కారులో వెళ్తుంటే నాటు బాంబులు వేసి.. టీఎంసీ యువ నేత హత్య

కారులో వెళ్తుంటే నాటు బాంబులు వేసి.. టీఎంసీ యువ నేత హత్య

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ యువ నేత రాణాజోయ్ కుమార్ శ్రీవాస్తవ (33)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారులో వెళ్తుండగా అడ్డగించి, తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ హత్య వెనుక బీజేపీ నేతలు ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే తృణమూల్‌లోనే అంతర్గత విభేధాలతో జరిగిన హత్య ఇది అని బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. 

ఐదుగురి అరెస్ట్

ఖర్ధా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాజల్ సిన్హాకు అత్యంత సన్నిహితుడైన శ్రీవాస్తవ శనివారం ఉదయం తటీగఢ్‌లోని తన ఇంటికి కారులో వెళ్తుండగా సంధ్య సినిమా థియేటర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. తృణమూల్ యూత్ వింగ్ హిందీ సెల్ చీఫ్‌గా ఉన్న శ్రీవాస్తవ కారుపై నాటు బాంబులు వేశారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే కండిషన్ సీరియస్‌గా ఉందని మెరుగైన చికిత్స కోసం అతడిని డాక్టర్లు తటీగఢ్‌ నుంచి కోల్‌కతాకు తరలిస్తుండగా మరణించాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన  పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

ఎన్నికల ముందు బీజేపీ నుంచి పార్టీ మారి..

ఈ హత్య వెనుక బీజేపీ కుట్ర ఉందని తృణమూల్ పార్టీ నార్త్ 24 పరగణాస్ జిల్లా అధ్యక్షుడు జ్యోతిప్రియా మల్లిక్ ఆరోపించారు. ఖర్ధా నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో భయం సృష్టించడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే శ్రీవాస్తవ బీజేపీ నుంచి తృణమూల్ పార్టీలో చేరారని, ఆయనపై కక్ష గట్టి బీజేపీ నేతల చంపేశారని టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్‌ ఘోష్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. శ్రీవాస్తవ అసలు ఎప్పుడూ బీజేపీలో లేనేలేడని, తృణమూల్ పార్టీలో ఉన్న​ అంతర్గత కలహాలతో ఆయనను సొంత పార్టీ నేతలే హత్య చేశారని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ అన్నారు. పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్న ఐదుగురు అనుమానితులు తృణమూల్ పార్టీకి చెందిన వాళ్లేనని ఆయన అన్నారు. 

కాగా, ఖర్ధాలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాజల్ సిన్హా కోసం ఎన్నికల సమయంలో శ్రీవాస్తవ చాలా కష్టపడ్డాడు. ప్రచారం మొదలు పోల్ మేనేజ్‌మెంట్ వరకూ అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నాడు. అయితే ఎన్నికల కౌంటింగ్‌కు ముందే కాజల్ సిన్హాకు కరోనా రావడంతో మరణించారు. అయితే ఎన్నికల ఫలితం మాత్రం ఆయనకే అనుకూలంగా వచ్చింది. సిన్హానే ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరగాల్సి ఉంది.