ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, షేర్ మార్కెట్లలో భారీ ఒడిదుడుకుల మధ్య ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం, వెండి ఎప్పుడూ నమ్మదగ్గ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లే. ప్రస్తుతం పెరుగుతున్న రేట్లలో కేవలం బంగారం లేదా కేవలం వెండిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలా అనే గందరగోళం ఉన్నవారికి 'గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్' ఒక అద్భుతమైన ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. ఇవి ఒకేచోట రెండింటి ప్రయోజనాలను అందిస్తూ.. అటు స్థిరత్వాన్ని, ఇటు వృద్ధిని బ్యాలెన్స్ చేస్తుంటాయి.
సాధారణంగా బంగారాన్ని ఆర్థిక సంక్షోభ సమయాల్లో 'సేఫ్ హెవెన్'గా భావిస్తారు. మార్కెట్లు పడిపోయినప్పుడు లేదా కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుంది. మరోవైపు వెండికి పారిశ్రామికంగా అధిక డిమాండ్ ఉంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీలో వెండిని విరివిగా వాడటం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు వెండి ధరలు పెరుగుతాయి. అంటే బంగారం మీ పెట్టుబడికి రక్షణ ఇస్తే.. వెండి వేగంగా లాభాలను అందించే వృద్ధిని ఇస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రిస్క్ తగ్గి, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండిలో 50:50 రేషియోలో పెట్టుబడి పెట్టడం వల్ల ఒడిదుడుకులు తక్కువగా ఉండి, రాబడి నిలకడగా ఉంటుందని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ లెక్కల చెబుతున్నాయి. ఉదాహరణకు గతంలో వెండి భారీగా పెరిగినప్పుడు అది బంగారాన్ని మించిపోయింది. కానీ పడిపోయినప్పుడు కూడా వెండిలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయాల్లో బంగారం పతనాన్ని అడ్డుకుని పెట్టుబడిని కాపాడుతుంది. 2025లో వెండి 167 శాతం, బంగారం 75 శాతం లాభాలను తెచ్చిపెట్టిన తీరు ఈ రెండింటి కలయిక ఎంత శక్తివంతమైనదో నిరూపించింది.
వాస్తవానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ నేరుగా ఫిజికల్ గోల్డ్ లేదా సిల్వర్ కొనకుండా, గోల్డ్అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. దీనివల్ల స్వచ్ఛత గురించి ఆందోళన ఉండదు, దాచుకోవడానికి లాకర్లు అవసరమూ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా సామాన్య పెట్టుబడిదారులకు ఏ సమయంలో ఏ మెటల్ కొనాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ ఫండ్స్ క్రమ పద్ధతిలో రీబ్యాలెన్సింగ్ చేస్తూ మన పెట్టుబడిని క్రమబద్ధీకరిస్తాయి. తమ పోర్ట్‌ఫోలియోలో 10 నుండి 15 శాతం వరకు ఈ తరహా లోహాలకు కేటాయించడం ద్వారా అటు ఈక్విటీ మార్కెట్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు, ఇటు భవిష్యత్ అవసరాలకు తగిన సంపదనూ సృష్టించుకోవచ్చు.
