
చెన్నై: తెలుగు, హిందీ సినిమాల సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు.. దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా నవరాత్రి. డైరెక్టర్ గా పనిచేయడానికి ముందు ఆయన తన కజిన్ తాతినేని ప్రకాశ్‌రావు దగ్గర, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎన్టీఆర్ తో యమగోల, రాజేంద్రప్రసాద్ తో గోల్ మాల్ గోవిందం, కృష్ణతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగులో కంటే హిందీలోనే తాతినేని ఎక్కువగా సినిమాలు చేయడం విశేషం. బాలీవుడ్‌లోకి వెళ్లాక దాదాపు అన్ని రీమేక్ చిత్రాలే చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో సగం రీమేక్‌లే ఉండటం గమనార్హం. తమిళంలో హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టారు. 1966 నుంచి 2000 వరకు తెలుగు, హిందీల్లో కలిపి 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.