ఇంగ్లాండ్ జట్టులో విభేదాలు.. ఆడటానికి నిరాకరించిన జాసన్ రాయ్

ఇంగ్లాండ్ జట్టులో విభేదాలు.. ఆడటానికి నిరాకరించిన జాసన్ రాయ్

వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో విభేదాలు భగ్గుమన్నాయి. వరల్డ్ కప్ జట్టు నుండి తప్పించారన్న కారణంతో ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)పై యుద్ధానికి సిద్ధమయ్యాడు. సెలెక్టర్లు తనముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించాడు. 

ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు.. స్వదేశంలో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతోంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆడటం కోసం ఈసీబీ.. రాయ్‌ని సంప్రదించగా అతను తిరస్కరించినట్లు సమచారం. దీంతో అతని స్థానంలో సోమర్‌సెట్‌ ఆటగాడు టామ్ కోహ్లెర్-కాడ్‌మోర్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.

రాయ్ స్థానంలో బ్రూక్

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మొద‌ట ప్ర‌క‌టించిన‌ వరల్డ్ కప్ ప్రాథమిక జట్టులో రాయ్ సభ్యుడు. కానీ ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వ‌న్డే సిరీస్ స‌మ‌యంలో అత‌ను వెన్ను గాయంతో బాధపడ్డాడు. ఆ సిరీస్ మొత్తం బరిలోకి దిగలేదు. దీంతో వరల్డ్ కప్ నాటికి అతను కోలుకునేది అనుమానంగా ఉండటంతో జట్టు నుంచి తప్పించి.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌‌కు చోటు కల్పించారు సెలెక్టర్లు. 

త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటన

ప్రస్తుతం జాసన్ రాయ్ వయసు 33 ఏళ్లు. ఈ వయసులో అతను మరింతకాలం ఆటలో కొనసాగకపోవచ్చు. ఒకవేళ వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారన్నదే అతని ఆగ్రహానికి కారణమైతే.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చున్న వార్తలొస్తున్నాయి.