
- నమ్మించి మోసం చేసిన దళారులు
- పంట కొనేటోళ్లు లేక చేలల్లో వదిలేస్తున్న పొగాకు రైతులు
- ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలని వేడుకోలు
సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్, కోహిర్, మునిపల్లి మండలాల పరిధిలో దాదాపు 100 ఎకరాల్లో రైతులు పొగాకు పండించారు. కానీ పంట కొనేవాళ్లు లేక అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రబీలో పండించిన పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయదన్న ప్రచారంతో దళారులు ఎంట్రీ ఇచ్చారు. పంట వేయండి మెరుగైన ధరకు కొంటామని భరోసా ఇచ్చి తీరా పంట చేతికొచ్చాక కనిపించకుండా పోయారు.
దీంతో పంట ఎవరికి అమ్ముకోవాలో తెలియక పొగాకు రైతులు చేలల్లోనే పంటను వదిలిపెడుతున్నారు. గిట్టుబాటు ధర పక్కన పెడితే కనీసం పంట కొనేటోళ్లు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
దళారుల మాటలు నమ్మి
పంట వేస్తే క్వింటాల్ కు రూ.13 వేల చొప్పున కొనుగోలు చేస్తామని మొదట దళారులు రైతులను నమ్మించారు. ఇందులో భాగంగా పంట వేసే టైంలో ఎకరాకు రూ.5 వేలు వసూలు చేసి నారుసరఫరా చేశారు. పంట కాపుకు వచ్చేవరకు సలహాలు, సూచనలు ఇస్తామని నమ్మబలికారు. పంట చేతికొచ్చిన తర్వాత ఈ పొగాకు నాణ్యమైనది కాదని బుకాయిస్తూ క్వింటాల్ కు రూ.6 వేలు మాత్రమే ఇస్తామని దబాయిస్తున్నారు. ఇష్టముంటే అమ్మండి లేదంటే అమ్మకండని మొఖం మీదనే చెబుతున్నారు.
పత్తిలో దిగుబడి రాక పొగాకు వైపు.
పత్తి పంటలో సరైన దిగుబడి రాక నష్టపోయిన రైతులు పొగాకు పంటపై ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రాయికోడ్ మండలంలోని అల్లాపూర్, ధర్మాపూర్, ఎన్కేపల్లి, ఔరంగనగర్, కోహిర్ మండలంలోని పైడి గుమ్మల్, చింతల్ గట్టు, కవెల్లి, వెంకటాపూర్, మునిపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజన్ లో వంద ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. పండించిన పంటను అటు ప్రభుత్వం కొనలేక ఇటు దళారులు మోసంగించడంతో ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను కొందరు రైతులు కోయలేకపోతుంటే మరికొందరు కోసిన పంటను పొలాల వద్దనే నిల్వ ఉంచారు. ఈ పంటను పండించిన వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేసే దిశగా పంటను కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
మోసపోయాం..
భూస్వామి దగ్గర ఎకంర పొలాన్ని కౌలుకు తీసుకుని పొగాకు పండించా. కోహీర్ మండలానికి చెందిన ఓ దళారి మాట నమ్మి పంట వేశా. క్వింటాల్ కు రూ.13 వేలు ఇస్తానని భరోసా ఇచ్చి పంట చేతికి వచ్చాక రూ.6 వేలే ఇస్తానంటున్నాడు. అమ్మితే అమ్మండి, లేదటే లేదని చేతులెత్తేశాడు. అప్పు చేసి పంట సాగు చేశా. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలి.- ముత్యాల చిన్న, రాయికోడ్పొ
గాకు కొంటాం
పొగాకు రైతుల్లో కొందరు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. రాయికోడ్ మండలంలో దళారుల వ్యవస్థ ఎక్కువైంది. వారిని నమ్ముకుని కొందరు పొగాకు సాగు చేశారు. రైతులను దళారులు మోసగించినట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పొగాకును కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఎవరూ అధైర్య పడొద్దు. - సత్యనారాయణ, ఏడీఏ