
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ YVS చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (2025,సెప్టెంబర్ 25న) సాయంత్రం గం8.31ని॥లకు కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి తెలిపారు. తన తల్లితో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘‘భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్లిపోయారు. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు’’ అంటూ వైవిఎస్ భావోద్వేగమైన నోట్ రాశారు.
ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ‘ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. దర్శకుడు YVS చౌదరి మనో ధైర్యాన్ని పొందాలని’ ప్రార్థిస్తున్నారు.
YVS చౌదరి టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేతగా రాణిస్తున్నారు.
వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన సినిమాల విషయానికి వస్తే.. రామ్ (దేవదాసు), సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు, యువరాజు, ఒక్క మగాడు, రేయ్ సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం దర్శకుడిగా నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును పరిచయం చేస్తూ ఓ మూవీ తీస్తున్నారు.