సీఎం, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : ధర్మార్జున్

సీఎం, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : ధర్మార్జున్

సూర్యాపేట, వెలుగు:  కమీషన్ల కోసం నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన సీఎం కేసీఆర్, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్‌‌‌‌, డిజైన్లను ప్రజల ముందు ఉంచాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.

సీఎం, మంత్రులు వాటిని రహస్యంగా ఉంచి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యత , పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగాయని నేషనల్ డ్యామ్స్‌‌ సేఫ్టీ అథారిటీ అధికారుల రిపోర్ట్‌‌తో వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం, సరస్వతి, మల్లన్న సాగర్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం వైఫల్యంపై నవంబర్ 11న సూర్యాపేటలో ఇంజనీర్లతో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

టీజేఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు రమా శంకర్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్,  పట్టణ అధ్యక్షుడు బంధన్ నాయక్, ఆత్మకూరు కోఆర్డినేటర్ శ్రీనివాస్, నేతలు కృష్ణ యాకూబ్, రాజు పాల్గొన్నారు.