మాజీ సీజేఐ గొగోయ్ కు ప్రివిలేజ్ నోటీస్

మాజీ సీజేఐ గొగోయ్ కు ప్రివిలేజ్ నోటీస్

ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది. తనకు నచ్చినప్పుడు పార్లమెంటుకు వెళ్తానన్న ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ మౌసమ్ నూర్ నోటీసు ఇచ్చారు. జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యలు రాజ్యసభను ధిక్కరించేలా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయనిటీఎంసీ అందులో ప్రస్తావించింది. ఆయన కామెంట్లు సభ ప్రత్యేక అధికారాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడింది. టీఎంసీతో పాటు వివిధ పార్టీలకు చెందిన మరో 10 మంది ఎంపీలు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 9న జస్టిస్ గోగోయ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రాజ్యసభకు గోగోయ్ హాజరు కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన కోవిడ్ కారణంగా రెండు సమావేశాలకు హాజరు కాలేకపోయానని, సభలో సీటింగ్ ఏర్పాట్లు బాగోలేవని అభిప్రాయపడ్డారు. తనకు నచ్చినప్పుడు, తాను మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయని భావించినప్పుడే రాజ్యసభకు వెళ్తానని చెప్పారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కానని.. తనకు ఎవరూ విప్ జారీ చేయలేరని అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఎలాంటి జీతం తీసుకోవడం లేదని, ఏ ట్రైబ్యునల్‌కో ఛైర్మన్ అయ్యుంటే మంచి జీతం, సౌకర్యాలు ఉండేవని అన్నారు. 2020లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గొగోయ్ సభ జరిగిన రోజుల్లో పదో వంతు కూడా హాజరు కాలేదు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.