మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : జిల్లా వ్యవసాయాధికారి కల్పన

మంచిర్యాల జిల్లాలో యూరియా కొరత లేదు : జిల్లా వ్యవసాయాధికారి కల్పన

బెల్లంపల్లి రూరల్​, వెలుగు: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి కల్పన అన్నారు. బుధవారం నెన్నెల మండల కేంద్రంలోని మహిళా ఉత్పత్తిదారుల సంస్థ(డబ్ల్యూఎఫ్​పీసీ), ఎరువుల దుకాణాలను భీమిని ఏడీఏ సురేఖ, ఏవో సృజనతో కలిసి పరిశీలించారు. యూరియా స్టాక్​ నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. డబ్ల్యూఎఫ్​పీసీ ఎదుట జరిగిన రైతు గొడవ యూరియా కోసం కాదని, వ్యక్తిగత కారణాలతో గొడవ పడ్డారని తెలిపారు. 

నెన్నెల మండలానికి 342 మెట్రిక్​టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. డీలర్లు షాపులను మూసి ఉంచకుండా రోజు తెరిచి ఉంచాలని ఆదేశిం చారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

యూరియా, డీఏపీ కొరత లేకుండా చూడాలి

భైంసా, వెలుగు: వానాకాలం సీజన్​లో సాగుచేస్తున్న పత్తి, సోయా, ఇతరత్ర పంటలకు యూరియా, డీఏపీ ఎరువులు చాలా అవసరమని, వాటి కొరత లేకుండా చూడాలని అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. బుధవారం భైంసా పట్టణంలోని వ్యవసాయ శాఖ ఆఫీస్​లో ఏడీఏ వీణకు రైతులు వినతిపత్రం అందించారు. అంతకు ముందు ఏడీఏతో రైతుల తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. యూరియా, డీఏపీ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సకాలంలో దొరకడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీఎస్ ఆఫీస్​లోనూ యూరియా లేదని అధికారులు చెబుతున్నారని, సకాలంలో ఎరువులు లేకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సమస్యలు విన్న ఏడీఏ.. పీఏసీఎస్​ అధికారులు, వ్యాపారులతో మాట్లాడారు. ప్రతి ఒక్క రైతుకు ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించారు.