
ఆధిపత్య పోరుతో ఆగమవుతున్న క్యాడర్
తరచూ వివాదాల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
మానుకోట టికెట్ కోసం మంత్రి సత్యవతి, ఎంపీ కవిత పోటీ
డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యాకు ఇంటిపోరు
ఇదే అదనుగా పావులు కదుపుతున్న ప్రతిపక్షాలు
మహబూబాబాద్, వెలుగు : తెలంగాణ కోసం నాడు రాళ్లెత్తిన మానుకోటలో నేడు ముందస్తు రాజకీయాలు జోరందుకున్నాయి. మహబూబాబాద్ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తరుచూ వివాదాల్లో తలదూర్చడం బీఆర్ఎస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. దీంతో ఇక్కడి నుంచి ఎంపీ మాలోత్కవితను ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం ఉంది. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆమెకే కట్టబెట్టడంతో అసమ్మతి రాజకీయాలు జోరందుకున్నాయి. ఇటు కవితతో పాటు అటు మంత్రి సత్యవతి రాథోడ్కూడా మానుకోట టికెట్ఆశిస్తుండడంతో ఈ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నడుస్తోంది. అటు డోర్నకల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ఇంటిపోరు మొదలైంది. ఆయన కొడుకు, కూతురు ఇద్దరూ అసెంబ్లీ టికెట్లు ఆశిస్తుండడంతో వారిలో ఎవరికి టికెట్ఇచ్చినా రెడ్యానాయక్‌కు నిరాశ తప్పదు. అటు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడంతో వర్గపోరు తీవ్రమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో గిరిజన ఓట్లే కీలకం కాగా, పోడు భూములకు పట్టాలివ్వకపోవడం బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారనుంది. ఇదే అదనుగా ఈ రెండు నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
వివాదాల్లో శంకర్‌నాయక్
మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వ్యవహారశైలి తరుచూ వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులతో కలిసి భూకబ్జాలు, ఇతర దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యవహారం ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది. 551 సర్వేనంబర్ లో మెడికల్‌కాలేజీ ఏర్పాటుచేయడానికి ముందే ఎమ్మెల్యే, అతని అనుచరుల పేర్లతో వివాదాస్పద భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి వ్యతిరేకంగా స్థానిక రైతులు పోరాటం చేయడం, న్యాయపోరాటం చేస్తున్న ఓ వార్డ్ కౌన్సిలర్పట్టపగలు హత్యకు గురికావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారులు, ముఖ్యంగా మహిళా ఆఫీసర్లతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వ్యవహారశైలిపై హైకమాండ్ కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇక శంకర్‌నాయక్.. వేదిక ఏదైనా సొంత పార్టీ లీడర్లను, కార్యకర్తలను కించపరడం వల్ల చాలా మంది దూరమయ్యారు. ఇక ఎంపీ మాలోత్ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌తో ఎమ్మెల్యే శంకర్నాయక్వర్గాల నడుమ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. మీడియా సమావేశాల్లో, అధికారిక సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు బహిరంగా ఘర్షణకు దిగిన ఘటనలు ఉన్నాయి. ఇక పెండింగ్ పనులు కూడా శంకర్‌నాయక్‌కు మైనస్‌గా మారబోతున్నాయి. మల్యాలలో వ్యవసాయ, ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు, మహబూబాబాద్ రింగ్‌రోడ్డు నిర్మాణం లాంటి హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేకపోయారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో కీలకమైన రోడ్ల విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. కానీ అండర్‌బ్రిడ్జి నుంచి ఓసీ క్లబ్ వరకు చేపట్టిన రోడ్ల విస్తరణలో తమకు తీవ్ర అన్యాయం చేశారని కొంతమంది వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. ఒక్క బజార్ ను మాత్రమే విస్తరించి, మిగిలిన రోడ్లను పట్టించుకోకపోవడంపై ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి.
అటు 2013లో కేంద్రం రూ.85కోట్లు మంజూరు చేసినా నేటికీ ఆర్వోబీ పనులు మొదలుకాలేదు. జిల్లా కేంద్రంలోని రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై విమర్శలున్నాయి. కోట్ల విలువైన 13 ఎకరాల ఎంపీడీవో ఆఫీస్ భూములు, స్మృతివనం 8 ఎకరాల భూమి, పోతిరెడ్డికుంట వద్ద 8.34 ఎకరాల ప్రభుత్వ భూమి, కోర్టు వెనుక మాతృక భూమి,చెరువులు, కుంటల శిఖం భూములు అన్యాక్రాంతమవుతున్నా నియంత్రించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. పైగా తాను, తన వర్గీయులపై స్వయంగా భూకబ్జా ఆరోపణలు రావడం ఆయనకు మైనస్ అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అటు ఎంపీ మాలోతు కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోట టికెట్ కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. మూడు వర్గాల నడుమ ఆధిపత్య పోరు సాగుతుండడంతో ఇదే అదనుగా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ బూత్లెవల్లో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, డాక్టర్ భూక్య మురళీనాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో టీపీసీసీ ప్రెసిడెంట్రేవంత్ రెడ్డి పాదయాత్ర క్యాడర్లో కొంత జోష్ నింపింది. ఇక బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ మళ్లీ టికెట్ఆశిస్తుండగా, కొత్త వ్యక్తులకు కూడా ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘ప్రజల గోస బీజేపీ భరోసా’ యాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గ్రామ స్థాయిలో బలోపేతం పైనా నాయకులు దృష్టి కేంద్రీకరించారు.
డోర్నకల్ ఎమ్మెల్యేకు ఇంటిపోరు
డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ కు ఇంటిపోరు మొదలైంది. ఈసారి రెడ్యానాయక్ కుమార్తె ఎంపీ మాలోత్ కవిత, కొడుకు ధరమ్ సొత్ రవిచంద్ర ఇద్దరూ అసెంబ్లీ రేసులో ఉన్నారు. తండ్రి పోటీ నుంచి తప్పుకొని తమకు అవకాశం ఇప్పించాలని రెడ్యానాయక్‌ను కోరుతున్నారు. వీరిలో రవిచంద్రతో పోలిస్తే కవితకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈమెకు మహబూబాబాద్లోగానీ, డోర్నకల్లోగానీ టికెట్ఇస్తే రెడ్యానాయక్‌కు, ఆయన కొడుకు రవిచంద్రకు నిరాశ తప్పకపోవచ్చు. రెడ్యానాయక్మాత్రం తన వల్లే అభివృద్ధి జరుగుతుందని, తనకు తప్ప ఎవరికి టికెట్ఇచ్చినా లాభం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మరోవైపు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ నియోజకవర్గంపై కన్నేశారు. ఆమె తన వర్గాన్ని ప్రోత్సహిస్తుండడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రాజుకుంటున్నాయి. పలు సందర్భాలలో మీడియా సమక్షంలోనే ఇరువర్గాలు విమర్శలు చేసుకున్నాయి.
గిరిపురం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుచేసి నియోజకవర్గంపై తన ముద్ర వేసుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు చాలాకాలంపాటు ఎమ్మెల్యేగా కొనసాగడం రెడ్యానాయక్‌కు మైనస్‌గా మారింది. మరిపెడ పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేయకపోడం, నరసింహుల పేటకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తేకపోవడం, డోర్నకల్ మండల కేంద్రానికి జూనియర్, డిగ్రీ, కాలేజీ మంజూరు కాకపోవడం, మరిపెడకు వ్యవసాయ మార్కెట్ లాంటి హామీలు నెరవేర్చకపోవడంతో రెడ్యానాయక్‌పై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అటు మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో ట్యాక్స్‌ల పెంపు పైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా ప్రతిపక్షాలు పట్టుబిగిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి జాటోత్ రామ్ చంద్రునాయక్, మాలోత్ నెహ్రూ నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పాదయాత్రలో రెండు వర్గాలకు చెందిన నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో క్యాడర్లోను గందరగోళం నెలకొంది. బీజేపీ నుంచి గతంలో గగులోతు లక్ష్మణ్ పోటీ చేయగా ఈసారి ఎన్నికల్లో కొత్త వారికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.