పెట్స్​కి ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనితరి

 పెట్స్​కి ఇన్ఫెక్షన్లు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనితరి

వానాకాలంలో పెంపుడు జంతువులకి రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.  వాటిలో వర్షంలో తడవడం వల్ల, మట్టి ద్వారా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అందుకని ఈ సీజన్​లో పెట్స్​ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసం వాటికి పెట్టే ఫుడ్​తో పాటు వాటి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి అంటున్నాడు వెటర్నరీ డాక్టర్ దిలీప్​ సొనూనే.   పెంపుడు జంతువుల్ని వాకింగ్​కి తీసుకెళ్లినప్పుడు  బ్యాక్టీరియా, వైరస్​లు మట్టితో పాటు వాటి కాళ్లలో చిక్కుకుంటాయి. అందుకని బయటికి తీసుకెళ్లి వచ్చిన ప్రతిసారి వాటి పాదాల్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, మెత్తని టవల్​తో తుడవాలి. కాళ్ల సందుల్లో నూనె కూడా వేయాలి. ఇలాచేస్తే వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు రావు.  

కొన్ని పెట్స్​ గడ్డిమీద నడిచేందుకు ఇష్టపడతాయి​. దాంతో  గరుకుగా ఉండే గడ్డిపోచలు కోసుకుపోయి వాటి కాళ్ల కింది చర్మం దెబ్బతిని డెర్మటైటిస్​ సమస్య వస్తుంది. అంతేకాకుండా అవి నాలుకతో పాదాల్ని శుభ్రం చేసుకుంటాయి. అలాచేస్తే వాటి పాదాలకు అంటిన మట్టి, క్రిములు పొట్టలోకి చేరి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకని వాటి ఇమ్యూనిటీ పెంచేందుకు  ప్రొ–బయాటిక్ ఫుడ్ ఇవ్వాలి. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పెట్స్​కి  మరిగించిన నీళ్లు లేదా ఫిల్టర్​ నీళ్లు తాగించాలి. ఇలాచేస్తే జీర్ణ సమస్యలు తగ్గిపోయి అవి హుషారుగా ఉంటాయి.

ఈ సీజన్​లో పేలు, పెద్ద ఈగలు, దోమల కారణంగా పెట్స్​ జబ్బు పడే అవకాశాలు ఎక్కువ.  కాబట్టి పెంపుడు జంతువులు ఆడుకునే, నిద్రపోయే ప్లేస్​ని శుభ్రంగా ఉంచాలి. వాటి రెస్టింగ్ బెడ్​ని మారుస్తుండాలి. ఈ కాలంలో వాతావరణంలో తేమ వల్ల పెట్స్​ బొచ్చు తడిగా ఉంటుంది. తడి వల్ల వాటికాళ్ల మీద బ్యాక్టీరియా వంటి క్రిములు పెరిగి స్కిన్​ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.  ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అందుకని యాంటీ–ఫంగల్ పౌడర్​ వాడాలి. పెట్స్​కు వాటర్​లెస్​ షాంపూతో స్నానం చేయించాలి. అవి వానలో తడవకుండా వాటికి సరిపోయే రెయిన్​కోట్​ వేయాలి.  

పెట్స్​కి ఫైబర్ ఉండే ఫుడ్ పెట్టాలి. అంతేకాదు అవి బరువు పెరగకుండా ఉండేందుకు వాటి యాక్టివిటీకి తగ్గట్టుగా ఫుడ్ ఉండాలి. ఇవేకాకుండా...  వెటర్నరీ డాక్టర్​ని కలిసి పెట్స్​కు డీవార్మింగ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. అవసరమైతే  వ్యాక్సిన్ ఇప్పించాలి. గోర్లు పెరిగితే ఎప్పటికప్పుడు కత్తిరించాలి.