జేఏసీగా ఏర్పడుదాం: అశ్వత్థామరెడ్డి

జేఏసీగా ఏర్పడుదాం: అశ్వత్థామరెడ్డి
  • జేఏసీగా ఏర్పడదాం: అశ్వత్థామరెడ్డి
  • రేపు సమావేశమై కార్యాచరణపై చర్చిద్దాం
  • అన్ని ఆర్టీసీ యూనియన్లకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారానికి అందరం కలిసి జేఏసీగా ఏర్పడి పోరాడుదామని ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విద్యానగర్​లోని యూనియన్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం ఇక్కడే తమ ఆఫీసులో సమావేశం అవుదామని అన్ని యూనియన్ల నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో చర్చించి జేఏసీగా ఏర్పడదామని కోరారు.

సర్కార్​పై ఒత్తిడి కోసం

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం 2 పీఆర్సీలు బకాయి ఉంది. యూనియన్లు లేకపోవటంతో అధికారుల వేధింపులు పెరిగాయని కార్మికులు అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదని, పని ఒత్తిడి పెరిగి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూనియన్ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలకు ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి యూనియన్లతో సమావేశమై చర్చలు జరిపారు. మునుగోడులో సుమారు 7వేలకు పైగా ఆర్టీసీ కార్మికుల ఓట్లు ఉండటంతో వాటి కోసం  డీఏలు ప్రకటించారు. ఆర్టీసీలో యూనియన్లు పునరుద్దరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో పీఆర్సీ ఇస్తామని పర్మిషన్ ఇవ్వాలని ఈసీకి లేఖ కూడా రాశారు. అయితే బైఎలక్షన్ పూర్తయిన తరువాత ప్రభుత్వం, మంత్రులు సైలెంట్ అయ్యారు. మునుగోడులో మంత్రులతో నిర్వహించిన మీటింగ్​లో కలిసి యూనియన్ నేతలు వినతిపత్రం ఇవ్వటానికి కూడా కేటీఆర్ అంగీకరించలేదు.

భవిష్యత్ కార్యాచరణ చర్చిద్దాం

కొంత కాలంగా ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం, సంస్థ యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా మర్చిపోయారని నేతలు మండిపడుతున్నారు. యూనియన్ల ఉనికి ఉండకూడదని చైర్మన్, ఎండీ చేసిన ప్రకటనలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దామని అశ్వత్థామరెడ్డి అన్ని యూనియన్లను కోరారు. ఈ సమావేశానికి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న టీఎంయూ (థామస్ రెడ్డి వర్గం) మినహా మిగతా యూనియన్లు అన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.