నేడు ఫెర్నాండెజ్​ వర్ధంతి

నేడు ఫెర్నాండెజ్​ వర్ధంతి

అలుపెరగని పోరాట యోధుడు, సోషలిస్టు దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఈ లోకాన్ని వదిలి నేటికి సరిగ్గా నాలుగేండ్లు. పోరాటమే జీవితంగా, జీవితమే పోరాటంగా బతికిన ఆయన 2019 జనవరి 29న తుదిశ్వాస విడిచారు. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో మచ్చలేని నేతగా, హక్కుల సాధనకు పరితపించిన ఉన్నత భావాలు గల వ్యక్తిగా ఫెర్నాండెజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.. తుది శ్వాస వరకు సాధారణ జీవితమే గడిపారు. సోషలిస్టు నేతగా మొదలైన ఆయన ప్రస్థానం ఉన్నత స్థానాలకు చేరింది. దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖ మంత్రి పదవి ఆయనను వరించింది. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం.  1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా, 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా,1999లో కార్గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్ర పుటల్లో నిలిచారు.

కార్మికుల సమస్యలపై పోరాటం

కర్నాటకలోని మంగళూరులో 1930లో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్..1949లో 19 ఏండ్ల వయ సులో ఉపాధి వెతుక్కుంటూ ముంబైకి చేరుకున్నారు. మొదట్లో చాలా ఇబ్బందులు పడిన ఆయన, ఓ న్యూస్ పేపర్​లో ప్రూఫ్ రీడర్​గా చేరారు. రామ్ మనోహర్ లోహియా వంటి నేతల ప్రభావంతో కార్మిక సమస్యలపై గళమెత్తారు. ఎన్నో పోరాటాల్లో పాల్గొంటూ, సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించారు. తక్కువ కాలంలోనే దానికి నాయకత్వం వహించారు. 1950 నుంచి 1960 వరకు దశాబ్దకాలం పాటు అనేక ఆందోళనలు, బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు. దక్షిణ ముంబై స్థానం నుంచి 1967లో పోటీచేసి, కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించి, తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. అఖిల భారత రైల్వే సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వారి సమస్యలపై పోరాటం చేశారు. 1974లో దేశవ్యాప్త రైల్వే బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇందిరా గాంధీ సైతం ఆయన పేరు వింటే వణికపోయేవారని, ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైలుకు వెళ్లిన తర్వాతే ఆమె ప్రశాంతంగా ఉండగలిగారని అంటారు. అందుకే, బరోడా డైనమేట్ కేసులో రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్టేషన్ల ధ్వంసానికి వ్యూహరచన చేశారన్న ఆరోపణలతో ఆయనను సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చింది. 1976లో ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో 23 మందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముజఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ నుంచి ఎంపీగా గెలిచి, మొరార్జీ దేశాయ్ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిశ్రమల మంత్రి అయ్యారు. అప్పడు పెట్టుబడి నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐబీఎం, కొకోకొలా లాంటి సంస్థలను దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఫెర్నాండెజ్​ తీసుకున్న ఆ నిర్ణయం  స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో  తిలక్​ ఇచ్చిన​ ‘స్వదేశీ’ నినాదాన్ని ​ దేశానికి మరొకసారి గుర్తు చేసింది. దేశ ప్రజల నుంచి ఫెర్నాండెజ్​ ప్రశంసలు అందుకున్నారు.   తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉంటూ, కీలకమైన కొంకణ్ రైల్వే ప్రాజెక్టును రూపకల్పన చేశారు.

పాకిస్తాన్​కు ముచ్చెమటలు

వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయీ హయాంలో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించి, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముచ్చెమటలు పట్టించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండోసారి అణుపరీక్షలు జార్జి ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆయన. భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఆలోచన పాక్​ విడిచిపేట్టే వరకు సరిహద్దుల్లో సైన్యం ఉపసంహరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి భారత రక్షణ మంత్రి ఫెర్నాండెజ్. 2003 జూన్ 22న యాంటీ గ్రావిటీ సూట్ ధరించి లోహెగావ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేస్ నుంచి సుఖోయ్-30ఎంకేఐలో ఆయన ప్రయాణించారు. అయితే బారక్ క్షిపణులు కుంభకోణం, తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి వివాదాలు ఆయన ప్రతిష్టను కొంత దెబ్బతీశాయి. 1967 నుంచి 2004 వరకు ఆయన 9 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు.ఆ తర్వాత అల్జీమర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాధితో బాధపడిన ఆయన జ్ఞాపకశక్తిని దాదాపు పూర్తిగా కోల్పోయారు. చివరకు 2019 జనవరి 29న తుది శ్వాస విడిచారు.  కార్మికుల హక్కుల కోసం పోరాడిన కార్మిక నేతగా, దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గని రక్షణ శాఖ మంత్రిగా, ముందు చూపు ఉన్న రైల్వే మంత్రిగా ఆయన సేవలు  దేశానికి చిరస్మరణీయం.