గీత కార్మికుల నేత బుర్ర కొండయ్య ఇక లేరు

గీత కార్మికుల నేత బుర్ర కొండయ్య ఇక లేరు

= ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శిగా సేవలు
= మంత్రి పొన్నం ప్రభాకర్  సంతాపం

గీత కార్మిక నాయకుడు బుర్రకొండయ్యగౌడ్(85) 2024, మార్చి 5వ తేదీ తెల్లవారు జామున కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడిన ఆయన.. కొంతకాలంగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత విషమించి.. తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీపీఐ సహాయకార్యదర్శిగా పని చేసిన బుర్రా కొండయ్య గౌడ్.. అనేక భూపోరాటాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం ఏర్పాటు చేసిన గీత పనివారల సంఘం ఉమ్మడి కరీంనగర్  జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. ఊరూరా తిరిగి గీత కార్మికులను ఏకం చేసిన ఘనత కొండయ్యగౌడ్ కే దక్కింది. ఎక్సైజ్ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. 

అలనాటి ఇందుర్తి ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య, సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావుతో సన్నిహితంగా ఉండే వారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పని చేశారు.  ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా ప్రజల పక్షాన పోరాడిన నాయకుడిగా కొండయ్యకు పేరుంది. గీత కార్మికుల హక్కుల స్వరం బుర్రకొండయ్యగౌడ్ మృతి పట్ల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు.