ప్రపంచంలో టోక్యో చాలా సేఫ్

ప్రపంచంలో టోక్యో చాలా సేఫ్

ప్రపంచంలో మొత్తం 60 నగరాల్లోని  పరిస్థితులను పరిశీలిస్తే టోక్యో ను మించిన సేఫెస్ట్ సిటీ  మరోటి లేదని వాళ్లూ వీళ్లూ కాదు, ఎంతో పేరున్న ‘ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ’( ఈఐయు) లేటెస్ట్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. సేఫ్టీకి సంబంధించి ఆసియా – పసిఫిక్ ప్రాంతమే మిగతా ప్రాంతాలతో  పోలిస్తే ముందున్నదని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

సేఫ్ అని చెప్పడానికి ప్రాతిపదికలేంటి ?

ఫలానా సిటీ సేఫ్ అని చెప్పడానికి  చాలా కసరత్తు చేస్తారు. మొత్తం 57 అంశాల ఆధారంగా  ఏ దేశం ఎంతవరకు సేఫ్ అని నిర్థారిస్తారు. ఈ అన్ని అంశాల్లో  ఓకే అయితే కానీ ఏ సిటీనైనా సేఫ్ అని డిక్లేర్ చేయరు. ఈ ఇండికేటర్స్ లో వ్యక్తిగత భద్రత కు  టాప్ ప్రయారిటీ ఇస్తారు. దీంతో పాటు సైబర్ నేరాల సంఖ్య, వైద్య సదుపాయాలు, ప్రజలకు అవసరమైన వసతులు,పర్యావరణం, విపత్తులను తట్టుకునే సత్తా, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు అక్కడుండే పౌరులు ఏ వయసు వరకు బతికుండే అవకాశం ఉందనేది కూడా ఒక ఇండికేటర్. ప్రతి ఇండికేటర్ కు ఇన్ని మార్కులంటూ కేటాయిస్తారు. అన్నిటిలోనూ ఎక్కువ మార్కులు తెచ్చుకున్న సిటీ లే  చివరకు టాప్ –10 లిస్టులో ఉంటాయి. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 60 సిటీల పేర్లతో ఓ లిస్టు విడుదల చేస్తే అందులో టోక్యో సిటీ ఫస్ట్ మార్కు కొట్టేసింది.

టోక్యో  స్పెషాలిటీ ఏంటి ?

ప్రజల భద్రతకు టోక్యో అధికారులు ప్రయారిటీ ఇస్తారు. టోక్యో సిటీ లో ఉండేవారెవరూ సేఫ్టీ గురించి భయపడాల్సిన ముచ్చటే ఉండదు. మరీ ముఖ్యంగా  లేడీస్ సేఫ్టీకి చాలా ప్రాధాన్యమిస్తారు. సింగిల్ ఉమన్  అయినా కూడా ఎలాంటి జంకూగొంకూ లేకుండా సిటీలో ఉండొచ్చు. మెయిన్ రోడ్లలోనే కాకుండా మారుమూల గల్లీల్లో కూడా తిరుగుతూ హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. టూరిస్టు ప్లేసెస్ లో  షికార్లు కొట్టొచ్చు. ఎలాంటి భయం లేకుండా ఏ టూరిస్టు స్పాట్ కైనా వెళ్లొచ్చు. టోక్యో సిటీలోని కొన్ని ప్రాంతాలకు రాత్రిపగలు అనే తేడానే ఉండదు. రాత్రిళ్లు కూడా ఆ ఏరియాల్లో షాపులు తెరిచే ఉంచుతారు. ఇలాంటి ఏరియాల్లో కూడా ఆడవాళ్లు ఒంటరిగా నడిచి వెళ్లొచ్చు. మాల్స్ కు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు. గూండాల బెడద అనేదే ఉండదు. అలాగే టోక్యో  సిటీలో  క్రైమ్ రేటు కూడా చాలా తక్కువ. వీటన్నిటితో పాటు ప్రజలు సిటీలో  ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్లాలన్నా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థ పక్కాగా ఉంటుంది.

రెండో ప్లేస్ లో సింగపూర్

సేఫెస్ట్ సిటీస్ లిస్టులో  సింగపూర్ కు రెండో స్థానం దక్కింది. ప్రజలకు అవసరమైన సదుపాయాలు, పర్సనల్ సెక్యూరిటీ విషయంలో సింగపూర్ బాగా  కృషి చేసిందని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ అభిప్రాయపడింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ నేరాలు జరిగే ప్రాంతంగా సింగపూర్ కు పేరుంది. సింగపూర్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడి చట్టాల ప్రకారం 32 రకాల నేరాలకు ఏకంగా మరణ శిక్ష వేయవచ్చు. హత్య, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజం, అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం ..ఈ నేరాలు రుజువైతే  మరణ శిక్ష విధించవచ్చు. శిక్షలు ఇంత తీవ్రంగా ఉంటాయి కాబట్టే  సింగపూర్ ప్రజలు నేరాల జోలికి పోరు.

ముంబై, ఢిల్లీ సిటీల సంగతేంది ?

మన ముంబై, ఢిల్లీ నగరాలకు కూడా  ఈ జాబితాలో చోటు దక్కింది. ‘ ఫైనాన్షియల్ కేపిటల్ ’ గా పేరు తెచ్చుకున్న ముంబై సిటీకి జాబితాలో 45 స్థానం దక్కింది.  ముంబై సిటీలో రాత్రింబవళ్లు బిజినెస్ యాక్టివిటీస్ నడుస్తుంటాయి. అంతేకాదు పెద్ద సంఖ్యలో టూరిస్టులు కూడా ఇక్కడకు వస్తుంటారు. పోలీసు  గస్తీ ఉన్నా  చిన్న చిన్న  నేరాలు జరుగుతూనే ఉంటాయి. ముంబై సంగతి ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ నగరానికి 52 వ ప్లేస్ ఇచ్చింది తాజా రిపోర్ట్. డిజిటల్ సెక్యూరిటీలో 47వ ర్యాంకు వచ్చింది. ఢిల్లీలో క్రైమ్ రేట్ బాగా ఎక్కువ. ట్యాక్సీ డ్రైవర్లు చేసే మోసాలు ఎక్కువగా ఉంటాయి.రాత్రి పూట జర్నీ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి. ఢిల్లీలో కూడా ఆడవారికి సెక్యూరిటీ పరంగా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా తిరగడం ఏమాత్రం మంచిదికాదంటారు ఇక్కడి పోలీసులు. చివరి ప్లేసుల్లో ఢాకా, కరాచీ ఢాకా, కరాచీ నగరాలకు లిస్టులో చివరి ప్లేసులు దక్కాయి. ఢాకా కు 56వ ర్యాంకు దక్కితే, కరాచీ కి 57వ ప్లేస్ లభించింది.

టాప్ -10 సేఫెస్ట్ సిటీస్
1.టోక్యో
2.సింగపూర్
3.ఒసాకా
4.ఆమ్ స్టర్ డ్యామ్
5.సిడ్నీ
6.టొరంటో
7.వాషింగ్టన్ డీసీ
8.కోపన్ హెగన్
9.సియోల్
10.మెల్ బోర్న్