
- గతంలో ముందుకు రాకపోవడంతో 16 జిల్లాల్లో ఆగిన ప్రక్రియ
- ఇప్పటికే రెండు నెలల ఆలస్యం
- చేపల దిగుబడిపై మత్స్యకారుల ఆందోళన
నిర్మల్, వెలుగు: ఉచిత చేప పిల్లల పంపిణీపై కొద్ది నెలలుగా సందిగ్ధత నెలకొంది. టెండర్చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు కాకపోవడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని జిల్లాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో చేప పిల్లల పంపిణీకి టెండర్ ఓపెన్ చేయనుండడం ఉత్కంఠ రేపుతోంది.
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో 16 జిల్లాలకు సంబంధించి ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ దాఖలు చేయలేదు. దీంతో ఆ టెండర్ నోటిఫికేషన్ను రద్దుచేసి తిరిగి టెండర్లకు పిలిచారు. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం టెండర్ బిడ్ దాఖలు చేసేందుకు సోమవారం చివరి రోజు కావడంతో మత్స్య శాఖలో, మత్స్యకార కుటుంబాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా టెండర్లు దాఖలు చేయకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో సాగుతున్న నేపథ్యంలో ఎవరు టెండర్ ను దాఖలు చేస్తారనే విషయం బిడ్ ఓపెన్ చేసే వరకు ఎవరికీ తెలిసే పరిస్థితి లేదు.
చేపల పెంపకం రెండు నెలలు ఆలస్యం...
ప్రతి ఏటా ప్రాజెక్టులు, చెరువుల్లో ఇప్పటికే చేప పిల్లల పెంపకాన్ని మొదలుపెట్టేవారు. అయితే ఈసారి మాత్రం చేప పిల్లల పంపిణీ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా ఇప్పటివరకు మొదలే కాలేదు. ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సింది. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు మొదటినుంచి చేప పిల్లల పంపిణీ విషయంలో వెనుకడుగు వేశారు. దీంతో 16 జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా మొదటి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడంతో చేపల పిల్లల పంపిణీలో జాప్యం జరిగిందని చర్చ సాగుతోంది.
ఉమ్మడి జిల్లా అంతా ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోనూ చేప పిల్లల పంపిణీ జరగలేదు. నిర్మల్ జిల్లాలో మొత్తం 222 సహకార సంఘాలు ఉండగా అందులో 13,129 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో 557 చెరువులు, కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టులతో పాటు ఎస్సారెస్పీలోని ఎడమ భాగం కూడా నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. దీంతో జిల్లాలో మొత్తం 4.29 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 76 మత్స్య సహకార సంఘాలు ఉండగా ఈ సంఘాల్లో 4750 మంది సభ్యులున్నారు . జిల్లాలోని 224 చెరువులు, ప్రాజెక్టుల్లో 1.16 కోట్ల చేప పిల్లలను వదలాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలో 65 మత్స్య సహకార సంఘాల్లో 2762 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో 390 చెరువులు ఉండగా 2.24 కోట్ల చేప పిల్లలు అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 127 సంఘాల్లో 7350 మంది సభ్యులున్నారు. జిల్లాలో ఉన్న 276 చెరువుల్లో 1.14 కోట్ల చేప పిల్లలను వదలాల్సి ఉంది.
ఈ రకం చేపల పెరుగుదలకు అనుకూలం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువుల్లోని నీరంతా నాలుగు రకాల చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. రవ్వు, బొత్స, మిరుగాల, బంగారు తీగ రకాలు ఇక్కడి నీటిలో పెరుగుతాయి. దీంతో ఈ నాలుగు రకాల చేప పిల్లలను ప్రాజెక్టులు, చెరువుల్లో వదులుతారు. చేప ఒక కిలో బరువు పెరగాలంటే దాదాపు నాలుగైదు నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లలు పూర్తిస్థాయిలో ఎదిగే అవకాశం లేదని, దీంతో తమకు ఉపాధి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.