విభజన సమస్యలను కేసీఆర్ పట్టించుకోలే: ప్రొఫెసర్ కోదండరాం

విభజన సమస్యలను కేసీఆర్ పట్టించుకోలే: ప్రొఫెసర్ కోదండరాం
  • విభజన సమస్యలను కేసీఆర్ పట్టించుకోలే
  • పదేండ్లలో ఖజానాను బీఆర్​ఎస్​ ఖాళీ చేసింది
  • “విభజన హామీలు, కేంద్రం వివక్ష”పై టీజేఎస్ సదస్సు
  • సర్కార్ అయినా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వక్తల సూచన 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నిరంకుశ పాలనకు చరమగీతం పాడామని, ఇది రాష్ట్ర ప్రజల విజయమని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గత పదేండ్లలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఎన్నో సమస్యలను పెండింగ్ లో పెట్టి వెళ్లారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో మిత్రపక్షంగా వ్యవహరిస్తూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో “రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ వివక్ష” అంశంపై టీజేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణలో, తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రలో పని చేస్తున్నారని, వారి ఫైల్ ను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారన్నారు. ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని, విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఆయన ఒత్తిడి తేలేదని విమర్శించారు. 

‘‘పార్లమెంట్ లో కేంద్రం పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం అందలేదు. వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు. పోలవరం ముంపు సమస్యను పరిష్కరించలేదు. కృష్ణా జలాల పంపిణీ పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నది నిర్వహణ, మరమ్మతులకు అనుమతి తీసుకోవాలని చెప్తోంది. కేంద్ర గెజిట్ ప్రకారం కృష్ణా బోర్డుకు హక్కులు కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా నీళ్లు రాకపోతే తెలంగాణకు తాగు నీరు అందే పరిస్థితి లేదు” అని కోదండరాం గుర్తు చేశారు. 

కేంద్రంపై ఒత్తిడి తేవాలె..

రాష్ర్టంలో ప్రస్తుతం ప్రజాస్వామిక వాతావారణం కనపడుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాష్ర్ట విభజన టైమ్ లో ఉన్న ఆనందం గత పదేండ్లలో నీరుగారిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టూ భూకబ్జాలు పెరిగాయన్నారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేండ్లయినా విభజన సమస్యలను కేంద్రం పరిష్కరించలేదని రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రు నాయక్ అన్నారు. 

మరో 5 నెలల్లోనే విభజన హామీల గడువు ముగియనుందన్నారు. అన్ని రంగాల మేధావులతో ఒక టీమ్ ను రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాష్ట్రానికి విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై గత బీఆర్ఎస్ సర్కారు ఒత్తిడి తేలేదని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చూపిందన్నారు. దేశంలో అతిపెద్ద అవినీతి నేత కేసీఆర్ అని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఆరోపించారు.    

జీవో 317తో టీచర్లకే ఎక్కువ నష్టం 

గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో  సర్కారు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని, ప్రధానంగా టీచర్లకే ఎక్కువ నష్టం జరిగిందని కోదండరాం అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్​లో జీవో 317 బాధిత సంఘం ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పోస్టులకు, అక్కడికి కేటాయించే పోస్టులకు వ్యత్యాసం రావడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు.

 కొత్త జిల్లాల్లో అదనపు మండలాలను చేర్చుతుండటం వల్ల కూడా స్థానికత సమస్య వస్తోందన్నారు. డిమాండ్ ఉన్న 9 జిల్లా కేంద్రాల్లో పోస్టింగులను ఎక్కువ మంది కోరుకోవడం కూడా మరో సమస్యగా మారిందన్నారు. అలకేషన్ సీలింగ్ అనేది తీసేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి, బాధిత టీచర్ల సంఘం ప్రతినిధులు, పీఆర్టీయూటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.