కమ్యూనికేషన్​ గ్యాప్ రాకుండా ఉండాలంటే...

కమ్యూనికేషన్​ గ్యాప్ రాకుండా ఉండాలంటే...

గొడవలు, మాట పట్టింపులు వచ్చినప్పుడు పార్ట్​నర్​ని పట్టించుకోరు. మాట్లాడరు. వాళ్ల వైపు చూడను కూడా చూడరు కొందరు. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్య మౌనం అడ్డుగోడలా నిలుస్తుంది. దాంతో అవతలివాళ్లకి విసుగొస్తుంది. తమతో మాట్లాడడం లేదని మనసులో బాధపడుతుంటారు. ఈ సిచ్యుయేషన్​ నుంచి బయటపడాలన్నా.. కమ్యూనికేషన్​ గ్యాప్ రాకుండా ఉండాలన్నా ఇద్దరూ మాట్లాడుకోవాలి. ఆగిపోయిన కమ్యూనికేషన్​ని తిరిగి మొదలుపెట్టాలంటే అది మాటలతోనే సాధ్యమవుతుంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 

కామ్​గా ఉండాలి: మాట్లాడడం లేదని, పట్టించుకోవడం లేదని పార్ట్​నర్ మీద కోపం పెంచుకోవద్దు. గట్టిగా అరవొద్దు. ప్రశాంతంగా ఉండాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. కొంచెం సేపు అటుఇటు నడవాలి. తర్వాత వాళ్లతో నిదానంగా  మాట్లాడాలి. 

కారణం తెలుసుకోవాలి: గొడవ జరగడానికి, అవతలివాళ్లే  కారణం అనుకోవద్దు. ఇద్దరూ పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ‘నిజంగా నా తప్పు ఉందా? నా ప్రవర్తన సరిగా ఉందా?’  అని ఒకసారి ఆలోచించాలి. పార్ట్​నర్​ చెప్పేది వినకపోవడం, మాటల మధ్యలోనే కలుగజేసుకోవడం, వాళ్ల అలవాట్లు, ప్రవర్తనని తప్పుపట్టడం వంటివి రిలేషన్​షిప్​ని దెబ్బతీస్తాయి. 

సూటిగా చెప్పాలి: చెప్పాలనుకున్న విషయాన్ని, సూటిగా  అర్థమయ్యేలా  పార్ట్​నర్​తో చెప్పాలి. అలాకాకుండా‘వాళ్లు అర్థం చేసుకుంటారులే’ అని పొడిపొడి మాటల్లో చెప్పొద్దు. స్పష్టంగా చెప్పకపోతే అవతలివాళ్లకు విషయం అర్థంకాక కన్ఫ్యూజన్​లో పడతారు. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్​ గ్యాప్​ వస్తుంది.

గౌరవించాలి: పార్ట్​నర్​ తమను గౌరవించాలి అనుకుంటారు చాలామంది. అలాగే అవతలివాళ్లను కూడా గౌరవించడం, వాళ్ల మాటకు విలువ ఇవ్వడం ముఖ్యం అనేది గమనించాలి. పార్ట్​నర్​ సరిగ్గా  మాట్లాడకపోతే.. వాళ్లంటే తమకు ఎంత ఇష్టమో చెప్పాలి. ఇద్దరూ సంతోషంగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకోవాలి.