తిరుమల శ్రీవారి లడ్డూకు 310 ఏళ్లు పూర్తి.. ఎలా ప్రారంభమైంది.. ఇంతటి ఖ్యాతి గాంచిన ప్రసాదం ప్రస్థానం !

తిరుమల శ్రీవారి లడ్డూకు 310 ఏళ్లు పూర్తి.. ఎలా ప్రారంభమైంది.. ఇంతటి ఖ్యాతి గాంచిన ప్రసాదం ప్రస్థానం !

తిరుమల అంటే శ్రీవారి లడ్డూ అనేంతలా ప్రతిష్ఠకు ఎక్కింది శ్రీవారి ప్రసాదం. తిరుమల దర్శనానికి ఎవరు వెళ్లినా లడ్డూను రుచి చూడకుండా ఉండలేరు. కొందరు వెళ్లకపోయినా తెప్పించుకుని కళ్లకు అద్దుకుని తింటారు.  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో తిరుమల లడ్డూకు ఎనలేని ఆదరణ ఉంది. అలాంటి శ్రీవారి లడ్డూ ఇవాళ్టితో (శనివారం ఆగస్టు 02) 310 ఏళ్లు పూర్తి పూర్తి చేసుకుంటోంది. 

310 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమల ప్రసాదానికి ఉన్న విశిష్టత.. ఒక్క రోజుతో వచ్చిన ఆదరణ కాదు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మార్పులు చేస్తూ.. భక్తులకు మరింత నాణ్యతతో రుచి, శుచి, శుభ్రతతో తయారు చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రసాదంగా చరిత్రకెక్కింది. 

  ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టు 2 వ తేదీన ప్రారంభించారు. 2010 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది.‌. భక్తుల అధిక రద్దీ కారణంగా ప్రతి నిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. 15 శతాబ్దం లో భక్తులకి వడ ప్రసాదం మాత్రమే అందించేవారు అర్చకులు. ఆ తర్వాత17 వ శతాబ్దం నుంచి బుంది లడ్డూ ను అందించారు. ఆ తరువాత  లడ్డూలు తయారు చేసినవారు హథీరాంజీ మఠం నిర్వహకులు.

1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం‌ తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటుతరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదంను ఎనిమిది నాణేలకే ఇచ్చేవారని, అటుతరువాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది. 1940 వ సంవత్సరాన్ని‌ ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 83 సంవత్సరాలు అవుతుందని కొందరు చెబుతారు. 

ఇంతటి విశిష్టత, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్నా తరగని రుచితో.. హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది .

శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకతను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. డూప్లికేట్ తయారు చేసి  ఆన్ లైన్ లో విక్రయించేందుకు ఎన్నో సంస్థలు ప్రయత్నించాయి. కానీ తిరుమల లడ్డూతో సరిసమానంగా నిలవలేకపోయాయి. ఆన్ లైన్ లో లడ్డూలను విక్రయించే సంస్థలన్నింటికీ నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేసింది టీటీడీ.