కథువా హత్యాచారం కేసులో నేడే తుది తీర్పు..

కథువా హత్యాచారం కేసులో నేడే తుది తీర్పు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఇవాళ తుది తీర్పు రానుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్  డిస్ట్రిక్ట్  అండ్  సెషన్  కోర్టులో  గత వారం విచారణ ముగియగా.. ఇవాళ న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్ కోట్ లో భద్రతను కట్టుదిట్టం  చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు.

గత ఏడాది జనవరిలో జమ్ముకశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.  అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి.  నిందితులకు ఉరి శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.అయితే  కేసు విచారణకు జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్ కోట్  కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాంజీ రామ్ సహా ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్ షీట్  దాఖలైంది. నిందితులు దోషులుగా తేలితే యావజ్జీవం గానీ, ఉరి శిక్ష గానీ విధించే అవకాశం ఉంది.