బై బై.. ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌

బై బై.. ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌
  • కరోనా టైమ్‌‌లోనూ గేమ్స్‌‌ సక్సెస్‌‌ చేసిన జపాన్‌‌
  • కలర్‌‌ఫుల్‌‌గా క్లోజింగ్‌‌ సెర్మనీ
  • మెడల్స్‌‌లో అమెరికానే టాప్‌‌.. 2024 గేమ్స్​ పారిస్‌‌లో

ఒలింపిక్స్‌‌ హిస్టరీలో టోక్యో గేమ్స్‌‌ చాలా స్పెషల్‌‌. కరోనా మహమ్మారి కాలంలో.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని  నిలబడగలమన్న సందేశాన్ని ఈ గేమ్స్‌‌ ప్రపంచానికి ఇచ్చాయి. మనిషిని చూసి మనిషే భయపడాల్సిన పరిస్థితుల్లో.. 206 దేశాల నుంచి 11వేల పైచిలుకు క్రీడాకారులను ఒక్కచోటుకు తీసుకొచ్చి.. అసలు ఆటంకమే లేకుండా గేమ్స్​ నిర్వహించిన తీరు అద్భుతం. ఆదివారం అట్టహాసంగా జరిగిన క్లోజింగ్‌‌ సెర్మనీలో 2024లో జరిగే 33వ ఒలింపిక్స్‌‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పారిస్‌‌కు ఒలింపిక్‌‌ జెండాను అప్పగించడంతో 17 రోజుల మెగా గేమ్స్‌‌ పూర్తయ్యాయి.

ప్రతిభ ముందు ప్రమాదం చిన్నబోయింది..! సాధించాలన్న తపన ముందు ప్రాణాంతక వైరస్‌‌ ఓడిపోయింది..!  కష్టకాలంలో ఐక్యతను చాటుతూ.. భవిష్యత్‌‌పై భరోసాను కల్పిస్తూ.. క్రీడా ప్రపంచాన్ని  ఉర్రూతలుగించిన 32వ విశ్వ క్రీడాసంబురం టోక్యో ఒలింపిక్స్‌‌ విజయవంతంగా ముగిసింది..! ఆదివారం అట్టహాసంగా జరిగిన క్లోజింగ్‌‌ సెర్మనీలో 2024లో జరిగే 33వ ఒలింపిక్స్‌‌కు ఆతిథ్యం ఇస్తున్న పారిస్‌‌కు ఒలింపిక్‌‌ జెండాను అప్పగించడంతో 17 రోజుల మెగా గేమ్స్‌‌ పూర్తయ్యాయి. 

ఇది వరకు ఎన్నో ఒలింపిక్స్‌ అద్భుతంగా సాగి ఉండొచ్చు..! ఫ్యూచర్‌లో మరింత గొప్పగా జరుగొచ్చు..! కానీ, ఒలింపిక్స్‌ హిస్టరీలో టోక్యో గేమ్స్‌ చాలా స్పెషల్‌..!  కరోనా టైమ్‌లో.. మనిషిని చూసి మనిషే భయపడాల్సిన పరిస్థితుల్లో.. 205 ప్లస్‌ దేశాల నుంచి 11వేల పైచిలుకు క్రీడాకారులను ఒక్కచోటుకి తీసుకొచ్చి.. అసలు ఆటంకమే లేకుండా నిర్వహించిన  ఈ గేమ్స్‌ చరిత్రలో నిలిచిపోతాయి..!  ఐఓసీ ప్రెసిడెంట్‌ థామస్‌ బాచ్‌ చెప్పినట్టు.. కరోనా తర్వాత తొలిసారి ఈ గేమ్స్‌ కోసం ప్రపంచం మొత్తం ఏకమైంది. ఆనందం, సంతోషం, ఉద్వేగం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ప్రజలంతా పంచుకు న్నారు.! భవిష్యత్తుపై ఆశను, విశ్వాసాన్ని కలిగించడంతో పాటు  మున్ముందు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని  నిలబడగలమన్న  సందేశాన్ని ఈ గేమ్స్‌ ప్రపంచానికి ఇచ్చాయి..!  పతకం నెగ్గాలన్న ఆశతో పాటు ఏం జరుగుతుందోనన్న అనుమానంతో జపాన్‌ గడ్డపై అడుగుపెట్టిన క్రీడాకారులు ముఖంలో చిరునవ్వుతో టోక్యోకు టాటా చెప్పారు..! ఐఓసీ, జపాన్‌ ప్రభుత్వం, టోక్యో ఆర్గనైజర్స్‌ నిరంతర కృషికి ఫలితమిది..! ఇంత గొప్ప ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన టోక్యో, జపాన్‌కు వారి భాషలోనే కృతజ్ఞతలు చెబుదాం..! అరీగతో టోక్యో.. అరీగతో జపాన్‌..! అరీగతో అంటే..జపనీస్‌లో థ్యాంక్యూ అని అర్థం..!


టోక్యో: ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డుతూ సాగి, 17 రోజుల పాటు క్రీడాభిమానులకు వినోదాన్ని పంచిన టోక్యో ఒలింపిక్స్‌‌కు శుభం కార్డు పడింది.  కరోనా కారణంగా ఈ గేమ్స్​ ఏడాది ఆలస్యంగా జరగడంతో ఖర్చు అమాంతం పెరిగింది. అదే టైమ్​లో జపాన్​  ప్రజల నుంచి చాలా వ్యతిరేకత ఎదురైనా  గేమ్స్‌‌ విలేజ్‌‌లో పాజిటివ్‌‌ కేసులు కలవరపెట్టినా.. ఆట మొదలయ్యాక ఓ వైపు విపరీతమైన ఎండ, ఉక్కపోత, ఇంకోవైపు తుఫాను ఇబ్బంది కలిగించినా.. జపాన్‌‌ ప్రభుత్వం, ఆర్గనైజింగ్‌‌ కమిటీ, ఇంటర్నేషనల్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ (ఐఓసీ) గేమ్స్‌‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సక్సెస్‌‌ఫుల్‌‌గా పూర్తి  పూర్తి చేశాయి. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లను స్మరించుకుంటూ, ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొని ముందుకు సాగగలం అనే సందేశంతో ఆదివారం ఇక్కడి నేషనల్‌‌ స్టేడియంలో జరిగిన క్లోజింగ్‌‌ సెర్మనీలో  ఒలింపిక్స్‌‌ జెండాను  2024 గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇచ్చే పారిస్‌‌కు అందజేశారు.  ఈ గేమ్స్‌‌ పట్టాలెక్కడంలో, సాఫీగా సాగడంలో ముఖ్యపాత్ర పోషించిన ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్​ బాచ్‌‌..  కరోనాకు ఎదురొడ్డి బరిలోకి దిగిన అథ్లెట్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఈ కష్టకాలంలో ఐక్యంగా నిలబడ్డ అథ్లెట్స్‌‌ చాలా వేగంగా ముందుకెళ్లారు.  ఎంతో ఎత్తుకు ఎదిగారు. మరింత ధృడంగా మారారు. మీ ఆటతో మాకు స్ఫూర్తినిచ్చారు’ అని పేర్కొన్నారు. ఈ గేమ్స్‌‌  ఆశకు, ఐక్యతకు ప్రతీక అన్నారు. ఇంత గొప్ప ఈవెంట్‌‌ను నిర్వహించిన జపాన్‌‌ ప్రజలు గర్వపడాలన్నారు. అథ్లెట్ల తరఫున థ్యాంక్స్‌‌ చెప్పారు. పారిస్​ గేమ్స్​ 2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరగనున్నాయి. ఇక, టోక్యోలో ఒలింపిక్స్​ ముగిసినప్పటికీ మరికొన్ని రోజుల్లోనే మరో సందడి మొదలవనుంది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్​ 5  వరకు పారాలింపిక్స్​ జరుగుతాయి. 

మన ఫ్లాగ్​ బేరర్​గా బజ్​రంగ్
టోక్యో నేషనల్‌‌ స్టేడియంలో  గేమ్స్‌‌ ముగింపు వేడుకలు కలర్‌‌ఫుల్‌‌గా సాగాయి. కళ్లు మిరిమిట్లు గొలిపే బాణా సంచా, కళాకారుల డ్యాన్స్‌‌, మ్యూజిక్​, జపాన్‌‌ సంస్కృతి ఉట్టిపడే కళలతో వేడుక సాగింది. అదే టైమ్‌‌లో ప్రత్యేక లైటింగ్‌‌లో స్టేడియంలో సృష్టించిన  ఒలింపిక్స్‌‌ రింగ్స్‌‌ ఆకట్టుకున్నాయి.  ఓపెనింగ్‌‌ సెర్మనీ మాదిరిగా.. దీనికి కూడా ఫ్యాన్స్‌‌ను ఎంట్రీ లేకపోయినా.. అథ్లెట్లు, అఫీషియల్స్‌‌తో నేషనల్‌‌ స్టేడియం కోలాహాలంగా కనిపించింది. వైరస్‌‌ భయంతో పాటు గేమ్స్‌‌ టైమ్‌‌లో  విపరీతమైన వేడి, తుఫాను కలవరపెట్టినా కూడా పోటీలు సాఫీగా సాగడంతో అందరి ముఖాల్లో ఆనందం కనిపించింది.  ఓపెనింగ్‌‌ సెర్మనీలా ప్రత్యేక  డ్రెస్‌‌ కోడ్‌‌తో కాకుండా అథ్లెట్లు, అఫీషియల్స్‌‌ ఫార్మల్‌‌ డ్రెస్సుల్లో చాలా రిలాక్స్‌‌డ్‌‌గా కనిపించారు. వేడుకను ఎంజాయ్‌‌ చేశారు. చాలా మంది తమ మొబైల్‌‌ ఫోన్స్‌‌తో సెర్మనీని చిత్రీకరించగా.. ఇంకొందరు తమ దేశ జెండాలను పట్టుకున్నారు.  ముగింపు వేడుకల్లో స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియా  ఇండియా ఫ్లాగ్‌‌బేరర్‌‌గా వ్యవహరించాడు. 17 రోజుల పాటు సాగిన ఈవెంట్‌‌, పోటీలపై చిత్రీకరించిన వీడియోను స్టేడియంలోని పెద్ద స్క్రీన్లపై ప్లే చేయడంతో సెర్మనీ మొదలైంది.  ‘మనం పంచుకునే ప్రపంచాలు’ అనే థీమ్‌‌తో క్లోజింగ్‌‌ సెర్మనీ సాగింది. ఇందులో లైట్స్‌‌, మ్యూజిక్‌‌, ఫైర్‌‌ వర్క్స్‌‌, స్టంట్స్‌‌ అన్నీ కనిపించాయి.  ఈ సెర్మనీలో  తర్వాతి గేమ్స్‌‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశం (ఫ్రాన్స్‌‌) పారిస్‌‌ జాతీయ గీతంతో కూడిన ఓ వీడియోను ప్లే చేశారు. అనంతరం టోక్యో గవర్నర్‌‌ యురికో కొయికె.. ఒలింపిక్‌‌ ఫ్లాగ్‌‌ను ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్​ బాచ్‌‌కు ఇచ్చారు. ఆయన దానిని పారిస్‌‌ మేయర్‌‌ అనె హిడాల్గోకు అందజేశారు. ఒలింపిక్స్‌‌ క్లోజింగ్‌‌ సెర్మనీలో ఇప్పటిదాకా కేవలం గేమ్స్‌‌ వాలంటీర్ల (ఫీల్డ్‌‌)కు మాత్రమే  గుర్తింపునివ్వగా.. తొలిసారిగా  సిటీ వాలంటీర్స్‌‌ సేవలనూ గుర్తించారు. 

పారిస్​లో ఫుల్​ జోష్​
ఓవైపుటోక్యోలో క్లోజింగ్​ సెర్మనీ జరుగుతుండగా.. వచ్చే ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇచ్చే పారిస్​లోనూ ఫుల్​ జోష్​ కనిపించింది. టోక్యోగేమ్స్‌‌ ప్రారంభానికి ముందు వెలిగించిన  కలడ్రాన్‌‌  (ఒలింపిక్‌‌ జ్యోతి)ను ఆర్పే ముందే పారిస్‌‌ నగర ప్రధాన కూడలిలో వేలాది మంది ప్రజలు జమయ్యారు. ఫ్రాన్స్‌‌లోని పలు ప్రాంతాల్లో  ప్రజలు కూడా సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన లైవ్‌‌ను కూడా ఫస్ట్‌‌ టైమ్‌‌ క్లోజింగ్​ సెర్మనీలో ప్లే చేశారు.  ఇందులో భాగంగా పారిస్‌‌ అందాలను చూపించడంతో, ఆ నగరంలోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో మ్యుజిషియన్స్‌‌ పెర్ఫామెన్స్‌‌లను లైవ్‌‌ టెలికాస్ట్‌‌ చేశారు. ‘దూరంగా ఉన్న కలిసి ఆడగలం’ అనే సందేశాన్ని ఇచ్చారు.

మళ్లీ అమెరికాదే టాప్​.. చైనాకు రెండో ప్లేస్‌‌
సత్తా చాటిన ఆతిథ్య జపాన్‌‌.. ఇండియాకు 48వ స్థానం

టోక్యో: ఒలింపిక్స్‌‌లో మరోసారి అమెరికా హవా కొనసాగింది. టోక్యోలో  యూఎస్‌‌ఏ.. 39 గోల్డ్‌‌, 41 సిల్వర్‌‌, 33 బ్రాంజ్‌‌తో కలిపి మొత్తం 113 మెడల్స్‌‌తో వరుసగా మూడో సారి టేబుల్‌‌ టాపర్‌‌గా మెగా గేమ్స్‌‌ను ముగించింది. 2016  రియో, 2012 లండన్‌‌ ఒలింపిక్స్‌‌లోనూ అమెరికానే అత్యధిక మెడల్స్‌‌ గెలిచింది. రియో ఒలింపిక్స్‌‌ను థర్డ్‌‌ ప్లేస్‌‌తో ముగించిన చైనా.. ఈసారి రెండో స్థానంలో నిలిచింది,  చైనా అథ్లెట్లు టోక్యో గేమ్స్‌‌లో  మొత్తం 88 మెడల్స్‌‌ (38 గోల్డ్‌‌, 32 సిల్వర్‌‌, 18 బ్రాంజ్‌‌) సాధించారు. ఇక, సొంతగడ్డపై ఆడిన జపాన్‌‌ అథ్లెట్లు అదరగొట్టారు. హోమ్‌‌ కండిషన్స్‌‌ను అడ్వాంటేజ్‌‌గా చేసుకుని 58 మెడల్స్‌‌ రాబట్టి మూడో ప్లేస్‌‌ సాధించారు.  ఇందులో 27 గోల్డ్‌‌ , 14 సిల్వర్‌‌, 17 బ్రాంజ్‌‌మెడల్స్‌‌ ఉన్నాయి. ఒలింపిక్స్‌‌లో జపాన్‌‌కి ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్‌‌ కావడం విశేషం. గోల్డ్‌‌, బ్రాంజ్‌‌తోపాటు ఓవరాల్‌‌ మెడల్స్‌‌ సంఖ్యలోనూ టోక్యో గేమ్స్‌‌లో తమ రికార్డులు మెరుగుపర్చుకుంది. ఒలింపిక్స్‌‌కు ఆతిథ్యమిచ్చే దేశాలు కొన్ని కొత్త ఆటలను పోటీల్లో చేర్చుతాయి. అలా చేర్చిన ఆటలు మెడల్‌‌ వేటలో జపాన్‌‌కు ప్లస్‌‌ అయ్యాయి. టోక్యో గేమ్స్‌‌లో కొత్తగా చేర్చిన ఆటల ద్వారా జపాన్​14 మెడల్స్‌‌ సాధించింది. ఇక, పారిస్‌‌ ఒలింపిక్స్‌‌లో బ్రేక్‌‌ డాన్సింగ్‌‌, సర్ఫింగ్‌‌, కరాటే, స్పోర్ట్స్‌‌ క్లైంబింగ్‌‌ కొత్తగా చేర్చనున్నారు. కాగా, టోక్యో గేమ్స్‌‌లో 65 మెడల్స్‌‌తోబ్రిటన్‌‌(22 గోల్డ్‌‌, 21 సిల్వర్‌‌, 22 బ్రాంజ్‌‌),  71  మెడల్స్‌‌తో రష్యన్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ(20 గోల్డ్‌‌, 28 సిల్వర్‌‌, 23 బ్రాంజ్‌‌) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక,  ఒక గోల్డ్‌‌, రెండు సిల్వర్‌‌, నాలుగు బ్రాంజ్‌‌తో కలిపి మొత్తం ఏడు మెడల్స్‌‌ గెలిచిన ఇండియా 48వ స్థానంలో టోక్యో గేమ్స్‌‌ను ముగించింది.

అమెరికా స్విమ్మర్‌‌ డ్రెసెల్‌‌ టోక్యోలో గెలిచిన గోల్డ్‌‌ మెడల్స్‌‌ సంఖ్య 5.
ఆస్ట్రేలియా స్విమ్మర్‌‌ ఎమ్మ మెక్‌‌కాయిన్‌‌ టోక్యోలో గెలిచిన మెడల్స్‌‌ సంఖ్య 7. ఇందులో 3 గోల్డ్‌‌, 4 బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ ఉన్నాయి.