స్వయంకృషికి దక్కిన పద్మవిభూషణ్​

స్వయంకృషికి దక్కిన పద్మవిభూషణ్​

 

Every Person Begins With Two Beliefs  : Future Can be Better Than The Present, And I Have The Power To Make It So-.David Brooks.

ప్రతి మనిషి రెండే రెండు విశ్వాసాలను నమ్మి జీవితంలో ముందుకు నడుస్తాడు. ఒకటి భవిష్యత్తు గొప్పగా ఉంటుందనుకోవడం, రెండు తాను సాధిస్తాననే నమ్మకం పెట్టుకోవడం. ఈ రెండు నమ్మకాలే మనిషిని విజయ తీరాలకు చేరుస్తాయి. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు- మహా పురుషు లవుతారు’ అన్నాడొక సినీకవి. పట్టుదల, విశ్వాసం, క్రమశిక్షణ, ఓర్పు, కృషి  మనిషిని అత్యున్నతంగా నిలబెడతాయి. ఈ మాటల ఆచరణకు ఎవరెస్టు శిఖరం లాంటి నిలువెత్తు సంతకం చిరంజీవి. అటు నట జీవితానికి, ఇటు సమాజ సేవకు తన నిబద్ధతను కనబరుస్తూ సమసమాజ కాంక్షిగా పరిశ్రమిస్తూ నేడు పద్మవిభూషణ్ అందుకోబోతున్నారు. 

నట కౌశలుడు

మెగాస్టార్  చిరంజీవి తెలుగు చిత్రసీమకు చిరునామా. మొగల్తూరులో జన్మించిన ఈ అందాల బుల్లోడు.. కొణిదెల అంజనాదేవి, వెంకట్రావు దంపతుల  గుండెచప్పుడు. అందాల పశ్చిమ గోదావరి ఆత్మీయతను, అనురాగాన్ని శ్వాసగా మార్చుకున్నవాడు. చిన్నతనం నుంచే యాక్టర్ కావాలనే ఆశలను రంగస్థలంపై  రంగరించి చూపాడు. మనసులో నాటుకున్న యాక్టింగ్ ఆసక్తి డిగ్రీ పూర్తి కాగానే ఆయన్ని మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్​లో  జాయిన్ అయ్యేలా చేసింది. 

పునాదిరాళ్లతో గట్టి నటనా పునాదులు వేసుకొని చిన్నా, పెద్దా అనకుండా ప్రతిపాత్రను ప్రాణంపెట్టి పోషించడమే అతని కౌశలంగా మార్చుకున్నాడు.  ఆయన నటిస్తుంటే కైలాసం నుంచి శంకరుడే వచ్చి ఈ కొణిదెల శంకరుడుగా నటిస్తున్నడా! అనిపిస్తుంది. తెరమీద భావాలు పండించడం చూస్తే నవరసాలు ఆయన్ని కైవశం చేసుకున్నాయా అనిపిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకోకుండానే చేసిన డాన్స్ చూసేవారి మదిని మరిపించక మానవు. శరీరంలో ఎముకలున్నాయా! అన్నట్లుగా ఫ్లెక్సిబుల్​గా ఏ స్టెప్ నైనా అలవోకగా చేసెయ్యగల దిట్ట. 

సందేశాత్మక నటుడు

స్వయంకృషితో సమున్నతంగా, రుద్రవీణతో సమగ్రతను సంఘానికి బోధించిన కళాకారుడు. కళాకారుడి కళ కలకోసమే కాదు సమాజానికి హితం కలిగించడానికే అన్న విమర్శకుల ప్రశంసలు అందుకున్న నట దిగ్గజం చిరంజీవి.  సమాజంలో మార్పు అనివార్యమన్న సంధికాలాన్ని తన కళాకౌశలంతో గడపగడపకూ చేర్చాడు చిరంజీవి. ఖైదీతో స్టార్​డం సాధించి, బిల్లా రంగా, సంఘర్షణ, దొంగ, అడవిదొంగ, కొండవీటి రాజా, కొదమ సింహం లాంటి సినిమాలతో మాస్ ఇమేజ్​ను సాధించి సామాన్యుల గుండెల్లో చెరిగిపోని స్థానం సాధించుకున్న అసామాన్యుడు చిరంజీవి. 
స్టార్ స్టార్.. మెగాస్టార్ అని అందరి పెదాలను, వినసొంపైన పదాల్లోకి కదిలించి తన ‘పసివాడి ప్రాణం’ సినిమాలో  బ్రేక్ డాన్స్ చేసి సినిమా లోకంలో ఒక ట్రెండ్ సెట్టర్​గా నిలిచాడు. అంజి, శ్రీ మంజునాథ వంటి సినిమాలతో అపూర్వ నటులకు తానేమీ తక్కువ కాదని కాలరెగరేసి చాటిన పున్నమి చంద్రుడు. 
సమ సమాజ నిర్మాణమే పౌరుడి బాధ్యత అని చాటిచెబుతూ అవినీతి రహిత సమాజాన్ని కాంక్షించిన ఠాగూర్, స్టాలిన్, దేశభక్తిని, తెలుగు వీరుల పౌరుషాన్ని తెరమీద ‘సైరా నరసింహరెడ్డి’ పాత్రలో ఉయ్యాలవాడ వీరుణ్ణి దేశ చిత్రసీమ హృదయంపై పచ్చబొట్టుగా ముద్రించాడు. ఆయన ఆడినా, పాడినా క్రేజే. చిరు స్టెప్పులంటే యువకులకే కాదు పెద్దవారికి కూడా హుషారే. పర్దా మీద గంభీరమైన డైలాగులు, క్లాస్, మాస్​లతో కేరింతలు పెట్టించారన్నా, బాక్సాఫీస్ బద్దలు కొట్టారన్నా అది చిరంజీవే. 

సామాజిక సేవలో..

నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు ఎదుర్కొంటూ నటనే తన జీవనసూత్రంగా అందనంత ఎత్తుకు ఎదిగిన సినిమా బంధువు చిరంజీవి. దేశపౌరుడిగా, అభిమానుల అండగా సామాజిక సేవను కూడా అంతే ప్రేమతో నిర్వహిస్తున్నాడాయన. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందరి అన్నయ్యగా,  చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్​ల ద్వారా లక్షలాది జనాల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆపదలో ఉన్నవారికి, ఎదిగి వస్తున్న నటులకు, కళాకారులకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నారు. ఆయన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డులు నడిచి వచ్చాయి. నంది అవార్డులు, ఫీలిం ఫేర్ అవార్డులు, ఉత్తమ నటుడు ఇలా లెక్కించడానికి కూడా వీలులేనన్ని అవార్డులకు  హక్కుదారైనాడు. అలనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు, 2022 సంవత్సరానికి భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత గౌరవాన్ని కలిగిన ఇండియన్ ఫిలిం పర్సనాలిటి ఆఫ్ ద ఇయర్-2022ను నవంబర్ 28న అందుకున్న  నిగర్వి చిరంజీవి. నేడు భారత ప్రభుత్వం అందించే అత్యున్నమైన పురస్కారాలలో రెండవదైన పద్మవిభూషణ్​ను అందుకోబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ అవార్డును చిరంజీవి పొందడమంటే తెలుగు జాతిని సగౌరవంగా సన్మానించుకోవడమే. 

నిష్ఠా గరిష్టుడు

అవార్డులు,  రివార్డులు ఊరికే రావు. పొగడ్తలకు తావులేకుండా కర్మయేవ జయతే అనుకుంటూ చేసే పనిలో, పక్కనున్న మనిషిలో, సాటి సమాజంలో దైవాన్ని చూసుకుంటూ కర్తవ్య నిష్ఠతో ముందుకుపోయే వారికి యాదృచ్ఛికంగా వరిస్తూనే ఉంటాయి. అట్లా శ్రమలో, కర్తవ్యంలో తనను తాను సాన బెట్టుకుంటూ, ఎదిగిన కొద్దీ ఒదుగుతూ నిత్యం తనను తాను తీర్చిదిద్దుకోవడంలో, నేటి తరంతో పోటీపడుతూ పారాహుషార్​గా పరిమళిస్తున్న  మెగా స్టార్ మన చిరంజీవికి మరోసారి అభినందనలు. 

ఎదిగిన కొద్ది ఒదిగి ఉన్న సంస్కారవంతుడు

నటించడంలో ఎంత నిబద్ధుడో, సమాజ ఉన్నతిని కోరుకోవడంలో ఎంతటి సౌశీలుడో, వేదిక మీద అతిథులను గౌరవిస్తూ అందరినీ గౌరవించడంలో అంతే సంస్కారవంతుడు. తనకు ప్రేమను పంచే తన అభిమాన కుటుంబాన్ని, నిరంతర అభిమానాన్ని ఆప్యాయతను పంచి తన ఎదుగుదలకు కారణమైన ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా కృతఙ్ఞతలు చెప్పుకుంటూ..“శివశంకర వరప్రసాద్​గా నా కన్నవాళ్ళకు,  ప్రేమతో నన్ను  తీర్చిదిద్ది,  నన్ను చిరంజీవిగా లోకానికి అందించి, నన్ను చిరంజీవిని చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీకి, నన్ను ప్రేమించిన ప్రేక్షక మహనీయులకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీని, సినిమాలను  వీడను. ప్రపంచంలో అవినీతికి తావులేనిది ఒక్క సినిమా రంగమే. నిష్కల్మషమైన ఈ సినిమా వేదిక నాకు తల్లివంటిది. ఈ తల్లి ఒడిలో పసివాడినై జోలపాటల్లో తేలియాడుతూనే ఉంటాను” అంటారు చిరంజీవి. 

-  కుమార స్వామి (అక్షర), ‘షరతులు వర్తిస్తాయి !’  సినిమా దర్శకుడు