ఆలోచనలు, డిప్రెషన్ వంటివి ఉంటే ఆన్‌లైన్‌లో సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ తీసుకోవాలి.
హాస్పిటల్‌కు ఎప్పుడు వెళ్లాలి?
ఐసోలేషన్‌లో ఉన్నంత మాత్రాన అందరూ కోలుకుంటారని చెప్పలేం. అందుకే ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని అంచనా వేసుకోవడం ముఖ్యం. థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్‌ను ఎప్పటికప్పుడు డాక్టర్‌తో షేర్ చేసుకోవాలి. వాళ్ల సూచనల ఆధారంగా హాస్పిటల్‌కు వెళ్లాలి. కింది లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.
ఆక్సిజన్ లెవల్స్ 94 కంటే తగ్గితే హాస్పిటల్‌కు తీసుకెళ్లి, ఆక్సిజన్ అందించాలి.
పల్స్ రేట్ 60–100 ఉండాలి. 60కి తగ్గినా, 100 కంటే ఎక్కువైనా డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలి.
ఛాతిలో నొప్పి ఎక్కువైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు
బెడ్‌పై నుంచి లేవలేని పరిస్థితిలో, అయోమయానికి గురైనప్పుడు
పెదవులు, ముఖం నీలి రంగులోకి మారుతున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని అర్థం.
ఏడు రోజులకు మించి జ్వరం తగ్గకుండా ఉన్నా లేదా టెంపరేచర్ 103 కంటే ఎక్కువున్నా హాస్పిటల్‌కు వెళ్లాలి.