ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
  • మాజీ డిప్యూటీ సీఎం  దామోదర రాజనర్సింహ 

మెదక్, వెలుగు:  ప్రతీ కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​ దామోదర​రాజర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్​ డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్​ జిల్లా పరిధిలోని ఓ ఫామ్ హాజ్​లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కష్టపడి పనిచేస్తే జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్నా ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు  సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ఇన్​చార్జి నగేశ్​ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గ ఇన్​చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ నాయకులు సుప్రభాత రావు, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు, బాలకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప,  రాంచందర్ గౌడ్ పాల్గొన్నారు.

నిజాం సాగర్ బ్యాక్ వాటర్​లో పడి ఒకరు మృతి

పాపన్నపేట, వెలుగు : నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయిపల్లి గ్రామంలో జరిగింది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గండిగారి లింగమయ్య (64) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ నెల 25న సాయంత్రం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్ద వెతికారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నిజాం సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో అతడి చెప్పులు, బట్టలు కనిపించాయి. అదే రోజు నీటిలో గాలించగా ఆచూకీ లభించలేదు. మరోసారి ఆదివారం గాలించగా అతడి మృత దేహం పైకి తేలింది. చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి చెరువులో శవమై..

మెదక్ (మనోహరాబాద్), వెలుగు: ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వృద్ధురాలు చెరువులో శవమై తేలింది. ఈ ఘటన మెదక్​ జిల్లా మనోహరాబాద్​ మండలం దండుపల్లిలో ఆదివారం జరిగింది. మండలంలోని రంగాయిపల్లి గ్రామానికి చెందిన సకినాల లక్ష్మి(69) శనివారం ఆరోగ్యం బాగాలేదని మనోహారాబాద్ హాస్పిటల్ వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది.  తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా ఆదివారం ఉదయం దండుపల్లి చెరువులో ఆమె డెడ్​బాడీ కనిపించింది. ఆమె అనారోగ్య సమస్యలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు గౌడ్ తెలిపారు. 

కరెంట్​షాక్​తో ఒకరు.. 

మెదక్​ (చిన్నశంకరంపేట), వెలుగు: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్త కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ  ఘటన  మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధర్పల్లి గ్రామంలో జరిగింది. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన ప్రకారం..  గ్రామానికి చెందిన కయ్య భూపాల్ (41) తన తమ్ముడు, మరికొందరు ఫ్రెండ్స్​తో కలిసి ఎంకమ్మ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాగా ఒడ్డుపై ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి సర్వీస్ వైరు తెగి అతడిపై పడటంతో  కరెంట్​ షాక్ కు గురయ్యాడు. ఇది గమనించిన అతడి తమ్ముడు కర్ర సహాయంతో సర్వీస్ వైర్ ను తొలగించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

వేక కంపెనీ ఎదుట కార్మికుడి డెడ్​బాడీతో ఆందోళన

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ సమీపంలోని వేక కంపెనీ ఎదుట న్యాయం చేయాలని కార్మికుడి డెడ్​బాడీతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ముచ్చర్ల గ్రామానికి చెందిన మీనంపల్లి మొగులయ్య కొంత కాలంగా వేక పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వారం కింద పనిలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి‌‌పోయాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.  చికిత్స పొందుతూఅతడు ఆదివారం ఉదయం చనిపోయాడు. అయితే మొగులయ్యకు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా లాంటి సౌకర్యాలు కల్పించకపోవడంపై కంపెనీ ప్రతినిధులను బాధితులతో కలిసి ఎమ్మార్పీఎస్, స్థానిక నాయకులు వాగ్వాదానికి దిగారు. పరిశ్రమ ముందు మృత దేహాన్ని ఉంచి బాధిత న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వేణుకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పటాన్​చెరు డీఎస్పీ, భీంరెడ్డి, సీఐ, ఎస్సైలు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల వెంట సర్పంచ్ అనితాయాదగిరి, ఎంపీటీసీ కిషన్ రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసాద్, వీరయ్య బుచ్చేంద్ర, ముచ్చర్ల గణేశ్, రవి ఉన్నారు. 

కేసీఆర్ పాలనతో అన్ని వర్గాలకు న్యాయం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 

కొమురవెల్లి, వెలుగు :  రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కొత్తగా మంజురైన 606 ఆసరా పింఛన్లను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. కొమురవెల్లిలో ఎంపీపీ తలారి కీర్తన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయాన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, టీఆర్ఎస్ నాయకులు గీస భిక్షపతి, సద్ది కృష్ణారెడ్డి, కాయిత రాజేందర్ రెడ్డి, సర్పంచులు సార్ల లత, పశ్చిమడ్ల స్వామి, భీమనపల్లి కరుణాకర్, ఎంపీటీసీలు కొయ్యడ రాజమణి, లింగంపల్లి కవిత పాల్గొన్నారు.

ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
ఎమ్మెల్యే రఘునందన్​ రావు 

దుబ్బాక, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగికి ఇంట్లోనే ఉన్నామనే ఫీలింగ్​ రావాలని, అందుకు ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం దుబ్బాకలోని వంద పడకల ఆస్పత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న బాత్​రూమ్,  నీటి వసతి లేక ఎండుతున్న మొక్కలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు, ఆస్పత్రి ఆవరణను ఎప్పటికప్పుడు క్లీన్​ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు దుబ్బాక మండలం కమ్మర్​పల్లి బీజేపీ బూత్​అధ్యక్షుడు రాగం ప్రశాంత్​ యాదవ్​ ఇటీవల వివాహం చేసుకోవడంతో దంపతులను కలిసి ఆశీర్వదించారు. గ్రామ కార్యకర్త  దారబోయిన ప్రశాంత్​ నానమ్మ, బొప్పాపూర్​ ముదిరాజ్​ సంఘం అధ్యక్షుడు పర్శ శ్రీనివాస్​తల్లి చనిపోవడంతో బాధిత కుటుంబాలను కలిసి  పరామర్శించారు. 

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
నారాయణఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి

నారాయణఖేడ్, వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో డెవలప్​మెంట్​పనులను ఆయన ప్రారంభించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్​ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, వైస్​ ఎంపీపీ రేఖ పాటిల్, జడ్పీటీసీ కోట లలిత, ఆంజనేయులు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్​గంగారం,  రెవెన్యూ సిబ్బంది,  ఖేడ్​ డీఎస్పీ బాలాజీ, ఎఎస్సై ఈశ్వర్, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.  

నాలుగు దశాబ్దాల కల సాకారం

రామచంద్రాపురం, వెలుగు:  తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం కాలనీ వాసుల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. సర్వే నంబర్ 172, 174, 175, 181 నుంచి 190 వరకు ఉన్న లోమీపురం లే అవుట్​లో 40 ఏళ్ల కింద1500 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. 1984 నుంచి ఆ ప్లాట్లు వివాదంలోకి నెట్టబడడంతో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్ని రోజులుగా పోరాడుతూనే ఉన్నారు. ఇటీవల ప్లాట్ల సమస్యలు సద్దుమణుగడంతో ఆదివారం వందలాది ప్లాట్ల యజమానులు వారి కుటుంబాలతో కలిసి సామూహిక భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వైస్​ ప్రెసిడెంట్ కె.ఎన్​ మూర్తి, జనరల్ సెక్రటరీ బసవయ్య మాట్లాడుతూ ఈ ప్లాట్లను కొందరు ఆక్రమించుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెలిపారు. మొత్తానికి ఇన్నాళ్లకు సమస్య కొలిక్కి వచ్చిందన్నారు. త్వరలోనే తమ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని తెలిపారు.