
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బృందం అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. ఆశిష్ మరణ వార్త సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దర్శకనిర్మాత అరిన్ పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆశిష్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఆశిష్ ఇక లేరని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మృదుస్వభావి, తన వృత్తి పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి. ప్రతి సన్నివేశంలోనూ ప్రాణం పెట్టి నటించేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను," అని పేర్కొన్నారు.
ఆశిష్ వారంగ్ తన నటనతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందారు. ముఖ్యంగా, అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశీ' , అజయ్ దేవగన్ నటించిన 'దృశ్యం' వంటి భారీ హిట్ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలలో ఆయన పాత్రలు చిన్నవే అయినా, గుర్తుండిపోయేలా నటించారు. అంతేకాకుండా, రాణి ముఖర్జీ నటించిన 'మర్దానీ' సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలలో తన పాత్రలకు న్యాయం చేసి, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మరాఠీ సినిమాలలో కూడా నటించి, మరాఠీ ప్రేక్షకులకు చేరువయ్యారు.
►ALSO READ | Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 చదరంగం కాదు.. రణరంగం! డబుల్ హౌస్‌లో డబుల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది?
ఆశిష్ వారంగ్ అకాల మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని సీని ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన నటనా ప్రతిభ, నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు ఈ విషాద సమయంలో ధైర్యం కలగాలని ఆశిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.