సమ్మర్ టూర్‌‌‌‌ను బ్యూటిఫుల్​ మెమరీగా మార్చుకోవాలంటే

సమ్మర్ టూర్‌‌‌‌ను బ్యూటిఫుల్​ మెమరీగా మార్చుకోవాలంటే

సమ్మర్.. ఎండలకే కాదు.. హాలిడేలకూ సీజన్. సమ్మర్ వచ్చిందంటే చాలు.. టూర్‌‌‌‌కి ఎక్కడికి వెళ్దామా? ఎన్ని రోజులు వెళ్దామా? ఈ సారి మస్తు ఎంజాయ్ చేయాలి.. అంటూ సవాలక్ష ఆలోచనలు మొదలవుతాయి. ఏడాదంతా పడ్డ శ్రమ నుంచి సేద తీరేందుకు, కష్టాలకు కొన్నాళ్లు ‘కామా’లు పెట్టేందుకు.. జరంత రిలాక్స్ అయ్యేందుకు చాలామంది టూర్లకు వెళ్తుంటారు. అది ఒక రోజు కావచ్చు.. 10 రోజులు కావచ్చు.. రొటీన్ లైఫ్​కి కాస్త భిన్నంగా ఉండాలి అనుకుంటున్నారు. టూర్‌‌‌‌ను బ్యూటిఫుల్​ మెమరీగా మార్చుకోవాలంటే ప్లానింగ్ ఉండాలి మరి.

ఏడాదంతా రకరకాల పనులతో బిజీగా ఉన్నవాళ్లకు.. సమ్మర్ ఒక బ్రేక్ లాంటిది. అందుకే వేసవిలో లాంగ్ టూర్​కి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌తో కలిసి టూర్​ వేసేందుకు ప్లాన్‌‌లు చేస్తుంటారు. టూర్లకు వెళ్లేందుకు ముఖ్యంగా మూడు ఆప్షన్స్​ ఉంటాయి. అవి... ట్రావెల్స్, సొంత వెహికల్, ఇతర ట్రాన్స్​పోర్ట్ మార్గాలు. వీటిలో ఎవరికి వీలున్నది వాళ్లు సెలక్ట్​ చేసుకుని ప్లాన్ చేసుకుంటుంటారు. బడ్జెట్‌‌లో వెళ్లాలనుకునే వారికి ట్రావెల్స్ సంస్థలు ఇచ్చే ఆఫర్లు బెటర్ ఛాయిస్. ఇందులో అయితే టికెట్స్ బుక్ చేసుకునే బాధ ఉండదు. హోటల్స్, ఫుడ్ గురించి ఫికర్​ కూడా పడనక్కరలేదు. ప్యాకేజీలోనే ఇవన్నీ కవర్ చేస్తాయి ట్రావెల్ సంస్థలు. అయితే ఇందులో కొన్ని డిస్​ అడ్వాంటేజీలు కూడా ఉన్నాయి. మనం వెళ్లాలని ముందుగా అనుకున్న ప్లేస్​లన్నీ.. ట్రావెల్స్ ప్రకటించే లిస్టులో ఉండకపోవచ్చు. ఒకటీ రెండు మిస్ కావచ్చు. ఫుడ్, ఇతర అంశాల విషయంలో అడ్జెస్ట్ కావాల్సి వస్తుంది. అదే సొంత వెహికల్​లో వెళ్తే.. ఖర్చు కాస్త ఎక్కువ కావచ్చు. కానీ నచ్చిన ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఫలానా టైం వరకే అనో లేకపోతే ఫలానా ప్లేస్​ వరకో అని కాకుండా.. కావాల్సినంత టైం, నచ్చిన ప్లేస్​లో ఉండొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంఫర్ట్​గా టూర్ ఎంజాయ్ చేయొచ్చు. మూడో ఆప్షన్​ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వెళ్లడం. దీనికి ముందస్తు ప్లానింగ్ చాలా అవసరం. టికెట్ బుకింగ్ నుంచి బ్యాగులు, ప్రయాణం.. ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్త పడాలి.

మన టూర్ ఎలాంటిది?

టూర్లలో మస్తు రకాలు ఉంటాయి. అడ్వెంచర్, హనీమూన్, పెద్దలు,  ఫ్యామిలీలు, ఒంటరి ప్రయాణికులు, అన్​ప్లాన్డ్ టూర్..  ఇలా పలు కేటగిరీలు ఉంటాయి. కేటగిరీని బట్టి మనం వెళ్లాల్సిన ప్రాంతాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. అడ్వెంచర్ టూర్లు పెద్దలు, ఫ్యామిలీలతో వెళ్లే వారికి సాధ్యపడవు. అలాగే ఆధ్యాత్మిక టూర్లకు వెళ్లేందుకు  యూత్ పెద్దగా ఇష్టపడరు. 

అడ్వెంచర్ టూర్: యూత్ ఎక్కువగా అడ్వెంచర్ టూర్స్​ ఇష్టపడుతుంటారు. కార్లు, బస్సుల కంటే.. బైక్‌‌లపై వెళ్లేందుకే ప్రయారిటీ ఇస్తారు. లాంగ్ డ్రైవ్​లతోపాటు ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్ తదితర అడ్వెంచర్లకు ప్లాన్ చేసుకుంటుంటారు. సొంతంగా ప్లాన్ చేసుకుని ఒక గ్రూప్​గా వెళ్తుంటారు. 
హనీమూన్: జనవరి నుంచి మార్చి దాకా.. ముఖ్యంగా మాఘ మాసంలో పెండ్లి చేసుకున్న కొత్త జంటలు టూర్ వెళ్లేందుకు ఇది పర్ఫెక్ట్ టైమ్. ‘హాట్’ సమ్మర్​లో చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రావెల్స్ సంస్థలు మస్తు ఆఫర్లు ఇస్తుంటాయి. ఊటీ, కొడైకెనాల్, అరకు, గోవా వంటి దేశీ డెస్టినేషన్లతో పాటు మాల్దీవ్స్ వంటి ఫేమస్ ప్లేస్​లకు వెళ్లేందుకూ బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. 

పెద్దవాళ్లు: పెద్ద వాళ్ల కోసం ట్రావెల్స్ సంస్థలు ఆధ్యాత్మిక టూర్లను ప్లాన్ చేస్తుంటాయి. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రముఖ పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చే ప్యాకేజీలు ఉంటాయి వాటిలో.
ఒంటరి ప్రయాణికులు: వీళ్లు సోలో జర్నీలు చేస్తుంటారు. ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్తుంటారు. ఇలా ఎంతో మంది ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. వీరిలో ఆధ్యాత్మికం నుంచి అడ్వెంచర్ దాకా అన్ని రకాల వాళ్లూ ఉంటారు.  వీళ్ల కోసం ప్రత్యేకంగా ట్రావెల్ ప్లాన్స్ అంటూ ఏం ఉండవు. సెల్ఫ్ ప్లానింగే అన్నీ అన్నమాట.

ఫ్యామిలీ: ఫ్యామిలీ టూర్లకు ట్రావెల్స్ ప్లాన్స్ పెద్దగా ఉపయోగపడవు. టూరింగ్ సంస్థలు ఒక్కొక్కరికి ఇంత అని ఛార్జ్ చేస్తాయి. గ్రూప్‌‌గా ఛార్జ్‌‌ చేసే సంస్థలు తక్కువే. సో.. ఐదుగురు ఉండే ఫ్యామిలీలో ఒకేసారి అంత పెద్ద మొత్తంలో కట్టడం కంటే.. సొంత వెహికల్ ఏర్పాటు చేసుకోవడమో.. లేదా ట్రాన్స్​పోర్ట్ పై ఆధారపడటమో బెటర్. ఇలా చేయడం వల్ల ఇటు డబ్బులు, అటు సమయం రెండూ ఆదా అవుతాయి.
అన్​ప్లాన్డ్ టూర్: యూత్, బ్యాచిలర్లు ఎక్కువగా అన్​ప్లాన్డ్ టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. టూర్‌‌‌‌కు వెళ్లాలని ముందే డిసైడ్ అయినా.. ఎక్కడికి వెళ్లాలనే దాన్ని చివరి నిమిషం దాకా పెద్దగా పట్టించుకోరు. ఒకరు లేదా కొంత మందితో ఉన్న గ్రూప్.. అప్పటికప్పుడు డెసిషన్​ తీసుకుని వెళ్తుంటారు. చెప్పుకోవడానికి ఇది ఆసక్తికరంగానే ఉన్నా.. రియాలిటీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. టూర్‌‌‌‌కు వెళ్లే ప్లేస్ ఏదైనా.. అక్కడి సమాచారం, అక్కడ ఉన్న సౌలత్​లు, పరిస్థితుల గురించి ముందుగానే ఒక ఐడియా ఉండాలి.

ప్లానింగ్ ముఖ్యం

లాంగ్ టూర్లకు పక్కా ప్లానింగ్ ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్ జరిగినా.. మొత్తం టూర్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ఆరు విషయాలపై  క్లారిటీ ఉండాలి. ఏ ప్రాంతం వెళ్తున్నాం? ఎన్ని రోజులు వెళ్తున్నాం? మన బడ్జెట్ ఎంత? ట్రావెల్, హోటల్ బుకింగ్స్.. టూర్ చేసేటప్పుడు మన యాక్టివిటీస్.. అవసరమైన వస్తువులన్నీ వెంట తీసుకెళ్లడం.. వంటివి చాలా ముఖ్యం. ఈ విషయాలపై స్పష్టత ఉంటే టూర్ మస్తు మజా ఇస్తది.

ఎక్కడికి వెళ్తున్నాం?

బీచ్‌‌లు, పర్వత ప్రాంతాలు, ఫారెస్ట్ ఏరియాలు, ప్రసిద్ధ టూరిస్ట్ ఏరియాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు.. ఇలా ఎక్కడికి వెళ్తున్నామనేది టూర్ ప్లానింగ్​లో కీ ఫ్యాక్టర్. సీజన్‌‌, వెళ్లాల్సిన టైంని బట్టి మన డెస్టినేషన్ ఉండాలి. ఇప్పుడున్నవి మండే ఎండలు.. అంటే చల్లగా ఉండే ప్లేస్​ల కోసం వెతకాలి. ఇదే టైంలో బడ్జెట్ ఎంత పెట్టొచ్చు అనేదాని గురించి కూడా ఆలోచించాలి. కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే లగ్జరీ బడ్జెట్ అవసరం పడొచ్చు.  పీక్ సీజన్ కూడా. అందరూ అంత ఖర్చు చేయలేకపోవచ్చు. సో.. ముందే ఖర్చులపై ఓ అంచనా ఉంటే మంచిది. ఎర్లీ బుకింగ్స్ చేసుకుంటే జరంత డిస్కౌంట్స్ దొరకొచ్చు. అదే టైంలో మన సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి. వెళ్తున్న చోటు సురక్షితమైనదా? కాదా? అనేది తెలుసుకోవాలి. పాపులర్ డెస్టినేషన్​లకు ట్రాన్స్​పోర్ట్ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురు కావచ్చు. అందుకే టూర్‌‌‌‌పై ఓ ఆలోచన, అవగాహన ఉండటం అవసరం.  

ఎన్ని రోజులు?

టూర్ ఎన్ని రోజులనేది ముందుగా నిర్ణయించుకోవాలి. ఉన్న సెలవులు, వెళ్దామనుకున్న ప్లేస్​లను బట్టి సెట్ చేసుకోవాలి. కొన్ని ప్లేస్​లకు వెళ్లేందుకు ఎక్కువ టైం పట్టొచ్చు. కొన్ని ప్రాంతాలకు త్వరగా చేరుకోవచ్చు. లాంగ్ టూర్‌‌‌‌ చేసే వాళ్లకి లాంగ్ డిస్టెన్స్ జర్నీ పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే తక్కువ రోజుల్లో ఎక్కువ ప్రాంతాలు చుట్టిరావాలనుకునే వాళ్లకు లాంగ్​ జర్నీ వల్ల టైం వేస్ట్ అవుతుంది. మరోవైపు కొందరు ప్రతి రోజూ ఓ కొత్త ప్లేస్​ చూడాలని అనుకుంటారు. కొందరు ఆయా ప్రాంతాల అందాలను ఆస్వాదిస్తూ నెమ్మదిగా జర్నీ చేస్తారు. ఇలాంటి వాళ్లు.. చూడదగ్గ ప్రదేశాలేవి? అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన ముందే తెలుసుకుని ఉండాలి. అలాగే ఖర్చు కాస్త ఎక్కువైనా విమాన ప్రయాణాలను ఎంచుకోవడం ఉత్తమం. టైం చాలా వరకు సేవ్ అవుతుంది. అలానే ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు జర్నీ చేయాల్సి వస్తే .. రాత్రి ప్రయాణాలు చేయడం మంచిది. వారం రోజుల కంటే ఎక్కువ రోజులు టూర్ ప్లాన్ చేస్తే.. కనీసం ఒకరోజును ‘వేకెంట్‌‌’గా భావించాలి. విమానం/రైలు ఆలస్యాలు, ట్రాఫిక్ జామ్‌‌లు, వాతావరణం అనుకూలించకపోవడం, ఎక్కడైనా ఎక్కువ టైం ఉండాల్సి రావడం వంటివి జరిగినప్పుడు ‘బఫర్’లా ఆ ఒక్క రోజు పని చేస్తుంది.

బడ్జెట్ ఎంత?

ముందుగా బడ్జెట్ ఎంతనేది చూసుకోవాలి. ఎన్నిరోజులు ఉంటారు? ఎంత ఖర్చు అవుతుంది? అనేది లెక్క వేసుకుని, మరీ అంతే కాకుండా జరంత ఎక్కువ బడ్జెట్ కేటాయించుకోవాలి. తిరగడం, తినడానికే కాకుండా.. టూర్‌‌‌‌ గుర్తుండిపోయేలా ఫేమస్ ప్లేసుల నుంచి వస్తువులను తీసుకురావడానికి, మన వాళ్లకు గిఫ్ట్‌‌లు తెచ్చేందుకు కొంత బడ్జెట్ సపరేట్‌‌గా కేటాయించుకోవాలి.

ట్రావెల్, అకామిడేషన్ బుకింగ్స్ 

వేసవిలో హోటల్ రూమ్స్ రేట్లు, విమాన టికెట్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. రెగ్యులర్ రేట్లలో వసతి దొరక్కపోవచ్చు. అందుకే ముందుగానే హోటల్స్‌‌ బుక్ చేసుకోవడం మంచిది. పీక్ సీజన్‌‌లో పెరిగిన ఛార్జీల బారిన పడకుండా ఎర్లీ బుకింగ్స్ ఉపయోగపడతాయి. విమానం రేట్లు సీజన్‌‌ను బట్టి పెరుగుతుంటాయి. వెకేషన్ ప్లాన్‌‌పై స్పష్టత ఉంటే.. చౌకగా దొరికే నాన్ రిఫండబుల్ విమాన లేదా రైలు టికెట్లను బుక్ చేసుకోవాలి. లేదంటే రిఫండబుల్ టికెట్లను అడ్వాన్స్‌‌గా బుక్ చేసుకోవడం మంచిది. ఫ్లయిట్​ టికెట్స్​ రేట్లు హెచ్చుతగ్గులు అవుతుంటాయి. గూగుల్ ఫ్లైట్ ట్రాకర్ ద్వారా ఫ్లయిట్​ ఛార్జ్​లను ట్రాక్ చేయొచ్చు. ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలైనంత వరకు క్రెడిట్ కార్డులు వాడాలి. అలాగైతే రివార్డ్‌‌లు, క్యాష్-బ్యాక్‌‌లను పొందే ఛాన్స్​  ఉంటుంది.

రోజువారీ యాక్టివిటీలు

టూర్లు చాలామందికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త శక్తిని ఇస్తాయి. మన బడ్జెట్, టూర్ టైం బట్టి ఏ రోజున ఏ యాక్టివిటీ చేయాలనేది ఆలోచించాలి. ఒకచోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నప్పుడు సాయంత్రం లేదా రాత్రి టైంలో ట్రావెల్ చేసేందుకు ప్రయారిటీ ఇవ్వాలి. అది సైట్ సీయింగ్‌‌కి, ఇతర యాక్టివిటీలకు తగినంత టైం ఉండేలా చేస్తుంది.  రిలాక్సేషన్​ కోసమే టూర్‌‌‌‌కు వెళ్తుంటే.. ఒక రోజులో వీలైనన్ని తక్కువ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో స్కీయింగ్, బోటింగ్, స్కూబా డైవింగ్ మొదలైనవి ఆఫ్‌‌ సీజన్‌‌లో మూసేస్తారు. వెళ్లే ముందే వాటి గురించి చెక్ చేసుకోవాలి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, బోట్ రైడ్‌‌, సఫారీ రైడ్‌‌లు వంటి వాటిని ముందే బుక్ చేసుకోవాలి.

ఏం తీసుకెళ్లాలి?

ఎక్కడికి? ఎన్ని రోజులు? ఎలా వెళ్తున్నామనే కథ అంతా అయ్యాక.. వెంట ఏమేం తీసుకెళ్లాలనేదే అసలు ప్రశ్న. అక్కడి వాతావరణం, స్థానిక పరిస్థితులు, పండుగ సీజన్ వంటివి.. మన ప్రయాణ ప్రణాళికలను ఎఫెక్ట్ చేయొచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి సన్‌‌స్క్రీన్ లోషన్, మస్కిటో రెపెల్లెంట్ వంటివి తీసుకెళ్లాలి. స్కిన్​కి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకెళ్లడం అనవసరం అనుకోవద్దు. లాంగ్ టూర్ అయితే బట్టలకే బ్యాగులు సరిపోవు. ఎండాకాలం కాబట్టి.. తక్కువ ప్లేస్​ పట్టే కాటన్ బట్టలు తీసుకెళ్లాలి. ఫోన్లు లేకుంటే ఏ పనీ జరగదు. కాల్స్, పేమెంట్స్, బుకింగ్స్, ఫొటోలు ఇలా అన్నింటికీ ఫోన్ అవసరం. కాబట్టి ఫోన్​ బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జింగ్​ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఛార్జర్, ఇయర్ ఫోన్స్, బడ్స్ లాంటివి మరిచిపోవద్దు. ఇయర్ ఫోన్స్ లేకుంటే ట్రావెలింగ్​లో కొన్నిసార్లు బోర్​ ఫీలింగ్​ వస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి

విమానం లేదా ట్రైన్ టికెట్లను ఫోన్లలో మాత్రమే ఉంచుకోవద్దు. ఒకటి రెండు కాపీలు బ్యాగ్​లో పెట్టుకోవాలి. డబ్బులు ఖర్చు చేసే విషయంలోనూ అంతే. ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయి కదా అని క్యాష్​ దగ్గర పెట్టుకోకుండా ఉండొద్దు. అవసరాన్ని బట్టి క్యాష్ లేదా ఆన్​లైన్ పేమెంట్ చేసేలా రెండు ఆప్షన్స్​ ఓపెన్​ పెట్టుకోవాలి.ఫ్యామిలీ మొత్తం లేదా సింగిల్​గా టూర్​లో ఉన్నప్పుడు.. ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు డెస్టినేషన్​కు రీచ్​ అవుతారనేది దగ్గరి వాళ్లకు చెప్పి ఉంచాలి. టూర్​లో ఇబ్బంది ఎదురైతే వెంటనే రెస్పాండ్ కావడానికి మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్​కు స్కోప్ ఉంటుంది. పాస్ పోర్టులు, ఇతర ఐడీలు స్కాన్ చేసుకుని క్లౌడ్​లో సేవ్ చేసుకోవాలి. వ్యాలెట్ ఎక్కడైనా పోయినా.. అవి అవసరానికి అక్కరకొస్తాయి. హెల్త్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ట్రెక్కింగ్ చేసినప్పుడు, బీచ్​లో నడుస్తున్నప్పుడు, ఇతర సందర్భాల్లో ఎండలకు డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ లాంటివి వెంట ఉంచుకోవాలి. విటమిన్ ట్యాబ్లెట్లు, ఇతర అవసరమైన మందులు వెంట ఉండాలి. ఎక్కువ రోజులు టూర్ వెళ్తుంటే.. కావాల్సినంత నిద్ర అవసరం. లేదంటే యాక్టివ్​గా ఉండలేరు. టూర్ ఎంజాయ్ చేయలేరు.

బుకింగ్స్ ఖర్చు తగ్గించుకోవచ్చు

మార్కెట్లో కాంపిటీషన్‌‌ని బట్టి పీక్ సీజన్‌‌లో కొన్ని హోటల్స్​ డిస్కౌంట్‌‌ ఆఫర్ చేయొచ్చు. ఆన్‌‌లైన్‌‌లో రిసార్ట్, హోటల్స్‌‌ని బుక్ చేసేటప్పుడు వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. హోటల్ బుకింగ్ కోసం ఆన్‌‌లైన్ పోర్టల్స్ కొన్నిసార్లు స్పెషల్ ఆఫర్స్​ ఇస్తుంటాయి. ‘మేక్ మై ట్రిప్, గోఇబిబో’ వంటి ఆన్‌‌లైన్ బుకింగ్ పోర్టల్స్ మంచి డిస్కౌంట్స్​ ఇస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డులపై అదనంగా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దేశంలోని పెద్ద హోటల్స్​ కొన్ని సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజ్​, రాడిసన్ హోటల్స్​ వంటివి డిస్కౌంట్లు ఇస్తుంటాయి. నేరుగా హోటల్‌‌కి వెళ్లి బుక్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు మంచిదే. అప్పుడప్పుడు తక్కువ రేటుకే మంచి హోటల్స్​ దొరుకుతాయి. కొన్ని హోటల్స్​లో​ మెంబర్‌‌షిప్ కార్డ్స్​ ఫెసిలిటీ ఉంటుంది. ఈ కార్డులపై డిస్కౌంట్​, ఆఫర్స్​ ఉంటాయి. మెంబర్‌‌షిప్ కార్డు ఉంటే హోటల్ బుకింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది.

ప్లానర్లూ ఉన్నారు!

టూర్ల విషయంలో మనకు క్లారిటీ లేకపోతే.. ప్లానింగ్ సంస్థలూ ఉన్నాయి. ట్రావెల్ స్పెషలిస్టులను కాంటాక్ట్ కావచ్చు. మనకున్న హాలీడేస్​, బడ్జెట్‌‌, మన రిక్వైర్ మెంట్స్ చెప్పి..  అందుబాటులో ఉన్న టూర్ల గురించి తెలుసుకోవచ్చు. ఎన్నో సంస్థలు ట్రిప్ ప్లానింగ్‌‌ కోసం పనిచేస్తున్నాయి. వెబ్‌‌సైట్లు, యాప్స్ ద్వారా డెస్టినేషన్ల వివరాలు, ఫొటోలు, రేట్లు, ఎక్కడ స్టే చేస్తే బెటర్ వంటి వివరాలను యూజర్లకు ఇస్తున్నాయి.

విదేశీ టూర్లు ఎక్కువే!

సమ్మర్‌‌‌‌లో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. మనకు సమ్మర్ ఉన్నప్పటికీ.. కొన్ని దేశాల్లో వింటర్ సీజన్ ఉంటుంది. అలాంటి ప్లేస్‌‌లను సెలక్ట్​ చేసుకుని  వెళ్తుంటారు. రెగ్యులర్​గా టూర్స్​ వెళ్లే వాళ్లకి పెద్దగా సమస్య ఎదురుకాకున్నా.. ఫస్ట్ టైమ్ వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఫారిన్​ టూర్స్​ వెళ్తున్నప్పుడు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. ట్రావెల్స్ వాళ్లు ఆఫర్లు ప్రకటించారనో, గతంలో వెళ్లి వచ్చిన వాళ్లు చెప్పారనో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని దేశాలకు వీసాలు లేకుండా వెళ్లొచ్చు. కొన్ని దేశాలకు అక్కడకి వెళ్లిన తర్వాత వీసాలు తీసుకోవచ్చు. మరి కొన్ని దేశాలు భారతీయులకు టూరిస్ట్​ ఫెసిలిటీస్​ ఇస్తున్నాయి. వాళ్ల దేశాలకి వచ్చే వాళ్లకి మినహాయింపులు ప్రకటిస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలను మినహాయిస్తే ప్రపంచంలో చాలా దేశాలకు చాలా తక్కువ ఖర్చుతో వెళ్లిరావచ్చు. ఈ లిస్ట్​లో ముఖ్యంగా మూడు దేశాలు ఉన్నాయి. ఇండియన్​ టూరిస్ట్​లు ఈ మూడు దేశాలను చాలా తక్కువ బడ్జెట్‌‌లో చుట్టిరావొచ్చు. ఇండోనేసియా, వియత్నాం, లావోస్ దేశాల టూర్‌‌కు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ మూడు దేశాల స్థానిక కరెన్సీ కంటే మన రూపాయి విలువ ఎక్కువ.

ఒంటరిగా వెళ్తే..


గ్రూపుతో కలిసి కాకుండా కొందరు ఒంటరిగా టూర్స్​ వెళ్లాలనుకుంటారు. ఇండిపెండెంట్​గా, నచ్చినట్లుగా ఉండొచ్చు అనుకుంటారు వీళ్లు. అలాంటి వాళ్లు కొన్ని టిప్స్‌‌ ఫాలో కావాలి. ముందుగా మీరు వెళ్తున్న స్పాట్​కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. విదేశాలైతే భద్రతా సమస్యలు, సాంస్కృతిక నిబంధనలు, స్థానిక చట్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగైతే ఎక్కడికి వెళ్లాలి?  ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో రోజుకి ఒకసారైనా మాట్లాడాలి. ఎక్కడికి వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్​ ఎప్పటికప్పుడు చెప్తుండాలి. కుటుంబసభ్యులతోపాటు మనం పూర్తిగా నమ్మేవారికి లొకేషన్ షేర్ చేయాలి. వీలైతే సేఫ్టీ అలారమ్, సేఫ్టీ యాప్స్​ను ఫోన్​లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట ఉండాలి. వీలైనంత వరకు ఖరీదైన వస్తువులు తీసుకెళ్లొద్దు. ఆభరణాల్లాంటివి వద్దేవద్దు. కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ కావాల్సి వస్తే వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు.