చెత్త గురించి చెప్పాలని

చెత్త గురించి చెప్పాలని

మనకు తెలియకుండానే రోజూ ప్లాస్టిక్​ వేస్ట్ చాలా పడేస్తాం. అంతేకాదు రోడ్ల మీద  ఎక్కడ చెత్త కనిపించినా ఏం పట్టనట్టు ఉంటారు  చాలామంది. ఇతను మాత్రం ప్లాస్టిక్ వేస్ట్ గురించి అందరిలో అవేర్​నెస్ తేవాలి అనుకున్నాడు. అందుకోసం ఒక నెలంతా రోడ్లు, వీధులు తిరుగుతూ  ప్లాస్టిక్ వేస్ట్​ని సేకరించాడు. ప్లాస్టిక్​ వేస్ట్​తో చిరునవ్వులు చిందిస్తున్న ఇతని పేరు రాబ్ గ్రీన్​ఫీల్డ్. అమెరికాలోని లాస్​ ఏంజెలెస్​​లో ఉంటున్న రాబ్ ప్లాస్టిక్ వేస్ట్ గురించి క్యాంపెయిన్ చేస్తుంటాడు. చెత్త సేకరించడం కోసం చేతులు, కాళ్లు, పొట్ట, వీపు దగ్గర పెద్ద జేబులు ఉన్న ఒక ప్లాస్టిక్ సూట్ కొన్నాడు. ఆ సూట్ వేసుకొని లాస్​ఏంజెలెస్​, ఆ చుట్టుపక్కల సిటీ రోడ్ల మీదకు వెళ్లి, ఎక్కడ చెత్త కనిపించినా తీసి, జేబుల్లో వేసుకునేవాడు. మొదట రాబ్​ని చూసి ‘ఇతనికి పిచ్చి పట్టిందా ఏంది?’ అనుకున్నారట చాలామంది. అయితే... ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా పట్టించుకోలేదు రాబ్. ఇప్పటికే 28 కిలోల వేస్ట్​ని జమచేశాడు. వాటిలో కూల్​డ్రింక్ బాటిళ్లు, శ్నాక్, మీల్స్ పార్శిల్ కవర్లు ఉన్నాయి. రెండు వారాల తర్వాత సేకరించిన వేస్ట్​ని మోసుకుంటూ నడవడం  కష్టంగా ఉన్నా కూడా క్యాంపెయిన్​ని ఆపట్లేదు రాబ్.

సాధారణ జీవితం
తన లైఫ్​ స్టయిల్ వల్ల పర్యావరణం కలుషితం అవుతుందేమోనని అతి సామాన్యమైన జీవితం గడుపుతాడు రాబ్​. బట్టలు ఎక్కువ కొనడు. ప్లాస్టిక్ వేస్ట్​కి కారణమయ్యే పార్శిల్ కవర్లు, కూల్​డ్రింక్స్ బాటిళ్ల జోలికి వెళ్లడు. ‘‘మనలో చాలామంది రోడ్ల మీద, వీధుల్లో ఉండే చెత్తని చూసీ చూడనట్టు ఉంటాం. దాన్ని తీసేద్దామనే ఆలోచన కూడా మనకు రాదు. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలన్నదే నా ప్రయత్నం” 
అంటున్నాడు రాబ్.