
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట 4 కిమీ మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు . ఉచిత సర్వ దర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటల సమయం.... 300/- రూపాయల ప్రత్యేక దర్శనం భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.
ఇక శుక్రవారం ( September 5) తిరుమల శ్రీవారిని 69 వేల 531 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31 వేల 439 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. సెప్టెంబర్ 5 వ తేది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
12 గంటల పాటు దర్శనాలు నిలిపివేత..
సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని 12గంటల పాటు మూసివేయనున్నారు. ఆదివారం ( సెప్టెంబర్7) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోమవారం ( సెప్టెంబర్ 8) ఉదయం ఆరు గంటల వరకూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు.
ఆదివారం రోజున శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో తీసుకున్న భక్తులను మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. సెప్టెంబర్ 7 ఆదివారం చంద్రగ్రహణం కావడంతో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని, ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.