చంద్రగిరిలో ఎర్రచందనం స్మగ్లింగ్​.. 8మంది అరెస్ట్​.. 33 దుంగలు స్వాధీనం

చంద్రగిరిలో ఎర్రచందనం స్మగ్లింగ్​.. 8మంది అరెస్ట్​.. 33 దుంగలు స్వాధీనం

అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఎర్రచందనం స్మగర్లను టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.  అన్నమయ్య జిల్లా బాలపల్లి అటవీ ప్రాంతంలోనూ, తిరుపతి జిల్లా చంద్రగిరిలో 33ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని, 8మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ పోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.శ్రీనివాస్ అధ్వర్యంలో  రెండు టీమ్ లు.. అన్నమయ్య జిల్లా బాలపల్లి, భాకరాపేట అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కే. అల్లిబాషా టీమ్ స్థానిక అటవీ అధికారులతో కలసి సిద్దలేరు నుంచి కూంబింగ్ చేపట్టారు.  శుక్రవారం ( ఆగస్టు 23) రాజంపేట డివిజన్ బాలపల్లి బీటు పరిధిలో   కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే సరికి దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లరు  తమిళనాడు కల్లకురుచ్చి జిల్లాకు చెందిన చంద్రశేఖర్ (22), శంకర్ (29), వెంగటేశన్ (34), ఎంజీఆర్ (46), లక్ష్మణన్ (57), సెల్వరసు (21)లుగా గుర్తించారు.  ఆప్రాంతంలో పడి ఉన్న 25ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | అనకాపల్లి ఫార్మా సెజ్లో మరో అగ్ని ప్రమాదం

 ఆర్ఐ (ఆపరేషన్స్) కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ తిరుపతి జిల్లా చంద్రగిరి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేసింది. కల్యాణి డ్యాం నుంచి  ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేశారు. భాకరాపేట రేంజి, నాగపట్ల సెక్షన్ పరిధిలోని నరసింగాపురం రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేస్తూ కనిపించారు. పోలీసుల రాకను గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు కారులో పారిపోయారు.  వీరిని లింగాధర్ టీమ్ మోటారు సైకిళ్లపై వెంబడించి చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద అడ్డుకున్నారు. కారు డ్రైవరు సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో 7ఎర్రచందనం దుంగలు లభించగా, రైల్వే బ్రిడ్జి కింద ఒక ఎర్రచందనం దుంగ లభించింది. వీరు కూడా తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన హరిస్టాటిల్ రవి (30), రంజిత్ చిన్నపయ్యన్ (30)లుగా గుర్తించారు.  మెత్తం కారు ఎనిమిదిదఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ..  తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో రెండు కేసులు  నమోదు చేశారు.