బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. ఆధారాలతో సహా నిరూపిస్తా : హేమ

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను..   ఆధారాలతో సహా నిరూపిస్తా : హేమ

బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని అంటున్నారు నటి హేమ. తన పేరు బయట పెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. తన పైన వస్తోన్న ఆరోపణలపై ప్రస్తుతం లీగల్ గా ఫైట్ చేస్తున్నానని చెప్పారు. నేను  సింహం లాంటి దాన్ని..  సింహం రెండు అడుగులు వెనుక వేస్తోందంటే గుంట నక్కలకు భయపడినట్టు కాదంటూ తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నాయంటూ హేమ మండిపడింది. 

తన పేరు బయటకు రావడం వలన తన కుటుంబం చాలా బాధపడుతోందని హేమ తెలిపింది. తమ ఫ్యామిలీ భోజనం కూడా సరిగా చేయడం లేదంటూ వాపోయింది.  వీడియోలలో చూపిస్తున్న వైట్ డ్రెస్ అమ్మాయి తాను కాదంటూ చెప్పుకొచ్చింది. గతంలో ఎంతో మంది అమ్మాయిలకోసం ఫైట్ చేసిన తాను.. నా కోసం ఫైట్ చేయకుండా ఉండలేనని హేమ తెలిపారు.  త్వరలోనే అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ హేమ ఛాలెంజ్ చేశారు.  

మరోవైపు బెంగళూరు‌‌ రేవ్‌‌ పార్టీ డ్రగ్స్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నటి హేమకు బెంగళూరు సెంట్రల్‌‌ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని సీసీబీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. డ్రగ్స్‌‌ కంటెంట్‌‌ పాజిటివ్‌‌ వచ్చిన 86 మందికి కూడా సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 6వ నిందితుడుగా ఉన్న జీఆర్‌‌‌‌ ఫామ్‌‌హౌస్‌‌ యజమాని గోపాల్‌‌రెడ్డిని కూడా ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.