టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్

టీఎంసీ నేత షాజహాన్ అరెస్ట్

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్  షాజహాన్ ను   పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జనవరి 5న సోదాలకు వచ్చిన ఈడీ అధికారులపై దాడి చేసిన 55 రోజుల తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్​ఖాలీలో స్థానికుల భూములను కబ్జా చేశాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని షాజహాన్ పై ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు, దోపిడీలు, సెటిల్ మెంట్లు కూడా చేశాడని స్థానికులు గతంలో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రేషన్  సరుకుల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జనవరి 5న ఈడీ అధికారుల బృందం సందేశ్ ఖాలీలోని షాజహాన్  ఇంట్లో సోదాలకు వెళ్లగా.. అతని అనుచరులు ఆ బృందంపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత కల్ కత్తా హైకోర్టు ఆదేశించడంతో షాజహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, షాజహాన్  తరపు అడ్వొకేట్ అతనికి ముందస్తు బెయిల్  ఇవ్వాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిని కల్ కత్తా హైకోర్టు తిరస్కరించింది. నిందితుడిపై 43 తీవ్రమైన కేసులు ఉన్నాయని, అతడిపై  ఎలాంటి సానుభూతి లేదని పేర్కొంది. కాగా, అరెస్టు తర్వాత షాజహాన్ ను టీఎంసీ ఆరేండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తప్పు చేసిన వారు తమ వారైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక షాజహాన్ ను అరెస్టు చేయడంతో సందేశ్ ఖాలీలోని మహిళలు  హోలీ వేడుకలు చేసుకున్నారు.