అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: అమృతం.. అమ్మ భాష

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: అమృతం.. అమ్మ భాష

అమ్మ ఒడిలోనే తొలి పలుకులు నేర్చుకుంటాం. బిడ్డకు ఎవరూ చెప్పకముందే తల్లిని ‘అమ్మా’ అని పిలుస్తుంది. అలాంటి మాతృభాషను చాలామంది మరిచిపోతున్నారు. మాతృభాషలో మాట్లాడాలంటేనే సిగ్గుపడుతున్నారు. అందుకే తెలుగు భాష కమ్మదనాన్ని ఈ రోజు ‘అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం’ సందర్భంగా గుర్తు చేసుకుందాం.

మహాముత్తారం, వెలుగు (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)‘ఇటాలియన్‌‌‌‌ ఆఫ్ ద ఈస్ట్’గా పిలిచే తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 8వ, 7వ శతాబ్దంలో రచించిన ఐతరేయ బ్రాహ్మణంలో తెలుగు పదాల ప్రస్తావన ఉంది. ఆంధ్ర, తెనుగు, తెలుగు అనే మూడు పేర్లతో పిలిచే తెలుగు.. తెనుంగు, తెనుగు, తెలుగు, త్రిలింగ అనే ఐదు వ్యవహారాల్లో పిలిచేవారు. పోర్చుగ్రీసు వాళ్లు 8వ శతాబ్దంలో మన భాషను ‘జెంతూ’ అన్నారు.

ఈ రోజు ఎలా వచ్చింది?

గ్లోబలైజేషన్​ వల్ల కొన్ని భాషలకు ఎక్కువ ఇంపార్టెన్స్​ వచ్చింది. కొన్ని వేల భాషలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దాంతో యునెస్కోకి ఎన్నికైన బంగ్లాదేశ్.. మాతృభాషా దినోత్సవం గురించి ప్రతిపాదించగా ఐక్య రాజ్యసమితి మద్దతుతో – 1989 నవంబర్ 17న యునెస్కో ఆమోదించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించాలని యునెస్కో తీర్మానించింది. ప్రజలు తమ మాతృభాషలోని మాధుర్యాన్ని గుర్తు చేసుకోవాలని, ఆయా భాషల వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ‘యునెస్కో’ ప్రకటించింది.

తెలుగు భాషను కాపాడుకునేందుకు..

మాతృభాషను కాపాడుకునేందుకు ప్రభుత్వం, ప్రజలు కృషి చేయాల్సిన అవసరమున్నది. ఇంగ్లీషు చదివితేనే ఉద్యోగం దొరుకుతుందనేది కోట్లాది తెలుగు పిల్లల భ్రమ. గతంలో టెన్త్​ వరకు ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదివిన ఎంతోమందికి ఉద్యోగాలు లభించాయన్న విషయాన్ని మరిచిపోవద్దు. తెలంగాణ భాషలో పరిపాలన సాగాలి. టెక్స్ట్​ పుస్తకాల్లో మాతృభాష అమలు కావాలి. ముఖ్యంగా తెలంగాణ భాషలో కార్యకలాపాలు జరగాలి. మన భాషా సౌందర్యాన్ని కాపాడుకోవాలి. మాతృ భాషను కాపాడుకోకపోతే తెలుగు జాతి తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్నది.

  – జాటోత్​ రాంసింగ్, రాష్ట్రీయ పండిత పరిషత్ జిల్లా కార్యదర్శి

మాతృభాషలోనే చెప్పాలి

మాతృభాషలో చదువు చెప్పడం సహజమైనది. ప్రైమరీ ఎడ్యుకేషన్‌‌ వరకు అయినా.. తెలుగులో పాఠాలు చెప్పాలి. మన యాస, భాషను కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి. ప్రభుత్వ పరిపాలన కూడా తెలుగులోనే జరిగితే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో  వాళ్ల భాషలోనే చదువు చెప్తారు. మన దగ్గర సర్కారీ ఆఫీసుల్లో తెలుగులోనే కార్యకలాపాలు జరగాల్సిన అవసరముంది. తెలుగు అధికార భాషా సంఘానికి పూర్తి అధికారం ఇస్తే మాతృభాష పరిఢవిల్లే అవకాశాలు ఉంటాయి.

– గడ్డం లక్ష్మయ్య కవి, రచయిత, గాయకుడు, రాష్ట్రీయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు