
టోక్యో: ఇండియన్ అథ్లెటిక్ అభిమానులకు టోక్యో పారాలింపిక్స్ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. F52 విభాగంలో మెన్స్ డిస్కస్ త్రో ఈవెంట్‌లో నిన్న (ఆదివారం) మన అథ్లెట్ వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. F52 విభాగంలో ఆడడానికి ఆయనకు ఎలిజిబులిటీ లేదని, అందుకే ఆయన ఫలితాన్ని చెల్లనిదిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
నిన్న జరిగిన పారాలింపిక్స్ ఈవెంట్లలో మనోళ్లు ఒక్క రోజులోనే మూడు మెడల్స్ గెలిచారు. విమెన్ సింగిల్స్ క్లాస్–4 టేబుల్ టెన్నిస్‌లో భవీనా బెన్ పటేల్, మెన్ టీ–47 హైజంప్‌లో నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్స్ గెలవగా, ఆర్మీ మాజీ జవాన్ వినోద్ కుమార్.. మెన్ F52 సీటెడ్ డిస్కస్ త్రోలో కాంస్యం సాధించి ఇండియా ఆనందాన్ని ట్రిపుల్ చేశాడు. అయితే వినోద్ (కేటగిరీ) క్లాసిఫికేషన్‌పై ప్రత్యర్థి రివ్యూకు వెళ్లడంతో.. ఆయనరిజల్ట్‌ను నిర్వాహకులు హోల్డ్‌లో పెట్టారు. దీనిపై సోమవారం పారాలింపిక్స్ టెక్నికల్ టీమ్ రివ్యూ చేసింది. F52 కేటగిరీ కిందకు మజిల్ పవర్ కోల్పోయిన అథ్లెట్స్, కాళ్లు చేతుల్లో లోపం లేదా కాళ్ల పొడవులో తేడా ఉన్న అథ్లెట్స్ మాత్రమే వస్తారని పేర్కొంది. అయితే ఆగస్టు 22న ఈ కేటగిరీలోకి వినోద్ కుమార్‌ను రివ్యూ చేసే అనుమతించినప్పటికీ, సోమవారం మరోసారి రీక్లాసిఫికేషన్ అసెస్‌మెంట్ చేపట్టింది టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ టీమ్. ఈ సందర్భంగా ఆయన ఈ క్లాసిఫికేషన్ పరిధిలోకి రాడని తేల్చింది. దీంతో మెడల్ వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్..
అథ్లెట్ వినోద్ కుమార్‌ది భారత సైన్యంలో సేవలందించిన కుటుంబం. 1971 ఇండో–పాక్ వార్‌లో వినోద్ కుమార్ తండ్రి ఇండియన్ ఆర్మీ వీర సైనికుడిగా పోరాడారు. వినోద్ కూడా బీఎస్‌ఎఫ్‌లో సైనికుడిగా చేరారు. అయితే లఢఖ్‌లోని లేహ్‌లో శిక్షణ పొందుతుండగా ప్రమాదవశాత్తు కొండ అంచు నుంచి కిందపడిపోవడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. వెన్నెముకకు దెబ్బ తగలడంతో శరీర భాగాల్లో చలనం లేకుండా దాదాపు పదేండ్లకు పైగా పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా మళ్లీ జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో ఆ వైకల్యాన్ని జయించి పారాలింపిక్స్‌నే తన లక్ష్యంగా ఎంచుకున్నారు. అయితే కష్టపడి మెడల్ సాధించిన తర్వాత కేటగిరీ క్లాసిఫికేషన్‌పై అభ్యంతరం రావడం, మెడల్ వెనక్కి తీసుకోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.