తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతుకూలీ జనం తిరగబడిన అపూర్వ ఘట్టం. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన అద్భుత సందర్భం. ఉక్కు సంకల్పంతో ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడిన వీరులు, వీరవనితలూ ఎందరో. ఆ ఉద్యమంలో నేలకొరిగిన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య. పోరాట వీరులకు నిత్యం స్ఫూర్తినిస్తున్న ఆ అమరుడి జయంతి నేడు. 1927 ఏప్రిల్ 3న జన్మించిన ఆ రైతాంగ వీరుడి గురించి మరోసారి యాది చేసుకుందాం.

ఉమ్మడి వరంగల్ జిల్లా(ప్రస్తుతం జనగామ జిల్లా) దేవర్పులు మండలం కడివెండి గ్రామంలో గొర్రె కాపర్ల కుటుంబంలో దొడ్డి కొమురయ్య పుట్టారు. నిజాం పాలనలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవి. భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా జనాలకు హక్కులు ఉండేవి కావు. పటేల్, పట్వారీల దుర్మార్గాలతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అన్నదమ్ములైన దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమురయ్య దొరల పాలనతో విసిగిపోయారు. కమ్యూనిస్టు లీడరైన దొడ్డి మల్లయ్య చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మల్లయ్యకు అండగా కొమురయ్య నిలబడ్డాడు. తిరగబడితేనే కానీ ఈ బానిస బతుకులు మారవని ప్రజలకు వివరించారు. దొరల్ని తరిమి కొట్టాలంటే మరింత బలం కావాలని ఆలోచించిన మల్లయ్య ఆంధ్ర మహాసభ నాయకుల మద్దతు తీసుకున్నారు. గ్రామగ్రామానా మీటింగ్ లు పెట్టి ప్రజల్ని ఏకం చేశారు. దీనికి తోడు దేశ్‌‌ముఖ్ రాంచంద్రారెడ్డి, అతని తల్లి జానకమ్మల అకృత్యాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఏర్పాటయ్యాయి. గుత్పల సంఘం, వడిసెల సంఘం, కారంపోడి సంఘాల కింద జనం జమయ్యారు.

కడివెండిలో మొదలైన తిరుగుబాటు

కడివెండి గ్రామంలో 1946 జులై 4న దేశ్‌‌ముఖ్ తొత్తులకు, రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు లేవదీసింది. మల్లయ్య, కొమురయ్య నాయకత్వంలో ఆ తిరుగుబాటు ముందుకు సాగింది. మల్లయ్య, కొమురయ్యలను మట్టుబెడితే ఉద్యమం ఆపేయవచ్చునని జానకమ్మ దొరసాని ఆలోచించింది. దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా 
గడీ దగ్గరకు ర్యాలీ రాగానే రజాకార్లు, దొర బంట్లు గడీ లోపలి నుంచి జనంపైకి కాల్పులు జరిపారు. తొలుత దొడ్డి మల్లయ్య మోకాళ్లలో, మంగళి కొండయ్య నుదుట, దొడ్డి నర్సయ్య మోచేతి గుండా తూటాలు వెళ్లాయి. దొడ్డి కొమురయ్య పొట్టను చీల్చుకుంటూ తూటాలు పోవడంతో రక్తపు మడుగులో అతను నేలకొరిగాడు. కొమురయ్య రక్తంతో అక్కడి నేలంతా తడిచింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రపుటల్లోకి ఎక్కాడు.

విముక్తి పోరు నుంచి సాయుధ పోరాటంగా..

అప్పటి వరకూ శాంతియుతంగా సాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్తా కొమురయ్య అమరత్వంతో రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారింది. కొమురయ్య మరణంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తడంతో దొరల గడీ నేలమట్టమైంది. కొమురయ్య త్యాగంతో మొదలైన పోరాటం హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్ర మహాసభ కమ్యునిస్టు పార్టీగా అవతరించింది. ఎందరో నేతలు రైతులతో భుజంభుజం కలిపి తుపాకులు పట్టారు. దున్నే వాడిదే భూమి నినాదం మార్మోగింది. లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచబడ్డాయి. కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికీ స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ట్యాంక్ బండ్ పైనా కొమురయ్య విగ్రహం పెట్టడంతో పాటు జనగామ జిల్లాకు కొమురయ్య పేరు పెట్టాలి.

- దొడ్డి చంద్రం, 
కడివెండి గ్రామం, జనగామ జిల్లా