కాళీమాతపై టీఎంసీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు

 కాళీమాతపై టీఎంసీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు

కాళీ మాత పోస్టర్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా కాళీ మాతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం దగ్గర సాధువులు ఎప్పుడూ స్మోకింగ్ చేస్తూ కనిపిస్తారన్నారు. తన దృష్టిలో కాళీమాత మాంసం తినే మద్యం తాగే వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాలో జరిగిన ఇండియా టుడే సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని ట్వీట్ చేసింది టీఎంసీ. దీంతో బీజేపీ నేతలు టీఎంసీ పై విమర్శలు గుప్పించారు,  మహువా మెయిత్రా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ఎలా అంటుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుంకాత మజుందార్. మహువా మొయిత్రాను పార్టీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ అయినా చేయాలి లేదా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంపీని అరెస్టు చేసే వరకు బీజేపీ మహిళా మోర్చా ధర్నాకు దిగుతుందన్నారు. అటు టీఎంసీ పార్టీ అధికారిక ట్విటర్  ఖాతాను మహువా మొయిత్రా అన్‌ఫాలో చేశారు. కానీ ఆ పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ ఖాతాను మాత్రం ఆమె ఫాలో అవుతున్నారు. 

కాగా కాళీ మాత వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చూపే డాక్యుమెంటరీ పోస్టర్ ను ఆన్ లైన్ లో విడుదల చేశారు మధురైకి చెందిన దర్శకురాలు లీనా మణిమేఖలై. దీనితో ఆమెపై 153, 295 ఏ సెక్షన్ల కింద నిన్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాళీ పోస్టర్ ప్రొడ్యూసర్ ఆశా అసోసియేట్స్, ఎడిటర్ శ్రవణ్ ఓనచంద్,లీనా పై లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.