ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బతుకమ్మ ఘాట్​ ప్రారంభం

కరీంనగర్  కార్పొరేషన్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం స్థానిక 11వ డివిజన్ గౌతమినగర్ మానేర్ ఒడ్డున రూ.5లక్షల వ్యయంతో బతుకమ్మ ఘాట్, రెయిలింగ్, స్టెప్స్ తదితర పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో రూ.2కోట్లతో 20 ప్రదేశాల్లో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్, లైటింగ్, చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నర్మద, కమిషనర్ సేవా ఇస్లావత్, నాయకులు హరిశంకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 

ఎన్టీపీసీ టౌన్​షిప్​లో  బొమ్మల కొలువు


జ్యోతినగర్, వెలుగు: బొమ్మల కొలువు ద్వారా ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సీజీఎం సునీల్ కుమార్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు ఉషాకుమార్, డీఎంఎస్ కార్యదర్శి బి.సుహాసిని, సమితి సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ వచ్చాకే పండుగలకు ప్రాధాన్యత
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ 

గంగాధర, కొడిమ్యాల, వెలుగు: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే మన పండుగలకు ప్రాధాన్యత వచ్చిందని  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​అన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్​ను సోమవారం ఆయన ప్రారంభించారు.  అనంతరం కొడిమ్యాల మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన 5 హైమాస్ట్ లైట్లను రవిశంకర్ చిన్నారులతో కలిసి ప్రారంభించారు. 5వ వార్డులో బూస ప్రణతి, 12వ వార్డులో మంచాల గీతిక, 13వ వార్డులో బద్రియా,14వ వార్డు భవితతో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో  సర్పంచ్ లు సాగి రమ్య- మహిపాల్​రావు, ఏలేటి మమత- నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కృష్ణారావు, గంగాధర పీఏసీఎస్​ చైర్మన్ దూలం బాలాగౌడ్, ఎంపీటీసీ దూలం లక్ష్మి- శంకర్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

తంగళ్లపల్లి, వెలుగు: చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మండేపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాస నరసయ్య(56) సోమవారం చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు సాయంత్రం వెతకడంతో బావిలో మృతదేహం కనిపించిందని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల పోలీసులు తెలిపారు.

అడవి పంది మాంసంతో దావత్​
జేఎన్​టీయూలో  ఫారెస్ట్ అధికారుల దాడి

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూలో అడవి పంది మాంసంతో దావత్ చేసుకుంటున్నారనే సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో జేఎన్టీయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​కు కేటాయించిన క్వార్టర్​లో అడవి పంది మాంసం దొరికినట్లు డీఆర్వో ముషీర్ తెలిపారు. దొరికిన మాంసాన్ని ల్యాబ్ కు పంపించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా విషయం బయటకు పొక్కడంతో కేసు లేకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.