సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉత్సాహంగా వేడుక
టొమాటో ఫెస్టివల్ అనగానే స్పెయిన్ గుర్తొస్తుంది. ‘లా టొమాటినా’ పేరుతో జరిగే ఈ పండుగతో అక్కడి బునోల్‌లో జరిగే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ ఫెస్ట్ లిస్టులో ఇంకో దేశం చేరింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనూ ఈ మధ్యే ఈ వేడుకను చేసుకున్నారు. పీటర్స్‌బర్గ్‌లోని కిరొవెట్స్ స్టేడియంలో జరిగిందీ ఉత్సవం. పండుగలో 20 టన్నుల టమాటలు వాడారు. పాల్గొన్న వారికి ఒక్కొక్కరికీ రూ.1,200 నిర్వాహకులు చార్జ్ చేశారు. పండుగ అయిపోయాక రాత్రి స్పానిష్ వంటకాల విందు, డిస్కో పార్టీ కూడా జరిగిందండోయ్. స్పెయిన్‌లోని వాలెన్సియా దగ్గర ఉన్న బునోల్‌లో ఏటా ఆగస్టు చివరి బుధవారం టొమాటో ఫెస్టివల్ జరుగుతుంది. వేలల్లో జనాలు వీధుల్లోకి వచ్చి టమాటలతో కొట్టుకుంటారు. తొలిసారి 1945లో ఇది మొదలైంది.
బునోల్‌లో ఓ పరేడ్‌లో పాల్గొన్న వ్యక్తి కింద పడిపోయినపుడు కోపంతో ఊగిపోయిన ప్రజలు పక్కనున్న షాపుల నుంచి టమాటలు తీసుకొని కొట్టారు. ఆ తర్వాత నుంచి ఇది పండుగలా మారిపోయింది. 1950 తొలినాళ్ల వరకు జరిగింది. తర్వాత బ్యాన్ చేశారు. మళ్లీ 1957లో మొదలైంది. ఇప్పుడు పూర్తిగా నియంత్రణలో జరుగుతోంది. ఏటా 22 వేల మందినే అనుమతిస్తున్నారు. వేడుక రోజు పొద్దున 11 గంటలకు ప్రజలు వీధుల్లోకి వస్తారు. అప్పటికే వీధుల్లో 120 టన్నుల టమాటలను సిద్ధం చేస్తారు. మళ్లీ ఫైర్‌వర్క్ సౌండ్ సిగ్నల్ వచ్చే వరకు వేడుక సాగుతుంది.
